ఇళయరాజా సంగీతం హైలైట్‌గా 'ఏ బ్యూటిఫుల్ బ్రేకప్'
ABN , Publish Date - Feb 11 , 2026 | 06:06 PM
తెలుగువారు నిర్మించిన ఆంగ్ల చిత్రం 'ఏ బ్యూటిఫుల్ బ్రేకప్'. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ ఈ నెల 13న విడుదల కాబోతోంది.
తక్ష్, మటిల్డా హీరో, హీరోయిన్లుగా నటించిన ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ 'ఎ బ్యూటిఫుల్ బ్రేకప్' (A Beautiful Breakup). ఈ చిత్రానికి అజిత్ వాసన్ ఉగ్గిన రచన చేసి దర్శకత్వం వహించారు. దీనిని తెలుగువారైన ముద్రగడ రంగారావు, ఉగ్గిన సత్యనారాయణ నిర్మించారు. గ్లోబల్ ఆడియెన్స్ ను లక్ష్యంగా చేసుకుని రూపుదిద్దుకున్న ఈ సినిమా ఇదే నెల 13న థియేటర్లలో విడుదల కాబోతోంది. దీనికి ముందు 12వ తేదీ దుబాయ్‌లో ఎక్స్‌క్లూజివ్ ప్రీమియర్ షో నిర్వహించబోతున్నారు. తొలుత ఆంగ్లంలో విడుదల చేసిన తర్వాత ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.
ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ మూవీ గురించి దర్శకుడు అజిత్ వాసన్ మాట్లాడుతూ, 'ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవాలనే ఉద్దేశంతో ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ చిత్రాన్ని పూర్తిగా ఇంగ్లీష్‌లో రూపొందించాం. మా సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది సంగీతం. లెజెండరీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా గారు మా చిత్రానికి సంగీతం అందించడం మా అదృష్టం. సినిమాను చూసిన తర్వాత ఆయన స్వయంగా ముందుకొచ్చి ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తన సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళారు' అని చెప్పారు. కథ గురించి వివరిస్తూ, 'ఓ జంట విడిపోవాలంటే తప్పనిసరిగా ద్వేషంతోనే విడిపోవాల్సిన అవసరం లేదు. సంతోషంగానూ విడిపోవచ్చు. జీవితంలో ఎక్కడో ఒకచోట మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. నిజానికి శాశ్వతమైన విడిపోవడం మరణంతోనే జరుగుతుంది. ఈ భావనతోనే ఒక సరికొత్త, భావోద్వేగాలతో నిండిన హారర్ థ్రిల్లర్‌గా దీనిని రూపొందించాం' అని అన్నారు.
ఇందులో ప్రధాన పాత్ర పోషించిన తక్ష్ మాట్లాడుతూ, 'ఈ సినిమా షూటింగ్ అత్యధిక భాగం కర్ణాటకలోని చిక్కమగళూరు అరణ్య ప్రాంతంలో, ఓ అద్భుతమైన, ప్రశాంతమైన ఎస్టేట్‌లో జరిగింది. మబ్బులతో నిండిన ఆ సహజ వాతావరణం సినిమాకు ఒక భయానకమైనా, అందమైన అనుభూతిని ఇచ్చింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ పెద్ద హైలైట్. మా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గుణశేఖరన్ విజువల్స్‌ను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. సినిమా చూసిన పాశ్చాత్య ప్రేక్షకులు కూడా గొప్పగా స్పందిస్తారనే నమ్మకం ఉంది. మాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) ఈ చిత్రానికి పూర్తి సింఫనీ ఆర్కెస్ట్రాతో, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బో టై ఆర్కెస్ట్రాతో స్కోర్‌ను కంపోజ్ చేశారు. ఇంటర్నేషనల్ విజువల్ స్టాండర్డ్స్‌ను చేరుకునేందుకు యూకేలో కలర్ గ్రేడింగ్ చేసి, సినిమాకు హాలీవుడ్ స్థాయి ఫినిష్ తీసుకొచ్చాం. ఈ సందర్భంగా మ్యాక్స్ విలియమ్స్, కమల్ గోయల్ గార్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు' అని చెప్పారు. ఇది ఒక రెగ్యులర్ హారర్ సినిమా కాదని, ఇందులోని సూపర్‌నేచురల్ ఎలిమెంట్‌ను భయానక దెయ్యంగా కాకుండా, ఒక పవిత్రమైన ఆత్మగా చూపించామని, ఈ కథ తన సన్నిహిత మిత్రుడి జీవితంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా, కల్పనతో మేళవించి రూపొందించిందని తక్ష్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా తొలి థియేట్రికల్ విడుదల అనంతరం, ఈ చిత్రాన్ని దశలవారీగా మరిన్ని దేశాల్లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్, యూకే, యూఎస్‌ఏ, కెనడా, కరీబియన్ దేశాలు, అలాగే స్పానిష్ మాట్లాడే ప్రధాన ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి.