ఎస్. సరస్వతి మూవీ రివ్యూ
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:54 PM
ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమా 'ఎస్. వరలక్ష్మీ'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ కోర్ట్ డ్రామా మార్చి 6న విడుదలైంది.
ప్రముఖ నటుడు శరత్ కుమార్ (Sarath Kumar) కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ సైతం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భిన్నమైన పాత్రలు చేస్తున్నారామె. తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ తన సోదరి పూజతో కలిసి 'సరస్వతి' (Saraswathi) అనే సినిమాను నిర్మించడంతో పాటు ఆమె స్వయంగా దర్శకత్వం వహించారు. అయితే సెన్సార్ సూచన మేరకు ఈ సినిమా పేరు చివరి క్షణంలో 'ఎస్. సరస్వతి' (S Saraswathi) గా మారింది. శుక్రవారం విడుదలైన 'ఎస్. సరస్వతి' ఎలా ఉందో తెలుసుకుందాం.
సింగిల్ మదర్ లక్ష్మీ (వరలక్ష్మీ శరత్ కుమార్) నర్స్. పన్నెండేళ్ళ తన కుమార్తె సరస్వతితో కలిసి ఓ కాలనీలో నివసిస్తూ ఉంటుంది. ఆగస్ట్ 15వ తేది సరస్వతి పుట్టినరోజు. తన కూతురును స్కూల్‌లో దించి, లక్ష్మీ తిరిగి వచ్చే సరికీ పాప కనిపించకుండా పోతుంది. లక్ష్మీ పోలీసులను ఆశ్రయిస్తే... వాళ్ళు చేసే ఎంక్వయిరీలో అసలు సరస్వతి పేరుతో ఆ స్కూల్‌లో ఎవరూ చదవడం లేదని తెలుస్తుంది. అదే రోజు రాత్రి తన కూతురుని స్కూల్ గదిలో ముగ్గురు మానభంగం చేసి చంపేశారని, ఆమెను తానే ఖననం చేశానని లక్ష్మీ పోలీస్‌లకు చెబుతుంది. దాంతో ఎస్. ఐ. శ్మశానానికి వెళ్లి ఖననం జరిగిన ప్రదేశంలో చూస్తే... అక్కడ ఎలాంటి శవం కనిపించదు. తన కూతురు మరణానికి కారకులైన వారిని శిక్షించేలా చేయమని ఆమె లాయర్ రామానుజం (ప్రకాశ్ రాజ్)ను కోరుతుంది. లక్ష్మీలోని నిజాయితీని గుర్తించిన రామానుజం కేస్ టేకప్ చేస్తాడు. అదే సమయంలో లక్ష్మీ కలెక్టర్‌ను, పోలీస్ ఆఫీసర్‌ను, రిటైర్డ్ జడ్జిని హత్య చేసి పోలీసులకు లొంగిపోతుంది. లక్ష్మీ ప్రవర్తనతో అందరూ కంగుతింటారు. అసలు ఆమె నేపథ్యం ఏమిటీ? ముగ్గురు ప్రముఖులను ఆమె హత్య చేయడానికి కారణం ఏమిటనేది తెలుసుకోవాల్సిందిగా కోర్టు రామానుజంను ఆదేశిస్తుంది. ఈ క్రమంలో ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన వాస్తవాలు ఏమిటనేదే మిగతా కథ.
తమ కుమార్తెకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చేయమని పోరాడిన తల్లిదండ్రుల కథ ఇది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలు అత్యంత నీచానికి ఒడిగట్టి కూడా సరైన సాక్షాలు లేకపోవడంతో తప్పించుకుని దొరలుగా తిరుగుతుంటే... ఓ ఆడబిడ్డ ఎలా తిరగబడి వారికి శిక్ష విధించిందనేది ఈ సినిమాలోని ప్రధానాంశం. ఇలాంటి రివేంజ్ డ్రామాలు గతంలో అనేకం వచ్చాయి. అయితే... వరలక్ష్మీ పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. థియేటర్‌లోని ప్రేక్షకులతో మైండ్ గేమ్ ఆడారు. అసలు మనం తెర మీద చూస్తున్న పాత్రలు ఎవరివి? వారికీ విక్టీమ్‌కు ఉన్న సంబంధం ఏమిటీ? ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? అనేది గెస్ చేయలేనేని విధంగా స్క్రీన్ ప్లేతో డ్రామాను రక్తి కట్టించారు. మర్డర్ మిస్టరీకి కోర్ట్ డ్రామాను మిక్స్ చేయడంలో ఆమె సక్సెస్ అయ్యారు. అయితే... కథలోని అనేక లొసుగుల కారణంగా ఇది సీట్ ఎడ్జ్ లో ప్రేక్షకులను కూర్చోపెట్టలేక పోయింది. ప్రతి సన్నివేశం గతంలో ఏదో ఒక చోట చూసినట్టే అనిపిస్తుంది. ఈ సినిమా ప్రధాన బలం కథ కంటే కథనం. అలానే నటీనటులంతా ఎంతో అనుభవజ్ఞులు కావడంతో సన్నివేశాలకు బలం చేకూరింది.
దర్శక నిర్మాతగా కీలక బాధ్యతలు చేపట్టిన వరలక్ష్మీ ఇందులో కీలక పాత్రను పోషించి, మెప్పించింది. అలానే ప్రియమణి (Priyamani), కిశోర్ (Kishore) ఆయా పాత్రలలో ఒదిగిపోయారు. గతంలో ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఎన్నో లాయర్ పాత్రలను పోషించారు. ఇందులోనూ తనదైన శైలిలో నటించారు. మురళీశర్మ, తులసి, సప్తగిరి, రావు రమేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, రఘుబాబు, హరీశ్ పేరడీ, రాధిక, నాజర్, దేవీ ప్రసాద్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో తమిళ నటుడు జీవా (Jeeva) కూడా ఓ కీ-రోల్ ప్లే చేశాడు. అలానే వరలక్ష్మీ శరత్ కుమార్ తల్లి ఛాయాదేవీ... జీవా తల్లిగా నటించారు.
తమన్ సమకూర్చిన నేపథ్య గీతాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రానికి మూలకథను సాయి మాధవ్ బుర్రా అందించగా, వరలక్ష్మీ శరత్ కుమార్ దానిని విస్తరింప చేశారు. సాక్షాధారాలు లేని కారణంగా అన్యాయానికి గురైన ఓ మహిళ, చట్టాన్ని తెలివిగా తన చేతుల్లోకి తీసుకుని ఎలా పగను తీర్చుకున్నదనే దాన్ని ఊహకందని ట్విస్టులతో వరలక్ష్మీ తెరకెక్కించారు. దర్శకురాలిగా ఇది ఆమె మొదటి సినిమానే అయినా... ఎక్కడా ప్రేక్షకులు కన్ ఫ్యూజన్‌కు గురి కాకుండా చేశారు. అయితే... ఇలాంటి సినిమాలు ఓటీటీలో థ్రిల్‌ను కలిగిస్తాయి కానీ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం కష్టమే!
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: రివేంజ్ కోర్ట్ డ్రామా!