Hollywood Magic: ప్రపంచాన్ని ఆకర్షించే పంథాలోనే హాలీవుడ్ పయనం

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:52 PM

స్టైల్స్ తో హోల్ వరల్డ్ ను తనవైపు తిప్పుకుంటుంది హాలీవుడ్. స్టోరీ టెల్లింగ్, ఫ్యాషన్, టెక్నాలజీ ఇలా తనదైన బాణీ పలికిస్తూ సాగుతోంది హాలీవుడ్.

స్టైల్స్ తో హోల్ వరల్డ్ ను తనవైపు తిప్పుకుంటుంది హాలీవుడ్. స్టోరీ టెల్లింగ్, ఫ్యాషన్, టెక్నాలజీ ఇలా తనదైన బాణీ పలికిస్తూ సాగుతోంది హాలీవుడ్. లోకాన్నంతా ఓ మత్తులో ముంచి తాను మాత్రం మరో అడుగు ముందుకు వేస్తూ ఉంటుంది. అదే హాలీవుడ్ మ్యాజిక్ (hollywood Majic). ఇంతకూ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చూడండి.


అనువుగా ఉపయోగిస్తేనే...
హాలీవుడ్ అందించిన టెక్నాలజీని చూసి స్ఫూర్తి చెందుతూ ఇతర దేశాల్లోని సినిమా రంగాలు సాగుతున్నాయి. తాజాగా మన తెలుగు హీరో అల్లు అర్జున్ 'రాకా' (Raaka) మోషన్ క్యాప్చర్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. రిలీజ్ కు ముందే ఓ ఇండియన్ మూవీ అందునా తెలుగు సినిమా ఈ క్రెడిట్ సాధించడంతో సినీ ఫ్యాన్స్ మన డైరెక్టర్స్ విజువలైజేషన్ ను ఎంతగానో అభినందిస్తున్నారు. ఈ విషయంలో 'రాకా' సినిమా హాలీవుడ్ కే సవాల్ విసిరిందనీ చెబుతున్నారు. అంతా బాగానే ఉంది. కేవలం టెక్నాలజీతో జిమ్మిక్స్ చేయడమే కాదు, కథాబలమున్న చిత్రాలతోనూ, మానవజాతి మనుగడకు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడంలోనూ హాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుందని చెప్పొచ్చు. హాలీవుడ్ మేకర్స్ ఎంత టెక్నాలజీతో సాగినా,  తగినరీతిలో దానిని ఉపయోగించాలని భావిస్తారు. అదేపనిగా టెక్నాలజీతో జిమ్మిక్స్ చేసిన మూవీస్ కు ఆ కేటగిరీలోనే గుర్తింపు లభిస్తుంది తప్పితే, కథాబలమున్న సినిమాలుగా పరిగణించరు. ఆ రెంటినీ మేళవించి సినిమాలు తీసినా, అందులో మానవతా విలువలు ఉన్నవే ఉత్తమ చిత్రాలుగా నిలుస్తూ ఉంటాయి. టెక్నాలజీతో పలు వండర్స్ క్రియేట్ చేసిన స్టీవెన్ స్పీల్ బెర్గ్, జేమ్స్ కేమరాన్, క్రిస్టఫర్  నోలాన్ వంటి డైరెక్టర్స్ సినిమాలను పరిశీలిస్తే ఇది తేటతెల్లమవుతుంది.

హాలీవుడ్ స్ఫూర్తితో... (Hollywood Inspiration)

సాంకేతికంగా పలు మాయలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనూ హాలీవుడ్ అగ్రగామిగా సాగుతోంది. హాలీవుడ్ మూవీస్ స్ఫూర్తితోనే ప్రపంచ వ్యాప్తంగా ఇతర చిత్రసీమలు పలు టెక్నికల్ జిమ్మిక్స్ చూపిస్తున్నాయి. విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ తీరున కొన్నిసార్లు హాలీవుడ్ కే సవాల్ విసరిన దాఖలాలూ లేకపోలేదు. యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటివన్నీ హాలీవుడ్ ప్రపంచానికి పరిచయం చేసింది. అభూత కల్పనలను సైతం సహజమైనవిగా చూపించి ప్రపంచాన్ని అబ్బురపరచింది హాలీవుడ్. ఎప్పుడో అంతమైపోయిన డైనోసార్స్ ను మన కళ్ళముందు నడయాడేలా చూపించినప్పుడు జనం వెర్రెత్తిపోయారు. సదరు చిత్రాలను చూసేందుకు  థియేటర్స్ కు పరుగులు తీశారు. కనకవర్షం కురిపించారు. వాటినే అనువుగా మలచుకొని మన దేశం, చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలూ ప్రస్తుతం జయకేతనం ఎగురవేస్తున్నాయి.




గుర్తుంచుకోవాలి...

అయితే ఇక్కడే ఓ విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు... ఈ తరహా విజువల్ వండర్స్ లో స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్స్, ఆర్ట్ డైరెక్టర్స్, సినిమాటోగ్రాఫర్స్, ఇతర టెక్నిషీయన్స్ ఘనత కనిపిస్తుందే తప్ప డైరెక్టర్ గా పేరు వేసుకొనేవారికి అంత ప్రాధాన్యం ఉండదని అంటున్నారు. అందువల్లే సదరు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయలు వసూలు చేసినా, వాటిని విజువల్ వండర్స్ అంటున్నారే తప్ప 'బెస్ట్ మూవీస్'గా గుర్తించడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొనే టెక్నాలజీతో వండర్స్ క్రియేట్ చేసిన డైరెక్టర్స్ సైతం కథాబలం ఉన్న సినిమాలకే ఓటు వేస్తున్నారు. అందులో భాగంగానే 'ది ఒడిస్సీ'ని క్రిస్టఫర్ నోలాన్ సంప్రదాయ పద్ధతిలో తెరకెక్కించారని సినీ పండిట్స్ గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి 'ది ఒడిస్సీ' వంటి పురాణగాథలో టెక్నికల్ జిమ్మిక్స్ చేయడానికి ఎంతో స్కోప్ ఉంది. అయినా క్రిస్టఫర్ నోలాన్ తనదైన కథనంతోనే ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఈ కారణంగానే రేపు అకాడమీ అవార్డ్స్ లో 'బెస్ట్ పిక్చర్' కేటగిరీలో 'ది ఒడిస్సీ' నామినేషన్ సంపాదిస్తుందనీ పరిశీలకులు భావిస్తున్నారు.

హాలీవుడ్ బాణీలోనే...

సినిమాకు చెందిన పలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అందించడంలో హాలీవుడ్ అగ్రగామిగా సాగింది. ఇక హాలీవుడ్ తెరకెక్కించిన పౌరాణికాలు, జానపదాలు, చారిత్రకాలను దృష్టిలో పెట్టుకొనే ఇతర భాషల చిత్రసీమలూ తమ కథలను రూపొందించాయి. ఈ కాస్ట్యూమ్ డ్రామాస్ లోనూ హాలీవుడ్ నే ఎంతోమంది గుడ్డిగా అనుకరిస్తూ సాగిన దాఖలాలూ ఉన్నాయి. ఇక సోషల్ మూవీస్ లో హాలీవుడ్ స్టార్స్ చూపిన స్టైల్స్ ను అనుసరించడమే సినిమా కళ అన్న రీతిన పలు తూర్పు దేశాలు ఈ నాటికీ సాగుతూ ఉండడం గమనార్హం.

గ్రహించకపోతే... అంతే...!

హాలీవుడ్ చిత్రసీమను పరిశీలిస్తే ఎప్పుడూ ఒకే పంథాలో పయనించకుండా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెదుకుతూ ఉంటుందని స్పష్టమవుతుంది. టెక్నాలజీ అధిగమిస్తోందని తెలియగానే మళ్ళీ కథాబలమున్న చిత్రాలతో సాగాలనీ ప్రయత్నిస్తుంది. ఇలా పాత, కొత్త మేలుకలయికలతో భ్రమణం సాగిస్తుంది. ఓ నాటి కొత్త మరోనాటికి పాత. ఈ నాటి పాత ఇంకోనాటికి కొత్త అన్న తీరున హాలీవుడ్ పయనం ఉంటుంది. దీనిని గమనించనివారు హాలీవుడ్ చూపిన టెక్నాలజీ బాటలోనే సాగడానికి ఉరకలు వేస్తూ ఉంటారు. ఈ లోగా హాలీవుడ్ మరో కొత్త పోకడను లోకానికి పరిచయం చేసి తాను మాత్రం ఎప్పటిలా మానవీయ విలువలున్న కథలతో సాగుతూ ఉంటుంది. అదే హాలీవుడ్ చేసే మాయ. దీనిని గ్రహించనివారు టెక్నాలజీలో హాలీవుడ్ కే సవాల్ విసిరామని, అక్కడి సినిమాలనే షేక్ చేసేశామని ఆనందిస్తూంటారు. ఈ వాస్తవం తెలుసుకున్న చిత్రసీమలు మాత్రం కథలతోనే హాలీవుడ్ కు పోటీ ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలు ఆస్కార్ బరిలో 'ఉత్తమ అంతర్జాతీయ చిత్రం' విభాగంలో ఢీకొనడానికి సై అంటూ ఉంటాయి. ఈ సత్యాన్ని ఎంతమంది ఆసియా సినీజనాలు గ్రహిస్తారో చూద్దాం.

Updated Date - Sep 27 , 2026 | 06:12 PM