Makutam Review: విశాల్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఎలా ఉందంటే..

ABN , Publish Date - Aug 14 , 2026 | 04:17 PM

యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కొన్నాళ్లుగా రొటీన్ రొట్ట కొట్టుడు కథలనే ఎంచుకుంటూ సక్సెస్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకుడిగా పరిచయమవుతూ ‘మకుటం’ తెరకెక్కించారు. డైరెక్షన్ ఆయన చిరకాల కోరిక. ‘మకుటం’ (Makutam)తో ఆ కోరిక నెరవేరింది.

సినిమా రివ్యూ: 'మకుటం' (Makutam Review)
విడుదల తేది:
14-8-2026


యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కొన్నాళ్లుగా రొటీన్ రొట్ట కొట్టుడు కథలనే ఎంచుకుంటూ సక్సెస్ కు  దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకుడిగా పరిచయమవుతూ ‘మకుటం’ తెరకెక్కించారు. డైరెక్షన్ ఆయన చిరకాల కోరిక. ‘మకుటం’ (Makutam)తో ఆ కోరిక నెరవేరింది. ఆయన నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రమిది. అంజలి, దుషారా విజయన్ నాయికలు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలో వచ్చిన 99వ చిత్రమిది. శుక్రవారం తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో విశాల్ దర్శకుడిగా సక్సెస్ మెప్పించాడా? లేదా అన్నది చూద్దాం.

కథ:
కృపాకర్ (విశాల్) ఓ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. ఇష్టపడిన అమ్మాయి జమున (దుషారా విజయన్)ను పెళ్లి చేసుకుని చాలీచాలని జీతంతో జీవితం గడిపేస్తుంటాడు. పెళ్లి చూపుల సమయంలో తన మామగారికి కారు ఉందని అబద్దం చెప్పడంతో దాన్ని నిజం చేయడానికి నానా తిప్పలు పడుతుంటాడు. అతని గోల పడలేక ఏదోలా తిప్పలు పడి సెకెండ్ హ్యాండ్ బీఎమ్డబ్య్లూ కారు కోనుగోలు చేసి భార్య పిల్లలతో సరదాగా ఊటీ ట్రిప్ వేస్తాడు. ఈ ప్రయాణంలో ఓ గ్యాంగ్ ఫాలో అయి ఎటాక్ చేస్తుంది. ఆ ఎటాక్లో భార్య, పాపను కోల్పోతాడు. ప్రాణాలతో బయటపడి కొడుకును తీసుకుని కృపాకర్ పరుగులు తీస్తాడు. ఈ విషయం విశాఖపట్నం, అక్కడి పోర్టును తన గుప్పిట్లో పెట్టుకున్న లింగ (విశాల్)కు చేరుతుంది. గాయాలతో ఉన్న కొడుకును పరామర్శించేందుకు లింగ వచ్చినప్పుడు, కృపాకర్ ఆగ్రహంతో అతడిపై విరుచుకుపడతారు. తన భార్య, పిల్లల మరణానికి లింగానే  కారణమని నిందిస్తాడు. తండ్రీ కొడుకులైన లింగ, కృపాకర్ మధ్య ఎందుకు దూరం ఏర్పడింది? కృప కుటుంబంపై దాడి చేసింది ఎవరు? లింగ భార్య అన్నపూర్ణ (అంజలి) మరణానికి కారకులెవరు? వీటన్నింటి వెనుక దాగిన నిజం ఏమిటి? అన్నదే ఈ ‘మకుటం’ కథ.


విశ్లేషణ (Makutam Movie Review)
కృపాకర్ లైఫ్ తో  కథను ప్రారంభించారు. ఇంటర్వెల్ కు ముందు ఓ ఎటాక్. ఆపై ఓ ప్లాష్ బ్యాక్. అక్కడి వరకూ రొటీన్గా ఉన్నా... ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకండాఫ్ లో ఏదో ఉంటుందేమో అనే ఆసక్తి కలుగుతుంది. ఆపై తండ్రి లింగా పాత్ర తెరపైకి వస్తుంది. కొడుకు బాగు కోసం తండ్రి (లింగా పాత్ర) అందరికీ దూరంగా ఉంటూ… జీవితాన్ని సాగిస్తుంటాడు. అతని లక్ష్యం ఒక్కటే హార్బర్ లోకి  నకిలీ గూడ్స్ దిగకూడదు. చైనా నుంచి దిగుమతి అయ్యే డూప్లికేట్ స్పేర్ పార్ట్స్ ఆపడం, నకిలీ స్పేర్ పార్ట్స్ వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడం అతని లక్ష్యం. దాని కోసమే పోర్టులో మార్టిన్ తో పాటు పలువురు విదేశీయులతో పోరాటం చేస్తుంటాడు. కొడుకుకు ఆ మట్టి అంటకూడదని వారికి దూరంగా ఉంటాడు. లింగా భార్య అంజలి. వీరి పాత్రల్లో భావోద్వేగాలు ఉన్నా తెరపై అవి సరిగ్గా చూపించలేకపోయారు. అయితే క్లైమాక్స్ లో ఆడవాళ్లతో తీసిన ఫైట్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. అంతకుమించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి పేవలమైన కథతో విశాల్ దర్శకుడిగా పరిచయం కావటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.


నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
విశాల్ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. లింగ, కృపాకర్ పాత్రల్లో తండ్రి కొడుకులుగా డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు. తండ్రి గెటప్, వాయిస్ విశాల్ కు  అసలు సూట్ కాలేదు. యంగ్ గెటప్ కాస్త ఫర్వాలేదు. దుషారా విజయన్, అంజలి పాత్రలు ఓకే. జాన్ విజయ్, జయప్రకాశ్, మార్టిన్ పాత్రధారులు ఇలా ప్రతి ఒక్కరి నటనలో అతి కనిపిస్తుంది. కెమెరా వర్క్ ఫర్వాలేదు. వీఎఫ్ఎక్స్ విషయంలో అంత జాగ్రత్త తీసుకోలేదు. జీవీ ప్రకాష్ కుమార్ పాటలు, నేపథ్య సంగీతం బాదుడే బాదుడు. ఇది జీవీ సంగీతమేనా అనిపిస్తుంది. యాక్షన్ కొరియోగ్రఫీ కొంచెం కొత్తగా ఉంది. పాటలు, డాన్స్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు బావున్నాయి.  దర్శకుడుగా విశాల్ విషయానికొస్తే.. హీరో కమ్ దర్శకుడుగా రెండు బాధ్యతల ఒత్తిడి కనిపించింది. రొటీన్ ఫార్ములాతో వెళుతున్నపుడు ట్రీట్మెంట్ కొత్తగా ఉండాలి. పాత్రల్లో వైవిధ్యం చూపించాలి. ఆ జాగ్రత్తలేవీ తీసుకోలేదు. అదే సినిమాకు పెద్ద మైనస్ అయింది. సో… దర్శకుడిగా విశాల్ తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.


ట్యాగ్‌లైన్‌: కొత్తదనం లేని 'మకుటం'
రేటింగ్‌: 2/5

    

Updated Date - Aug 15 , 2026 | 10:47 AM