ఇద్దరూ ఇద్దరే.. ఇటు సింగీతం అటు స్పీల్బెర్గ్

ABN , Publish Date - Jun 10 , 2026 | 09:25 PM

ఆ ఇద్దరూ ఇద్దరే... ఒకరు 94 ఏళ్ళ వయసున్న దర్శకుడు- మరొకరు 79 సంవత్సరాల డైరెక్టర్... ఇద్దరూ వెండితెరపై ప్రయోగాలు చేసిన వారే... ఆ ఇద్దరు దర్శకుల చిత్రాలు ఒక్క రోజు తేడాతో జనం ముందు నిలుస్తున్నాయి... మరి వారెవరో...!?

Steven Spielberg, Singeetham

సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) 94 ఏళ్ళ వయసులో 'సింగ్ గీతంస‌ ((Sing geetham)అనే సినిమాను రూపొందించారు. ఈ తెలుగు చిత్రంలో జూన్ 11న విడుదల కానుంది. 79 సంవత్సరాల వయసులో స్టీవెన్ స్పీల్ బెర్గ్ ( Steven Spielberg) డిస్క్లోజర్ డే (Steven Spielberg)ని తెరకెక్కించారు. ఈ సినిమా పలు భాషల్లో జూన్ 12వ తేదీన రిలీజ్ కానుంది. తెలుగువారైన సింగీతం హాలీవుడ్ డైరెక్టర్స్ కు తీసిపోని విధంగా పలు వైవిధ్యమైన చిత్రాలు తీశారు. అన్నిటినీ మించి హాలీవుడ్‌కే సవాల్ విసిరేలా సింగీతం 'ఆదిత్య 369' మూవీతో టైమ్ ట్రావెలింగ్ కు ఓ కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇక లేని ప్రపంచాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా స్టీవెన్ స్పీల్ బెర్గ్- 'ఈటీ', 'జురాసిక్ పార్క్' వంటి చిత్రాలు రూపొందించారు. అటు హాలీవుడ్ లో పేరున్న స్పీల్ బర్గ్, ఇటు ఇండియాలో తనదైన బాణీ పలికించిన సింగీతం - ఇద్దరి చిత్రాలు ఒక్క రోజు తేడాతో జనం ముందుకు రావడం విశేషంగా మారింది.

అరుదైన అంశమే..

ఓ డైరెక్టర్ 94 ఏళ్ళ వయసులో మెగాఫోన్ పట్టడమే ఓ స్పెషల్. అందునా తాను తెరకెక్కించిన చిత్రాన్ని మ్యూజికల్ గా రూపొందించడం అందులో మాటల్ని సైతం పాటలుగా పెట్టేయడం సింగీతం శ్రీనివాసరావుకే చెల్లింది. ఎందుకంటే ప్రస్తుతం మ్యూజికల్స్ ను ఎవరూ అంతగా లైక్ చేయడం లేదు. పాటలు వస్తే పరుగులు తీస్తూ బయటకు వెళ్ళి ఛాయ్, సిగరెట్ లాగించేసి వస్తున్నారు జనం. అలాంటి సమయంలో పాటలతోనే 'సింగ్ గీతం' చిత్రాన్ని నింపడం సింగీతం సాహసం అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ సమర్పణలో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించడం విశేషం. 90 ఏళ్ళు దాటాక కూడా దర్శకత్వం వహించడం రికార్డే!. అయితే తన 99 ఏళ్ళ వయసులోనూ, 109 సంవత్సరాలు నిండాక కూడా సినిమాలు తీసి 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో చోటు సంపాదించారు పోర్చుగీస్ దర్శకుడు మనోయెల్ డి ఒలివియెరా. ఆయన రికార్డ్ ను బీట్ చేయకపోయినా 94 ఏళ్ళు దాటాక ఓ మ్యూజికల్ ను తెరకెక్కించడం సింగీతం సాధించిన అరుదైన అంశమని చెప్పాలి.

ఏ తీరున సాగేనో..?

ఓ యువకుడు తన భవిష్యత్ కోసం కుబేర పురం అనే ఊరికి వెళతాడు. అక్కడ అతనికి ఎదురైన సమస్యలు- వాటిని ఎదుర్కొన్న తీరుతో 'సింగ్ గీతం' తెరకెక్కింది. ఇక 'డిస్క్లోజర్ డే'లో గ్రహాంతర జీవుల రహస్యాలను ఛేదించే దిశగా యావత్ ప్రపంచాన్నీ ఓ మీటరాలజిస్ట్, ఓ సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ అలెర్ట్ చేసే కథాంశం చోటు చేసుకుంది. 'సింగ్ గీతం'లో అహిల్యా బమ్రూ, అయాన్ కె, శాలినీ కొండేపూడి, తులసి, బెనర్జీ, అగు స్టాన్లీ నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 'డిస్క్లోజర్ డే'లో ఎమిలీ బ్లంట్, జోష్ ఓ కానర్, కొలిన్ ఫిర్త్, ఈవ్ హ్యూసన్, కోల్మన్ డొమింగో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు తేడాతో వస్తున్నా, ఎంతో వైవిధ్యంతో తెరకెక్కాయి. సింగీతం, స్పీల్ బెర్గ్ ఇద్దరూ దర్శకత్వంలో ఆరితేరిన వారే. మరి వారి చిత్రాలతో ప్రేక్షకులను ఎలా రంజింప చేస్తారో చూడాలి.

Updated Date - Jun 10 , 2026 | 09:25 PM