Golden Globes: సినిమాల్లో ఏఐ.. అవార్డు కావాలంటే రూల్స్ పాటించాల్సిందే

ABN , Publish Date - May 09 , 2026 | 12:30 PM

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ నిర్వహణ కమిటీ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.


 
హాలీవుడ్‌, అంతర్జాతీయ సినీ, టెలివిజన్‌ రంగాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ (golden globes) ఒకటి.  ఈ అవార్డుల నిర్వహణ కమిటీ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. 2027లో దరఖాస్తు చేసుకునే చిత్రాలకు సంబంధించిన కమిటీ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. సినిమాల్లో ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వినియోగించడంపై నిబంధనలను విధించింది. భవిష్యత్తులో అవార్డుల ఎంపిక కోసం పంపించే సినిమాల్లో ఏఐ వినియోగం ఉండవచ్చని, అయితే మానవ సృజనాత్మకతే ప్రధానంగా  ఉండాలని స్పష్టం చేసింది. ఏఐని కేవలం సహాయక సాధనంగా మాత్రమే వినియోగించాలని సూచించింది.

ఏ సన్నివేశానికైనా ఏఐని ఉపయోగించినట్లయితే, దాని వివరాలను  తప్పని సరిగా వెల్లడించాలని నిర్దేశించింది. నటీనటుల స్వరం, రూపం లేదా భావ వ్యక్తీకరణలను ఏఐతో మార్చినట్లయితే ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని కోరింది. ఏఐ సహాయంతో నటనకు మెరుగులు దిద్దినా.. అసలు గుర్తింపు మాత్రం నటీనటుల ప్రతిభకే దక్కుతుందని స్పష్టం చేసింది. ఎలాంటి అనుమతి లేకుండా ఒకరి స్వరం లేదా రూపాన్ని ఏఐ ద్వారా ఉపయోగించడం పూర్తిగా అనైతికమని, అలాంటి చిత్రాలను తాము ఆమోదించబోమని హెచ్చరించింది. వచ్చే ఏడాది జనవరిలో గోల్డెన్‌ గ్లోబ్స్‌ అవార్డుల వేడకను నిర్వహించనున్నట్లు కమిటీ ప్రకటించింది.  

Updated Date - May 09 , 2026 | 12:36 PM