‘ఎండ్‌గేమ్’ కోసం మరోసారి థియేటర్లకు వెళ్లాల్సిందే.. ఇదిగో స్పెషల్ రీజన్!
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:45 AM
మార్వెల్ అభిమానులకు మరోసారి పండగ రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది.
మార్వెల్ అభిమానులకు మరోసారి పండగ రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ (Avengers Endgame) మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. మార్వెల్ స్టూడియోస్ ఈ సినిమాను ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ పేరుతో సెప్టెంబర్ 25న రీరిలీజ్ చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.ఈసారి ‘ఎండ్‌గేమ్’ను మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ముఖ్యంగా IMAX, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విజన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో సినిమాను వీక్షించే అవకాశం ఉంటుంది. పెద్ద స్క్రీన్, బ్రైట్ ఇమేజ్, ఇమర్సివ్ సౌండ్‌తో ప్రేక్షకులకు గతంలో కంటే మరింత అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’కు స్పెషల్ అట్రాక్షన్ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’. ఈ రీరిలీజ్ సందర్భంగా ‘అవెంజర్స్: డూమ్స్‌డే’కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లుక్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారు. దీంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానుల్లో ఈ రీరిలీజ్‌పై మరింత ఆసక్తి పెరిగింది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ డిసెంబర్ 18 థియేటర్లలోకి రానుంది.
కథ విషయానికి వస్తే.. థానోస్ కారణంగా విశ్వంలోని సగం జనాభా నాశనం కావడంతో మిగిలిన అవెంజర్స్ తీవ్ర విషాదంలోకి వెళ్తారు. జరిగిన నష్టాన్ని సరిదిద్దేందుకు, తమకు దూరమైన ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడంతో పాటు విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు మరోసారి ఒక్కటవుతారు. చివరికి థానోస్‌తో జరిగే పోరాటం కథను కీలక మలుపు తిప్పుతుంది. కెవిన్ ఫైజ్ నిర్మించిన ఈ చిత్రానికి ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. 2019లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’కు ఇప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు ప్రీమియం ఫార్మాట్లలో, మరింత గ్రాండ్ థియేట్రికల్ అనుభూతితో ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో మార్వెల్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.