Vaazha 2 Review: కేర‌ళ‌లో రూ.200 కోట్లు కొల్ల‌గొట్టిన.. ‘వాలా2' మూవీ రివ్యూ

ABN , Publish Date - Apr 24 , 2026 | 10:47 AM

ప్రస్తుతం మలయాళ చిత్రాల హవా బాగా వీస్తోంది. చిన్న కథ, సహజత్వం, హంగులు లేని సెటప్పులు.. ఇదే మలయాళ సినిమా ఫార్ములా. ఈ మధ్యకాలంలో అలా వచ్చిన ప్రతి సినిమా హిట్టై, కాసుల వర్షం కురిపించాయి. తాజాగా వచ్చిన మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాలా2: బయోపిక్‌ ఆఫ్‌ బిలియన్‌ బ్రోస్‌’. 2024లో వచ్చిన ‘వాలా’ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కింది.

సినిమా రివ్యూ: ‘వాలా2: బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్’ 

ప్రస్తుతం మలయాళ చిత్రాల హవా బాగా నడుస్తోంది. చిన్న కథ, సహజత్వం, హంగులు లేని సెటప్పులు భారీ విజయాలు.. ఇదే మలయాళ సినిమా ఫార్ములా. అలా ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు వచ్చి ఘన విజయం సాధించి కాసుల వర్షం కురిపించాయి. ఆ కోవకు చెందిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘వాలా2: బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్’. 2024 లో వచ్చిన ‘వాలా’ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కింది. సావిన్ షా దర్శకుడు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన హషీర్, అలెన్, వినాయక్, అజిన్ జాయ్ ఇందులో కీలక పాత్రధారులు. ఏప్రిల్ మొదటి వారంలో మలయాళంలో విడుదలై మొదటివారంలోనే వంద కోట్లు వసూలు చేసి రెండు వందల కోట్ల మార్కును దాటి మూడు వందల కోట్ల దిశగా పయనిస్తోంది. ఈ సినిమాను శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు మలయాళ వెర్షన్ నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటి. మరీ చిత్రానికి ఎలాంటి స్పందన లభిస్తోందో చూద్దాం.

కథ:

హషీర్, అలన్, అజిన్, వినాయక్ అనే నలుగురు కుర్రాళ్ళ కథ. వీరు మంచి స్నేహితులుగా ఉంటూ తరచూ గొడవలతో అల్లరి చిల్లరిగా ఉంటారు. కాలేజ్ డేస్ లో ఈ గ్యాంగ్ చేసిన అల్లరు పలుమార్లు పెద్దల దగ్గర పంచాయతీ వరకూ తీసుకెళతాయి. ఓ సందర్భంలో పీటీ మాస్టర్ ముజీర్ విద్యార్థులు ప్రేమ పేరుతో బయట తిరుగుతున్నారని, ఫోన్స్ వాడుతున్నారని గమనించి అందరినీ బయటకు లాగుతాడు. అలెన్ చెల్లి కాలేజ్ మాని సినిమాలకు తిరుగుతుందని చెబుతూ  ‘పిల్లల్ని పెంచేది ఇలాగేనా అంటూ తల్లిదండ్రులను అవమానిస్తాడు. దాంతో ఆగ్రహించిన అలెన్ ముజీర్ మాస్టర్ పై చేయి చేసుకుంటాడు. కాలేజ్ నుంచి సస్పెండ్ చేయడం తో కుర్రాళ్లు నలుగురు ఆవేశంగా డ్రగ్స్ తీసుకుని కామెంట్ చేసిన స్టూడెంట్స్ అందరిపై దాడికి దిగుతారు. ఆపై పోలీస్ కేసు అయి కౌన్సిలింగ్ జరుగుతుంది. దాంతో ఆ నలుగురు స్నేహితుల్లో మార్పు వచ్చి బాగా చదువుకుని విదేశాలకు వెళ్లి సంపాదించాలని నిర్ణయించుకుంటారు? ఈ జర్నీలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? జీవితం వారికి ఏం నేర్పింది? ఫైనల్ గా ఆ స్టూడెంట్స్ గమ్యాన్ని చేరుకున్నారా? లేదా? అన్నదే కథ.    


Vaala.jpg

విశ్లేషణ:
వాలా మొదటి భాగం మూవీ క్లైమాక్స్ లో నలుగురు కుర్రాళ్లు యు.కె వెళ్లి సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు చూపించారు. మధ్య తరగతికి చెందిన కుర్రాళ్లు యుకెలో చదివి సెటిల్ అవ్వాలంటే ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయన్న లైన్ తో నిజజీవితంలో లక్షలాది స్టూడెంట్స్ కి కనెక్ట్ అయ్యేలా వాలా 2 కథను నడిపించాడు దర్శకుడు. సోదరులు కావాలని కోరుకునే ఇద్దరు స్నేహితుల కథ తో సినిమా మొదలవుతుంది. ఆ స్నేహితులు నలుగురై, స్కూల్, కాలేజ్, అల్లర్లు, ఇంట్లో చివాట్లు, పోలీస్ స్టేషన్, కౌన్సిలింగ్ వంటి సన్నివేశాలలో నడుస్తుంది. అయితే ఇదంతా ఫస్ట్ పార్టుకు దగ్గరగానే ఉంటుంది. కాలేజ్లో గొడవలు, కుర్రాళ్లపై కేసు పెట్టకుండా పోలీస్ రక్షించడం, అక్కడి నుంచి జీవితం గురించి ఆలోచించడంతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఫస్టాఫ్లో ఫన్ కు లోటు లేకున్నా… గోల గోలగా అనిపిస్తుంది. అయితే కాలేజీలో ఎదురైన అవమానాలతో ఆ యువతలో వచ్చిన మార్పు, విదేశాలకు వెళ్లడానికి చేసే ప్రయత్నాలు, అక్కడికి వెళ్లాక చదువుకు, సర్వైవ్ కావడానికి పడ్డ కష్టాలను చాలా హృద్యంగా చూపించారు. క్లైమాక్స్లో వినాయక్ తండ్రి మరణం, హషీర్ సోదరుల్లో మార్పు, అలెన్ - తన  చెల్లి పై చూపించే ప్రేమ, బాధ్యత ఇలా ప్రతి ఒక్కరి కథలోనూ చక్కటి భావోద్వేగాలను పండించడంలో సఫలీకృతులయ్యారు దర్శకనిర్మాతలు. కాలేజీలో తల్లిదండ్రులు, టీచర్స్, పోలీస్ మధ్య సన్నివేశాలు అలరిస్తాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు, టీచర్స్ కూడా బాధ్యతగానే వ్యవహరించాలనే చక్కటి సందేశం ఇస్తుందీ చిత్రం. ఇందులో లవ్ ఎపిసోడ్స్ ఉన్నా.. రొమాన్స్ కు  ఎక్కడా స్కోప్ ఇవ్వలేదు. తెలుగు ఆడియన్స్ కు యువతకు కనెక్ట్ అయ్యేలా కొన్ని అనిల్ రావిపూడి రిఫరెన్సులు, ‘జయ జానకి నాయక’ డైలాగ్స్, అనుదీప్ ప్రస్తావన తీసుకొచ్చి థియేటర్లలో నవ్వులు పూయించారు. ఇక సున్తీ ఎపిసోడ్ తో ఎంతగా నవ్వించారో… ఆ తర్వాత అంతకు మించిన భావోద్వేగాన్ని పంచారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
కేరళలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుర్రాళ్లు ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీ తెరకెక్కించారు. హషీర్, అలన్, అజిన్, వినాయక్ ఇలా ఇందులో కనిపించిన ఆర్టిస్ట్లు అంతా కొత్తవారైనా తమ పాత్రలకు న్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్ గా ఆల్షోన్స్ పుత్రన్ ఆకట్టుకున్నారు. తెలంగాణ స్లాంగ్ డైలాగ్లతో అలరించారు. తల్లిదండ్రుల పాత్రధారులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. అఖిల్ లైలాసురన్ కెమెరా పనితనం, అంకిత్ మీనన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సందర్భానుసారం వచ్చే పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు పెద్ద ఎసెట్. ఫస్టాఫ్ లో  స్నేహితుల మధ్య నడిచే సన్నివేశాలు కొన్ని లేపేసినా సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. విపిన్ దాస్ కథను సావిన్ షా చక్కగా తెరకెక్కించారు. ఫస్టాఫ్ కొద్దిగా గోలగోలగా ఉన్నా.. సెకెండాప్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్ గా  తీర్చిదిద్దారు. రకరకాల కారణాలతో కుటుంబాలను వదిలి దూరం వెళ్లిన యువత ఎలా రియలైజ్ అవుతుంది... వారి మార్పు కుటుంబాలకు ఎలా అండగా ఉంటుందనే క్లైమాక్స్ ఎంతో బలంగా నిలిచింది. దర్శకుడు ఆ సన్నివేశాలు తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. సినిమా నాచురల్ గా ఉంది. అనువాదం చేసే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. మిడిల్ క్లాస్ కుర్రకారుకు, కుటుంబాలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. మధ్యతరగతి మనుషుల జీవితాల్లో పలు విషయాలను గుర్తు చేస్తుందీ సినిమా.

ట్యాగ్ లైన్: మిడిల్ క్లాస్ ‘వాలా2’

రేటింగ్‌: 3/5

Updated Date - Apr 24 , 2026 | 06:49 PM