సినిమా రివ్యూ: 'వసుదేవ సుతం’
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:53 PM
మాస్టర్ మహేంద్రన్ నటించిన చిత్రం వసుదేవ సుతం’. అంబికా వాణి కథానాయికగా రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మీ బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు.శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
సినిమా రివ్యూ: 'వసుదేవ సుతం’
విడుదల తేది: 10–7–2026
దేవి, సింహరాశి వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మాస్టర్ మహేంద్రన్ తమిళంలో మంచి అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. తెలుగులో ఆయన నటించిన చిత్రం వసుదేవ సుతం’. అంబికా వాణి కథానాయికగా రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మీ బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్ చంద్ర మీనన్, ఐశ్వర్య లక్ష్మి, తులసి, శివన్నారాయణ తదితరులు కీలక పాత్రధారులు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
పురుషోత్తమపురిలో అతి పురాతన వాసుదేవ దేవాలయం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ దేవాలయ ఛైర్మన్ శర్మ(దువ్వాసి మోహన్)ని హీరా బంధ్(మైమ్ గోపి)చంపేసి చైర్మన్ ఎన్నికల్లో తన తండ్రి రామరాజును గెలిపించుకుంటాడు. ఆ ఊళ్లో ఘనంగా జరిగే వాసుదేవుని ఉత్సవాలకు హైదరాబాద్‌లో నుంచి కృశవ్ (మహేంద్రన్) ఆ ఊరికి వస్తాడు. హీరా బంధు మేనకోడలు భువి (అంబికా వాణి) కూడా ఆ ఉత్సవాలకు వస్తుంది. తొలి చూపులోనే ఇద్దరూ ప్రేమలో పడతారు. అయినా భయపడకుండా ప్రేమను కొనసాగిస్తారు. అయితే మరోపక్క కృశవ్ అంతకుముందు దేవాలయ ఛైర్మన్ ఏమయ్యాడు? ఆ పక్క గ్రామమైన కోయిరాతలకు జనం వెళ్లడానికి ఎందుకు భయపడతారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇదిలా ఉండగా సెంట్రల్ మినిస్టర్ (జాన్ విజయ్) కృశవ్‌కి ఫోన్ చేయడంతో అతను జైలు నుంచి వచ్చాడని ప్రియురాలి కుటుంబ సభ్యులకి తెలుస్తుంది. అసలు కృశవ్ ఎవరు? సెంట్రల్ జైలుకి ఎందుకు వెళ్లాడు. వాసుదేవ ఆలయంలో ఏముంది? సెంట్రల్ మినిస్టర్ కన్ను ఆలయంపై ఎందుకు పడింది? అన్నది ఈ సినిమా ఇతివృత్తం.
విశ్లేషణ..
పురుషోత్తమపురిలో ఉన్న దేవాలయ చైర్మన్ పదవిపై కన్నేసి దానికి అడ్డు వచ్చిన వారిని హతమార్చుతూ ముందుకెళ్లే ఓ నియంత, ఆ దేవాలయ ఆస్తులను కాపాడటానికి ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా. దేవాలయం ఛైర్మన్ పదవిపై కన్నేసిన పెద్ద మనిషి, అతను చేసే పనులు, హీరో హీరోయిన్స్ ప్రేమకథతో ఫస్టాఫ్ సాగుతుంది. ఈ పార్ట్ అంతా రొటీన్‌గా ఉండి ప్రేక్షకుడికి పరీక్షగా మారుతుంది. సిల్లీ లవ్ సీన్స్, ఫైట్స్‌తో ఫస్టాఫ్ బోర్ కొట్టించారు. ఇంటర్వెల్‌కి హీరో జైలు నుంచి తప్పించుకు వచ్చాడని తెలియడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. అక్కడ హీరో ఫ్లాష్‌బ్యాక్ రొటీన్‌గా ఉన్నా కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సిస్టర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. ఆపై ట్రెజర్ హంట్ మోడ్‌లోకి కథ వెళ్లుంది. అయితే ఈ సీన్స్ పేలవంగా ఉంది ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. క్లైమాక్స్‌లో అసలు విలన్ ఎవరు అనే సస్పెన్స్ మాత్రం ఆకట్టుకుంటుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితీరు...
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించిన మాస్టర్ మహేంద్రన్ కృశవ్ పాత్రలో ఫర్వాలేదనిపించారు. కానీ హీరోగా రాణించాలి అంటే ఇంకా హార్డ్‌వర్క్ చేయాలి. హీరోయిన్ అంబికా ఓకే. గ్లామర్‌తో అలరించింది. నెగిటివ్ పాత్రలో మైమ్ గోపి, జాన్ విజయ్.. ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు. ఆటో రామ్ ప్రసాద్, తులసి, రాజీవ్ కనకాల, టార్జాన్, సమేత బజాజ్, దువ్వాసి మోహన్, శివన్నారాయణ, ఐశ్వర్య లక్ష్మి.. ఇతర పాత్రధారులు పరిధి మేరకు నటించారు. జిజ్జు సన్నీ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. కథకు లింక్ లేని సన్నివేశాలు ఎడిటర్ కత్తిరించాల్సింది. మణిశర్మ నేపథ్య సంగీతం ఆయన స్థాయికి తగ్గట్టు లేదు. యాక్షన్స్ సీన్స్, గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయి. కథకు తగ్గట్టే నిర్మాణ విలువలున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఓ దేవాలయం, దాని వెనకున్న నిధి నేపథ్యంలో సాగే కథ. దర్శకుడు తీసుకున్న లైన్ బాగున్నా తెరకెక్కించడంతో ఘోరంగా విఫలమయ్యాడు.
ట్యాగ్‌లైన్: వసుదేవ సుతం.. విఫలయత్నం..
రేటింగ్: 2/5