ఫంకీ మూవీ రివ్యూ
ABN , Publish Date - Feb 13 , 2026 | 02:09 PM
విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించిన సినిమా 'ఫంకీ'. అనుదీప్ కె.వి. దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.
విశ్వక్ సేన్ (Vishwak Sen) కు కొంతకాలంగా టైమ్ కలిసి రావడం లేదు. అతని చిత్రాలు ఏవీ ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. అదే సమయంలో 'జాతిరత్నాలు' తప్పితే అనుదీప్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ మరో చిత్రం లేకపోయింది. ఇక హీరోయిన్ కయాదు లోహర్ (Kayadu Lohar) నటించిన తొలి తెలుగు సినిమా 'అల్లూరి' అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సో... ఈ ముగ్గురు తమ కాంబినేషన్‌లో వస్తున్న 'ఫంకీ' (Funky) మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సంక్రాంతి కానుకగా వచ్చిన 'అనగనగా ఒక రాజు' మూవీతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెనుకే వస్తున్న 'ఫంకీ' కూడా మంచి విజయాన్ని అందుకుంటుందనే ధీమాను ప్రమోషన్స్ సమయంలో ఆయన వ్యక్తం చేశాడు. మరి వీరందరి ఆశలు నెరవేరాయో లేదో తెలుసుకుందాం.
కోమల్ (విశ్వక్ సేన్) కొత్త దర్శకుడు. 'మంచి ప్రొడక్షన్స్' అనే బ్యానర్ మీద సినిమాలు నిర్మించే సుదర్శన్ (నరేశ్)ను బుట్టలో వేసుకుని, నాలుగు కోట్లలో 'ఫంకీ' అనే సినిమా తీస్తానని చెప్పి... నలభై కోట్లు చేసేస్తాడు. అయినా సినిమా పూర్తి కాదు. అందుకు మరో నాలుగు కోట్ల రూపాయలు కావాలనడంతో సుదర్శన్ తీవ్రమైన ఒత్తిడికి లోనై, ఆస్పత్రి పాలవుతాడు. దాంతో తండ్రి బాధ్యతలను కూతురు చిత్ర (కయాదు లోహర్) టేకప్ చేస్తుంది. కేవలం కోటి రూపాయలతో బాలెన్స్ షూటింగ్ చేయమని కోమల్‌కు అల్టిమేటమ్ ఇస్తుంది. ఇదిలా ఉంటే... ఆ సినిమా విడుదలను అడ్డుకోవాలని ఫిల్మ్ ఫైనాన్షియర్ ప్లస్ గూండా అయిన జీకే (సంపత్ రాజ్) చూస్తుంటాడు. కోమల్ 'ఫంకీ' సినిమాను పూర్తి చేశాడా? ఈ క్రమంలో చిత్రతో అతనెలా ప్రేమలో పడ్డాడు? కోమల్ మూవీని ఆపాలని జీకే ఎందుకు అనుకున్నాడు? అనేది మిగతా కథ.
సినిమా రంగం మీద తీసిన సెటైరికల్ కామెడీ మూవీ 'ఫంకీ'! ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న పరిస్థితులకు అద్దం పట్టిందీ సినిమా. ప్లానింగ్ లేని దర్శకులు ఎలా మూవీ బడ్జెట్ ను దారుణంగా పెంచేస్తుంటారు? అమాయకంగా వారి బుట్టలో పడి నిర్మాతలు ఎలా బలి అవుతుంటారు? అనే దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. పనిలో పనిగా పలువురు నిర్మాతలు, దర్శకుల పేర్లను యథేచ్ఛగా వాడేసుకున్నారు. దర్శకుడు కోమల్ బాధితులుగా ఇటు 'దిల్' రాజు, అటు నాగవంశీ కనిపిస్తారు. అలానే ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలపైనా, వాటిని నిర్మించిన ప్రొడ్యూసర్స్ పైన కూడా సెటైర్స్ వేశారు. ఆ క్రమంలో కామెడీని పండించే ప్రయత్నం చేశారు. కానీ అవేవీ పెద్దంతగా పేలలేదు. అనుదీప్ మూవీ అంటే కథ అసలు ఉండదనేది అందరి నమ్మకం! కానీ మూవీ ప్రమోషన్స్ టైమ్‌లో ఇందులో కొంత కథ ఉందని మేకర్స్ నమ్మబలికారు. బట్... గాలిని పోగేసి తీసిన సినిమా తప్పితే ఇది మరొకటి కాదు. సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్‌తో, రెండు గంటల పాటు కథ లేకుండా ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయడం అంత సులువు కాదని బంధాలు, బంధుత్వాలు, వాటి ప్రాధాన్యం అంటూ పులిహోర కలిపే ప్రయత్నం చేశారు. అది కూడా ఆర్టిఫియల్‌గా ఉండిపోయింది తప్పితే, ప్రేక్షకులకు ఏరకంగానూ కనెక్ట్ కాలేదు.
విశ్వక్ సేన్, అనుదీప్ కలిస్తే ఏదో మ్యాజిక్ జరిగిపోతుందని నిర్మాత నాగవంశీ ఎలా నమ్మారో అర్థం కాదు. వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న విశ్వక్ సేన్... అనుదీప్‌ను నమ్మి నిండా మునిగి పోయాడనిపిస్తుంది. విశ్వక్ సేన్ క్యారెక్టర్ విషయంలో కూడా దర్శకుడికి క్లారిటీ ఉన్నట్టు అనిపించదు. అతన్ని పాజిటివ్‌గా ప్రజెంట్ చేయాలని అనుకున్నాడో నెగెటివ్‌గా ప్రజెంట్ చేయాలని అనుకున్నాడో అర్థం కాదు. విశ్వక్ సేన్ తన వరకూ తను బాగా చేశాడు. కయాదు లోహర్ అందంలో, అభినయంలో చాలా చోట్ల హీరోను డామినేట్ చేసింది. ఇందులో పాత్రలు, వాటి తీరుతెన్నుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నరేశ్, ఈశ్వరీ రావు, అతిథి భావరాజు, సంపత్ రాజ్, పమ్మి సాయి ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమా దర్శకుడు అనుదీప్ మాత్రమే కాదు 'మ్యాడ్' డైరెక్టర్ కళ్యాణ్ శంకర్, హరీశ్ శంకర్ కూడా ఇందులో మెరిశారు. భీమ్స్ తన మ్యూజిక్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయాడు. సురేశ్ సారంగం సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్‌గా ఉంది. బెటర్‌మెంట్ చేసే క్రమంలో కొన్ని పాత్రలు ఎడిటింగ్‌లో ఎగిరిపోయాయని తెలుస్తోంది. అంతేకాదు... విచ్చలవిడిగా చేసిన కటింగ్స్‌తో ఎడిటర్‌పైనా తలకు మించిన భారం మోపారని అర్థమౌతోంది. ఇందులో కోమల్ తీసిని 'ఫంకీ' సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టు చూపిస్తారు. ఆ సీన్స్‌ను చూసి మేకర్స్ సంతృప్తి పడాల్సిందే. నిజం చెప్పాలంటే... 'ఫంకీ' ప్రమోషన్స్‌ను కాస్తంత క్రియేటివ్‌గా చేశారు. వాటి మీద పెట్టిన దృష్టి ఫిల్మ్ మేకింగ్ మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది.
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: పులిహోర కలిపారు!