Global Glamour: ఎక్కడైనా టాలెంట్‌తో కొట్టుకొచ్చేస్తాం!
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:35 PM
టాలీవుడ్ హీరోయిన్లలు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం.. అక్కడి వారు ఇక్కడ తళుక్కుమనడం తెలిసిందే. అలా పాన్ ఇండియా వేదికగా తమ నటన.. అందచందాలతో మెప్పిస్తున్న మన నాయికల్లో కొందరు మరో అడుగు ముందుకేసి హాలీవుడ్ లోనూ మెరుస్తున్నారు.
టాలీవుడ్ హీరోయిన్లలు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం.. అక్కడి వారు ఇక్కడ తళుక్కుమనడం తెలిసిందే. అలా పాన్ ఇండియా వేదికగా తమ నటన.. అందచందాలతో మెప్పిస్తున్న మన నాయికల్లో కొందరు మరో అడుగు ముందుకేసి హాలీవుడ్ లోనూ (Hollywood) మెరుస్తున్నారు. ప్రపంచ సినిమాకు కేరాఫ్ అయిన ఆ పరిశ్రమలో ఇప్పటికే కొంతమంది తమ అదృష్టం పరీక్షించుకోగా.. మరికొందరు అదే బాటలో ఉన్నారు.
ఇప్పటికే డజనుకు పైగా బాలీవుడ్ ప్రాజె లో నటించి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు హీరోయిన్ దిశా పటానీ. 'ఎస్ ధోనీ: ద అన్టోల్డ్ స్టోరీ', 'లోఫర్, 'కల్కి 2898 ఏడీ' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకూ ఆమె పరిచయమే. ఇప్పుడామె హాలీవుడ్ లోను తన మార్కు చాటడానికి సిద్ధమవుతున్నారు. ' ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్' అనే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో జెస్సికా పాత్రలో నటిస్తున్నారు. దిశా పటానీ కంటే ముందు కొంతమంది హాలీవుడ్లో మెరిశారు. వారిలో మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముందు వరుసలో ఉన్నారు. మణిరత్నం తెరకెక్కించిన 'ఇద్దరు' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె... ఇటు దక్షిణాదిలో, అటు బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించి ఆ తర్వాత హాలీవుడ్ లోనూ ఆడుగుపెట్టారు. అక్కడ 'మిస్ట్రెస్ ఆఫ్ ద స్పైసెస్, బ్రైడ్ అండ్ ప్రీజుడైస్', 'పింక్ పాంథర్ 2' వంటి చిత్రాల్లో నటించి విశేష గుర్తింపు పొందారు. మరో మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా కూడా బాలీవుడ్ లో కెరీర్ ఆరంభించి ఆ తర్వాత తన మకాన్ని హాలీవుడ్ కు మార్చుకున్నారు. అక్కడ 'బేవాచ్', 'క్వాంటికో', ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ , 'బ్లఫ్' వంటి చిత్రాల్లో నటించి మంచి మార్కులు కొట్టేశారు. అలాగే 'సిటాడెల్' వంటి అంతర్జాతీయ సిరీస్ నిర్మాణంలోనూ భాగమయ్యారు. ఇప్పుడు ఆమె రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న తెలుగు చిత్రం 'వారణాసి' తో భారతీయ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరైన దీపికా పదుకొణే కూడా విన్ డీజిల్ కథానాయకుడిగా తెరకెక్కిన 'త్రిపుల్ ఎక్స్. ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' లో నటించారు. అంతేకాకుండా 'హాలీవుడ్ హాల్ ఆఫ్ పేమ్'లో స్థానం దక్కించుకున్న తొలి భారతీయురాలిగా ఘనత సాధించారు. విభిన్నమైన పాత్రలను ఎంచు కుంటూ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ఆలియా భట్ కూడా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'హార్ట్ ఆఫ్ ద స్టోన్ లో తళుక్కుమన్నారు. తెలుగులో మంచి ప్రేక్షకాదరణ తెచ్చుకున్న బాలీవుడ్ తారల్లో టబు ఒకరు. ఆమె మీరా నాయర్ తెరకెక్కించిన నేమ్ సేక్, ఆంగ్ లీ రూపొందించిన 'లైఫ్ ఆఫ్ పై' చిత్రాలతో పాటూ హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుల్లో ఒకరైన డెనిస్ వెల్లినువే దర్శకత్వంలో వచ్చిన 'డ్యూన్: ప్రాఫెసీ'లో నటించారు.