RJ Mitte Death: 34 ఏళ్లకే ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు కన్నుమూత
ABN , Publish Date - Oct 13 , 2026 | 09:46 PM
ప్రముఖ టెలివిజన్ సిరీస్ ‘బ్రేకింగ్ బ్యాడ్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్జే మిట్టే 34 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
హాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టెలివిజన్ సిరీస్ ‘బ్రేకింగ్ బ్యాడ్’ (Breaking Bad) ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్జే మిట్టే (RJ Mitte) 34 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్‌విల్లేలో అక్టోబర్ 12న ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ప్రతినిధులు ధ్రువీకరించారు. ఆయన మృతిపై వార్తలు వెలువడటంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
‘బ్రేకింగ్ బ్యాడ్’లో వాల్టర్ వైట్ కుమారుడు వాల్టర్ వైట్ జూనియర్ పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మిట్టే, నటుడిగానే కాకుండా వైకల్యాలున్న వ్యక్తుల హక్కుల కోసం గళమెత్తిన సామాజిక కార్యకర్తగానూ గుర్తింపు పొందారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా మారింది.
‘బ్రేకింగ్ బ్యాడ్’తో ప్రపంచవ్యాప్త గుర్తింపు
2008లో ప్రారంభమైన ‘బ్రేకింగ్ బ్యాడ్’ సిరీస్‌లోని ఐదు సీజన్లలోనూ ఆర్జే మిట్టే కీలక పాత్ర పోషించారు. ప్రముఖ నటుడు బ్రయాన్ క్రాన్స్టన్ పోషించిన వాల్టర్ వైట్ కుమారుడిగా ఆయన సహజ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.తన నిజ జీవిత అనుభవాలకు దగ్గరగా ఉండే పాత్రను తెరపై సహజంగా ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మిట్టేకు చిన్నతనం నుంచే సెరిబ్రల్ పాల్సీ (Cerebral Palsy) సమస్య ఉంది. అదే పరిస్థితితో జీవించే యువకుడి పాత్రను ‘బ్రేకింగ్ బ్యాడ్’లో పోషించడం ద్వారా వైకల్యాలున్న వ్యక్తుల జీవితాలపై అవగాహన పెరగడానికి ఆయన దోహదపడ్డారు.
బ్రయాన్ క్రాన్స్టన్ భావోద్వేగ నివాళి
తనతో కలిసి నటించిన ఆర్జే మిట్టే మరణవార్తపై ‘బ్రేకింగ్ బ్యాడ్’లో ఆయన తండ్రిగా నటించిన బ్రయాన్ క్రాన్స్టన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మిట్టేను 14 ఏళ్ల వయసులో కలుసుకున్నానని, అప్పటి నుంచి ఆయన ఎదుగుదలను దగ్గరగా చూశానని గుర్తుచేసుకున్నారు. వైకల్యాన్ని అడ్డంకిగా భావించకుండా ఎంతో పట్టుదలతో ముందుకు సాగారని ప్రశంసించారు. ఇటీవలే ఇద్దరం ఒకరికొకరం మెసేజ్‌లు పంపించుకున్నామని, కలిసి భోజనం చేయాలని కూడా అనుకున్నామని క్రాన్స్టన్ వెల్లడించారు. మిట్టేను ఎంతో మిస్ అవుతానంటూ భావోద్వేగం చెందారు.
మృతిపై కొనసాగుతున్న విచారణ
అయితే.. ఆర్జే మిట్టే మరణానికి సంబంధించి ఆయన ప్రతినిధి ఆత్మహత్యగా ధ్రువీకరించినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. కాగా బ్రౌన్స్‌విల్లే పోలీసులు మాత్రం మిట్టే మరణానికి గల కారణంపై ఇంకా విచారణ కొనసాగుతోందని తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అధికారిక విచారణ పూర్తయ్యే వరకు మరణానికి సంబంధించిన వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.