‘వీరభద్రుడు’ మూవీ రివ్వ్యూ

ABN , Publish Date - May 15 , 2026 | 07:16 PM

సూర్య హీరోగా ఆర్జే బాలాజీ తెరకెక్కించిన 'వీరభద్రుడు' సినిమా ఒకరోజు ఆలస్యంగా శుక్రవారం విడుదలైంది. త్రిష కీలక పాత్ర పోషించిన ఈ ఫాంటసీ కోర్ట్ డ్రామా ఎలా ఉందో తెలుసుకుందాం.

Veerabhadrudu Movie

గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో సూర్యకు ఏదీ కలసి రావటం లేదు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించటం లేదు. కంగువ, రెట్రో సినిమాలైతే అందరికీ తీరని నష్టాలను అందించాయి. ఈ నేపథ్యంలో నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి మే 14న విడుదల కావలసిన ఈ చిత్రం ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఒక రోజు ఆలస్యంగా 15వ తేదీ తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. న్యాయవ్యవస్థలోని లోపాలను దైవాంశకు ముడిపెడుతూ కమర్షియల్ యాంగిల్ లో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకూ మెప్పించిందో చూద్దాం.


కథ

నాంపల్లి కోర్టులో బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ RJ Balaji) లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ తనదైన ఓ సామ్రాజ్యం నడిపిస్తుంటాడు. జడ్జి (నట్టి సుబ్రమణియన్)ని డబ్బుతో కొనేసి అనుకూలంగా తీర్పులు వచ్చేలా చేస్తుంటాడు. కుమార్తె మీను (అనఘా రవి) వైద్యం కోసం తమిళనాడు నుంచి వచ్చిన మునిస్వామి నాయుడు (ఇంద్రాన్స్) బంగారం దొంగతనానికి గురవుతుంది. పోలీసులు దానిని రికవరీ చేసినప్పటికీ, కోర్టు నుంచి పొందాలని చెప్పి బేబీకృష్ణ దగ్గరకు పంపుతారు పోలీసులు. అయితే బేబీకృష్ణ ఆ కుటుంబాన్ని తన చుట్టూ తిప్పుకుని డబ్బులు గుంజుతుంటాడు. కోర్టు ఆవరణలో ఉన్న క్షేత్ర పాలకుడు వీరభద్రుడిని వేడుకుని అక్కడ ఉన్న మిరపకాయలు దంచితే కోరుకున్నది నెరవేరుతుందని ఎవరో చెప్పిన మాటవిని అలానే వేడుకుంటాడు మునిస్వామి. దాంతో లాయర్ రూపంలో వీరభద్రుడు (సూర్య Suriya) ఎంట్రీ ఇస్తాడు. అతన్ని గుర్తించిన బేబీకృష్ణ వీరభద్రుడితో భగవంతుడిగా ఎలాంటి శక్తులు వాడకుండా సాధారణ లాయర్ గా కేసు గెలిచి చూపించాలని సవాల్ విసురుతాడు. మరి వీరభద్రుడు ఏం చేశాడు? మీను ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? ఇందులో ప్రీతి (త్రిష) పాత్ర ఏంటి? న్యాయం గెలుస్తుందా? అన్నదే సినిమా.

విశ్లేషణ

దర్శకుడు ఆర్జే బాలాజీకి దైవభక్తి మిళితమైన సినిమాలకు కమర్షియల్ యాంగిల్ జోడించటంలో మేటి. ఇందులో కూడా కోర్టులో జరిగే అన్యాయాలకు దైవత్వాన్ని కలిపి కథ తయారు చేసుకునే విషయంలో సక్సెస్ అయ్యాడు. అయితే దాన్ని స్క్రీన్ మీద సమర్థవంతంగా ప్రజెంట్ చేయలేక పోయాడు. అసలు సూర్య ఎంట్రీనే 40 నిమిషాల తర్వాత ఉందంటే స్క్రీన్ ప్లే ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హీరోని సవాల్ చేసే విలన్ పాత్రలో అతనే నటించటం.. తన పాత్రకు ఎక్కువ ఎలివేషన్ ఇచ్చుకోవడం పెద్ద మైనస్. కానీ సూర్యను క్షేత్ర పాలకుడిగా, దేవుడిగా చూపించిన విధానం ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక సాంకేతిక విలువల విషయానికి వస్తే సాయి అభ్యంకర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మాత్రం సినిమాకు అతి పెద్ద మైనస్. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ వల్ల విజువల్స్ రిచ్గా ఉన్నాయి. నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు ఖర్చుకు వెనకాడలేదనే విషయం అర్థం అవుతుంది.


నటీనటుల సంగతికి వస్తే సూర్య మరోసారి వన్ మ్యాన్‌ షో చేశారు. క్షేత్ర పాలకుడిగా, లాయర్ గా అతని లుక్స్ ఆకట్టుకుంటాయి. విలన్‌గా ఆర్జే బాలాజీ సూర్య ముందు తేలిపోయాడు. త్రిష, ఇంద్రాన్స్, అనఘా రవితో పాటు ఇతర నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. క్లైమాక్స్ చూస్తున్న ప్రేక్షకులకు ‘కాంతారా’ గుర్తురాక మానదు. అయితే ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ కి ఆడియన్స్ లోను కాక పోవడం వల్ల అంతగా ఆకట్టుకోదు. తొలి అర్ధభాగం చూసి పర్వాలేదని ఫీలయిన వారికి ద్వితీయార్ధంతో పెద్ద షాక్ ఇస్తాడు దర్శకుడు. సూర్య ఇలాంటి స్క్రిప్ట్ కు ఎందుకు ఓకె చెప్పాడా అనే సందేహం కలగక మానదు. ఏది ఏమైనా సూర్య అభిమానులు మరోసారి నిరాశకు గురికాక తప్పదు.

రేటింగ్: 2.25/5

ట్యాగ్ లైన్: వీరబాదుడు

Updated Date - May 15 , 2026 | 07:17 PM