'నాన్న కుట్టి' తండ్రీకూతుళ్ల కథ.. మెప్పించిందా?
ABN , Publish Date - Nov 26 , 2026 | 02:01 PM
విజయ్ ఆంటోని నటించిన ‘నాన్న కుట్టి’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
సినిమా రివ్యూ: ‘నాన్న కుట్టి’
సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారిన విజయ్ ఆంటోని 'బిచ్చగాడు 2'తో దర్శకుడుగా కూడా మారారు. విభిన్నమైన కథలతో సినిమాలు చేసే విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం ‘నాన్న కుట్టి’. డాటర్ సెంటిమెంట్‌తో ఎం.యు. మారన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫాతిమా ఆంటోని నిర్మించారు. జవ్వాజి రామాంజనేయులు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శుక్రవారం ప్రేక్షలకు ముందుకు రానున్న ఈ సినిమాను రెండు రోజుల ముందే ప్రదర్శించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
సూర్య (విజయ్ ఆంటోని) సినిమా ప్రొడక్షన్లో లొకేషన్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. ఆయనకు భార్య ఉండదు. ఉన్న ఒక్క కూతురు దియా (లితన్య)ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. దియా స్కూల్ టీచర్ అనిత (ప్రీతి ఆస్రాని) సూర్యను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ సూర్య అందుకు నిరాకరిస్తాడు. ఆమె గట్టిగా అడిగే ప్రయత్నం చేయడంతో స్కూల్లో దియాకు టీసీ తీసుకుని దుబాయ్ వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ విషయం తెలియడంతో దియా స్పృహ తప్పి పడిపోతుంది. ఆస్పత్రికి తరలించగా, ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతారు. ఆ వ్యాధి నుంచి బయటపడాలంటే దియా తల్లిదండ్రులు మరో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంటుంది. లేదంటే దియా మరణిస్తుంది. అప్పుడే సూర్య దియాకు అసలు తండ్రి కాదని, పసిబిడ్డగా ఉన్న సమయంలో ఆమెను తీసుకొచ్చి పెంచుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే దియా తల్లిదండ్రులు ఎవరు? ఆమెకు వచ్చిన ప్రాణాంతక వ్యాధి ఏమిటి? దియా ప్రాణాలను రక్షించడానికి సూర్య ఏం చేశాడు? అన్నది కథ.
విశ్లేషణ:
పూణెలోని ఓ ప్రాంతంలో అరుదైన వ్యాధితో బాధపడిన ఓ చిన్నారి కథకు కల్పిత అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమిది. సినిమా అంతా తండ్రీకూతుళ్ల మధ్య సాగే అనుబంధం చుట్టూ తిరుగుతుంది. ఫస్టాఫ్‌లో సూర్య పరిచయ సన్నివేశాలు, బస్టాండ్‌లో బిచ్చగాళ్ల చెరలో ఉన్న దియాను చూడటం, తనను తీసుకొచ్చి పెంచుకుంటూ కొత్త జీవితాన్ని ఇవ్వడం, దియా స్కూల్ డేస్ వంటి సన్నివేశాలతో కథ సో సోగా సాగుతుంది. ఇంటర్వెల్ సమయానికి వచ్చే ఓ ట్విస్ట్‌తో కథపై కాస్త ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్ అంతా దియా ఆరోగ్యం చుట్టూ నడుస్తుంది. ఆమెను బతికించుకోవడానికి పెంపుడు తండ్రి సూర్య ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అసలు దియా ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? అన్నది ఆసక్తికరంగానే ఉన్నా, కథనం సాగదీతగా అనిపిస్తుంది. ఆమెను బతికించడానికి దర్శకుడు చెప్పిన రీజన్ బాగానే ఉంది. కానీ దాని చుట్టూ వేర్వేరు తల్లిదండ్రులను తెరపైకి తీసుకొచ్చి, కేసులు, కోర్టు సన్నివేశాలతో కథను కిచిడీ చేసేశారు. దాంతో అసలు కథ ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. చూసిన సన్నివేశాలే మళ్లీ మళ్లీ చూస్తున్న భావన కలుగుతుంది. దర్శకుడు ఎంచుకున్న లైన్ బాగానే ఉన్నా, దాన్ని కథగా మలిచి తెరకెక్కించడంలో తడబాటు కనిపించింది. నిజ జీవితంలో జరిగిన కథను మరింత రియలిస్టిక్‌గా చెప్పే అవకాశం ఉన్నా, దర్శకుడు ఆ వాస్తవికతను మిస్ చేశారు. కొన్ని సన్నివేశాలు పరమ రొటీన్‌గా అనిపిస్తాయి. సూర్య, దియా మధ్య వచ్చే సన్నివేశాలను మనం ఎన్నో సినిమాల్లో చూసి ఉన్నాం. తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం ఎన్ని సార్లు చెప్పినా కొత్తగానే ఉంటుంది. అయితే సన్నివేశాల్లో బిగుతు లోపించింది. ఇక కోర్టు సీనన్స్ అయితే భారంగా సాగినట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ చివరి పది నిమిషాల ఎమోషనల్ సీన్స్ కొంత వరకూ ఆ లోటు భర్తీ చేశాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. సూర్య పాత్రలో విజయ్ ఆంటోని ఒదిగిపోయాడు. ప్రీతి ఆస్రాని కూడా టీచర్‌గా ఆకట్టుకుంది. చిన్నారి దియాగా లితన్య భావోద్వేగాలను చక్కగా పండించింది. సూర్య స్నేహితుడిగా నటించిన ఆర్టిస్ట్ అక్కడక్కడా వినోదం పంచే ప్రయత్నం చేశాడు. చక్కని లొకేషన్స్ తోడవటంతో రాజీవ్ రాజేంద్రన్ కెమెరా పనితనం చూపించాడు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనినే సంగీతం అందించడంతోపాటు ఎడిటర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. విన్నంతసేపు పాటలు బాగున్నట్లు అనిపించినా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కటి గుర్తుండకపోవడం పెద్ద మైనస్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొంత వరకూ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రియలిస్టిక్ ఇన్సిడెంట్ ను తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడు అయిపోతుందా అనే భావనలోనే ఉంటాం. దీనికి ముందు వచ్చిన ‘వంద దేవుళ్ళు’ సినిమాతో సెంటిమెంటల్ గా ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ దానిని కొనసాగించలేకపోయాడు.
ట్యాగ్‌లైన్: సీరియల్ లా సాగిన సెంటిమెంట్
రేటింగ్: 2/5