Papam Prathap: తిరువీర్ పాపం ప్రతాప్ మూవీ రివ్యూ
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:19 PM
తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన సినిమా పాపం ప్రతాప్. ఈటీవీ విన్ సౌజన్యంతో ఈ సినిమా నిర్మితమైంది.
నటుడిగా తిరువీర్ (Thiruveer) ఇప్పుడిప్పుడే చక్కని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 'మసూద' (Masooda), 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' (The Great Pre-Wedding Show) వంటి సినిమాలతో కమర్షియల్ సక్సెస్‌నూ అందుకున్నాడు. దాంతో తిరువీర్ సినిమా అంటే సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందనే నమ్మకం పెట్టుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో అతని తాజా చిత్రం 'పాపం ప్రతాప్' (Papam Prathap) విడుదలైంది. ఈటీవీ విన్ సౌజన్యంతో రాకేశ్ రెడ్డి, రుద్రదేవ్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
గ్రామీణ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఇది. ప్రతాప్ (తిరువీర్) చిన్నప్పటి నుండి తాను ప్రేమిస్తున్న బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ Payal Radhakrishna)ను పెద్దలను ఒప్పించి మరీ పెళ్ళి చేసుకుంటాడు. ఒక్కగానొక్క కొడుకు మాట కాదనలేక ప్రతాప్ తల్లిదండ్రులు ఈ పెళ్ళికి అంగీకరిస్తారు. అయితే వివాహానంతరం మూడు రాత్రులు గడిచీ గడవగానే ప్రతాప్‌తో తాను కాపురం చేయలేనంటూ బుజ్జమ్మ పంచాయితీకి ఎక్కుతుంది. అతనికి ఉన్న సమస్యను తాను అందరి ముందు చెప్పలేనని, తన సమస్యను తానే పరిష్కరించుకుని వస్తే తప్ప కాపురానికి రానని కరాఖండీగా చెప్పేస్తుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న వీరిద్దరూ ఇలా విడిపోవడంతో ప్రతాప్ గురించి ఊరిలో జనం నానారకాలుగా అనుకుంటారు. తన సమస్య గురించి తెలుసుకుని, దాన్ని అధిగమించానని నమ్మబలికి తిరిగి బుజ్జమ్మను కాపురానికి ప్రతాప్ తీసుకొస్తాడు. కానీ అదీ మూడు నాళ్ళ ముచ్చటే అవుతుంది. అతనితో జీవితాన్ని సాగించలేని బుజ్జమ్మ తిరిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. అసలు ప్రతాప్కు ఉన్న సమస్య ఏమిటీ? దానికి మూలం ఏమిటీ? ఈ విషయం తెలిసిన తర్వాత అయినా ప్రతాప్ ఆ సమస్య నుండి బయట పడ్డాడా? లేదా? ఈ క్రమంలో అతను ఎలాంటి అవమానాలు, అపనిందలు ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
ఓ చిన్న పాయింట్ తీసుకుని దాదాపు రెండున్నర గంటల సినిమాగా సాగదీయడమే ఈ సినిమా విషయంలో జరిగిన అతి పెద్ద పొరపాటు. ఓ తీవ్రమైన సమస్యను వినోదాత్మకగా చెప్పాలని దర్శకుడు ఎస్. పి. దుర్గ నరేశ్ భావించాడు. కానీ దానిని అంత ఎఫెక్టివ్‌గా తెర మీద చూపించలేకపోయాడు. గతంలోనూ గురక, నిద్రలో నడిచే అలవాటు నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో హీరో సమస్య దానికంటే చాలా పెద్దది. ఇలాంటి కథలను సున్నితంగానూ, సునిసితమైన హాస్యంతోనూ డీల్ చేయాలి కానీ వైల్డ్ గానో, రూడ్ గానో తెర మీద చూపించకూడదు. ఆ హద్దును దర్శకుడు చెరిపేశాడు. దీనికి తోడు హీరో తండ్రి, ఆయన బావ పాత్రల మధ్య సాగే తంతు మరింత దారుణంగా ఉంది. గోపరాజు రమణ పాత్ర ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఈటీవీ విన్ లాంటి ఓటీటీ సంస్థ కేవలం లైన్ విని, ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేదేమో అనిపిస్తుంది. మేకింగ్ కూడా చాలా దిగువ స్థాయిలో ఉంది. దీనికంటే ఇవాళ టీవీ సీరియల్స్ మంచి క్వాలిటీతో తీస్తున్నారు. హీరోయిన్ తన కెదురైన చేదు అనుభవాన్ని ఎవరితోనూ చెప్పకుండా పంచాయితీకి ఎక్కడం జన్యూన్‌గా అనిపించదు. అక్కడ కూడా సమస్య చెప్పకుండా గోప్యత పాటించడం చిత్రంగా అనిపిస్తుంది. హీరో అలా ప్రవర్తించడానికి ఆ తర్వాత ఓ రీజన్ చూపించారు కానీ అదీ బలంగా లేదు. చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా వ్యవహారం మారిపోయింది.
నటీనటుల విషయానికి వస్తే... ఇది కామెడీ సినిమా కాబట్టి... ఎలాగైనా నటించవచ్చు అనే భావన ప్రధాన తారాగణంలో బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తిరువీర్, అతని తండ్రి పాత్ర పోషించిన అజయ్ ఘోష్, ఆయన బావగా నటించిన గోపరాజు రమణ వీళ్ళు చాలా అతి చేశారు. దాన్ని తట్టుకోవడం కష్టమే. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బాగానే నటించింది కానీ ఆమె క్యారెక్టరైజేషన్ అంత కన్వెన్సింగ్‌గా లేదు. ఇతర ప్రధాన పాత్రలను రాశి (Rasi), రూపలక్ష్మీ, దేవిప్రసాద్, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు (Raghubabu) తదితరులు పోషించారు. కె. ఎం. రాధాకృష్ణన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి (Suresh Bobbili) నేపథ్య సంగీతం అందించారు. ఆర్. ఆర్. బాగుంది. ఈటీవీ విన్ లాంటి సంస్థ నుండి వస్తున్న సినిమా కావడం, తిరువీర్ హీరోగా నటించడం వంటి అంశాల వల్ల 'పాపం ప్రతాప్'ను చూద్దాం అనుకుంటే తప్పు చేసినట్టే. ఎలానూ రెండు మూడు వారాల తర్వాత ఓటీటీలో వస్తుంది కాబట్టి... అప్పటి వరకూ వేచి ఉండటం బెటర్. లేకపోతే... ఆడియెన్స్‌ను 'పాపం' అనుకోవాల్సి వస్తుంది!
ట్యాగ్ లైన్: పాపం ప్రేక్షకులు!
రేటింగ్: 2/5