Governor: గవర్నర్.. చేసిన గణాంకాల యుద్ధం

ABN , Publish Date - Aug 30 , 2026 | 07:16 PM

దేశాన్ని కాపాడే అన్ని యుద్ధాలూ సరిహద్దుల్లోనే జరగవు. కొన్ని జమా ఖర్చుల పద్దు పుస్తకాల్లో కూడా జరుగుతాయి. అటువంటి స్టాటిస్టికల్ వార్ మూవీ 'గవర్నర్'.

Governor

చిత్రం: గవర్నర్ (హిందీ)
నటీనటులు: మనోజ్ బాజ్ పేయి. మహ్మద్ కుంజు, మధుబాల, ఆదా శ‌ర్మ‌
దర్శకత్వం: చిన్మయ్ మాండ్రేకర్
నిడివి: 2 గంటల 2 నిమిషాలు
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)

కుటుంబం డబ్బుకు ఇబ్బంది పడుతున్నపుడు ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదువ పెట్టి సమస్య నుంచి గట్టెక్కినట్టు.. దేశం కూడా తన దగ్గర నిల్వ ఉన్న బంగారాన్ని కుదువ పెట్టడం అనేది సినిమా కథా వస్తువు. అయితే ఇది కల్పితం కాదు. నిజంగా జరిగిన ఘటన. మూడు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన వార్త. అది నలభై ఏడు వేల కిలోల బంగారం కావడం కూడా వివాద తీవ్రతకు కారణం కావచ్చు. సాధారణంగా దేశాన్ని రక్షించే సినిమాల్లో సరిహద్దులుంటాయి. తుపాకులుంటాయి. శత్రువు కనిపిస్తాడు.

కానీ 'గవర్నర్' సినిమాలో యుద్ధభూమి రిజర్వ్ బ్యాంక్. ఆయుధాలు అంకెలు, ఖాళీ అవుతున్న విదేశీ మారక నిల్వలే శత్రువు. 'గవర్నర్' దాదాపుగా వన్ మాన్ ఆర్మీ. తాకట్టులో భారత బంగారం అన్నవార్త 1991లో దేశాన్ని కుదిపేసింది. 47 వేల కిలోల బంగారాన్ని ఆర్బీఐ విదేశీ బ్యాంకులకు ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది? దాని వెనుక ఎవరె వరున్నారు? అనేదే కథ. చిన్మయ్ మాండ్లేకర్ (Chinmay D. Mandlekar) దర్శకత్వంలో, మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) ప్రధాన పాత్రలో వచ్చిన 'గవర్నర్ ది సైలెంట్ సేవియర్ (Governor: The Silent Saviour) ఒక థ్రిల్లర్ లాంటి పొలిటికల్ ఎకనమిక్ డ్రామా.

1991లో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. దిగుమతులకు చెల్లించడానికి అవసరమైన విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ఈ చారిత్రక సంక్షోభం, బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చిన పరిస్థితికి కారణమైన డ్రామా సినిమా కథకు కేంద్రం. ఒక దేశం దివాలా అంచున నిలబడ్డప్పుడు దాన్ని కాపాడేది ఎవరు? ప్రధానమంత్రా? ఆర్థిక మంత్రా? పార్లమెంటా? రిజర్వ్ బ్యాంకా? లేక చరిత్ర పుస్తకాల్లో పేరు కూడా సరిగా నమోదు కాని కొందరు అధికారులు తీసుకునే అసాధారణ నిర్ణయాలా? దేశం దగ్గర బంగారం ఉంది. కానీ డబ్బు లేదు. చివరకు అదే బంగారాన్ని విదేశాలకు తరలించి, తాకట్టు పెట్టి దేశ భవిష్యత్తును కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇక్కడ బంగారం కేవలం ఆస్తి కాదు. భారతీయ సమాజంలో అది గౌరవం, భద్రత, సంపదకు ప్రతీక.


అలాంటి బంగారాన్ని దేశమే తాకట్టు పెట్టాల్సి రావడం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు.. ఒక జాతీయ అవమాన భావన కూడా. ఈ అంశంలోనే సినిమాకు కావల్సిన నాటకీయత అంతా ఉంది కనుక దర్శకుడికి పెద్దగా కష్టం కూడా కాలేదు. అలా అని ఈ సినిమాకు ఆర్థిక వ్యవస్థ మాత్రమే కథావస్తువు కాదు. రాజకీయమంటే ఎన్నికలు, అవినీతి, హత్యలు, కుట్రలే అనుకుంటాం. కానీ ఒక దేశంలో వడ్డీరేటు కూడా రాజకీయమే. విదేశీ మారక నిల్వ కూడా రాజకీయమే. అప్పు కూడా రాజకీయమే. ఆ కోణంలో 'గవర్నర్' అరుదైన ప్రయత్నం. సినిమాలో ఒక గృహిణి బంగారంతో వ్యవహరించే తీరులోంచీ, ఒక చిరు ఉద్యోగి తన ఆర్థిక వనరులను వినియోగించే తీరు లోంచి.. ఆర్బీఐ గవర్నర్ అంతటివాడు పరిష్కా రాలను కనుక్కోవడం చూడడానికి బావుంది. రాజకీయ అధికారిక అనుమతులు ఉండి కూడా.. బంగారం వ్యాన్లను రహస్యంగా తరలించాల్సి రావడం సినిమాలో థ్రిల్‌కు మూలమైన అంశం.

అప్పటి గవర్నర్ ఎస్. వెంకటరమణన్ పాత్ర స్ఫూర్తితో రూపొందించిన పాత్రలో మనోజ్ బాజ్‌పేయి కనిపిస్తాడు. అతనే మొత్తం బంగారం తాకట్టును ఒంటి చేత్తో నిర్వహించినట్టు చూపించారు కానీ నిజానికి అది సాధ్యం కాదు. కానీ ఆర్బీఐని రాష్ట్రీయ బాంక్ ఆఫ్ ఇండియా అని మార్చినట్టు, గవర్నర్ వెంకటరమణన్ ను రామన్ అని మార్చినట్టు కొంత స్వేచ్ఛ తీసుకున్నారు. బంగారం తరలి పోతోందన్న వార్త తెలిసీ దానికి సంబంధించిన ఫొటోలు, ఆధారాలు ఉండి కూడా దాన్ని ఒక జర్నలిస్టు వార్తగా ప్రచురించలేదని ఎందుకు దర్శకుడు మార్చాడో తెలియదు. ఎందుకంటే ఆ వార్త తెలిసిన అప్పటి జర్నలిస్టు శంకర్ అయ్యర్ ఆ వార్తను దాయలేదు. ఆ వార్తను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రముఖంగా ప్రచురించింది. ఈ అంశంపై పార్లమెంటులో పెద్ద గొడవే జరిగింది.

సినిమాలో ఆ జర్నలిస్టు పాత్రను ఆదాశర్మ (Adah Sharma) పోషించింది. ఆమె తన సంపాదకుడితో గొడవ పడి మరీ వార్తను ఆపేస్తుంది. సరే దర్శకుడు చేసిన ఈ మార్పు కూడా సినిమాటిక్ లిబర్టీయే అనుకుందాం. నిజానికి అప్పటి ప్రభుత్వం ఈ ఆపరేషన్‌ను రహస్యంగా ఉంచాలని అనుకో లేదు. కానీ బంగారం తరలి విదేశీ బ్యాంకులకు చేరేంత వరకూ మాత్రం బయటకు పొక్క కూడదనుకుంది. అయితే ఈ బంగారం తాకట్టు నిర్ణయం తరువాతి కాలంలో దేశ పురోగతికి పునాది అయిందన్నది అందరూ ఇప్పుడు అంగీకరించే నిజం.

దేశాన్ని కాపాడడానికి బంగారం మూలధనమే కానీ.. ఈ సినిమాకు అసలు మూలధనం మాత్రం నట లోహాల్లో బంగారం లాంటి మనోజ్ బాజ్ పాయి. సినిమాను పూర్తిగా తన భుజాల మీద మోశాడు. పాత్రను హీరోగా నిరూపించడానికి అతను ఎక్కడా ప్రయత్నించ లేదు. రామన్ పాత్రలో భయం ఉంది. బాధ్యత ఉంది. వ్యవస్థపై అసహనం ఉంది. అయినా అన్నింటికన్నా ఎక్కువగా ఒక అధికారి నిర్ణయం తప్పయితే దేశం చెల్లించాల్సిన మూల్యం గురించిన అప్రమత్తత కూడా ఉంది. బాజ్‌పేయి తన ముఖంలో ఆ అన్ని భావాల ఒత్తిడిని చూపించాడు.

సిఆర్ పాత్ర ధారి, మధుబాలకు చెప్పుకోదగ్గ పాత్రలేదనే చెప్పాలి. సినిమా ముగిసిన తర్వాత ఈతరం 1991లో నిజంగా ఏం జరిగింది? అని గూగుల్ చేయడం ఖాయం. ఒక చారిత్రక సినిమా సాధించగలిగిన అతి పెద్ద విజయం అది. దేశాల చరిత్రలో కొన్ని విజయాలకు ఉత్సవాలు ఉండవు. జెండాలు ఎగరవు. విజయగీతాలు వినిపించవు. ఎక్కడో ఒక గదిలో కొందరు మనుషులు అంకెల ముందు కూర్చుంటారు. ఒక సంతకం చేస్తారు. దేశం కొత్త శ్వాస పీల్చుకుంటుంది. ఆ సంతకం వెనుక ఉన్న చరిత్రను చూపించడానికి ప్రయత్నించిన సినిమా 'గవర్నర్. - ప్ర‌సేన్‌ (70133 58154)

Updated Date - Aug 30 , 2026 | 07:16 PM