Sumathi Satakam Movie Review: సుమతీ శతకం.. మూవీ రివ్యూ
ABN , Publish Date - Feb 06 , 2026 | 07:09 PM
అమర్ దీప్ చౌదరి, శైలీ చౌదరి జంటగా నటించిన చిత్రం 'సుమతీ శతకం'. ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.
టీవీ సీరియల్స్ ద్వారానే కాదు బిగ్ బాస్ షో తో కూడా కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు అమర్ దీప్ చౌదరి (Amardeep Chowdary). ఆ షో తర్వాత అతనికి సినిమాల్లోనూ నటించే అవకాశాలు వచ్చాయి. అయితే అవి సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్స్ కాకపోయినా... అడపాదడపా హీరోగా అతను చేస్తూనే ఉన్నాడు. అలా అమర్ దీప్ చౌదరి నటించిన తాజా చిత్రం 'సుమతీ శతకం' శుక్రవారం విడుదలైంది. శైలీ చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది.
కథ విషయానికి వస్తే... ఇది తూర్పు గోదావరి జిల్లాలోని వైకుంఠపురంలో జరిగే కథ. కృష్ణ (అమర్ దీప్ చౌదరి)కి చిన్నప్పటి నుండీ పెళ్ళంటే ప్రాణం. ఎక్కడ ఏ పెళ్ళి జరిగినా వెళ్ళి డాన్స్ చేసేస్తుంటాడు. తన పెళ్ళి ఎప్పుడెప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు. తమ ఊరి తిరనాళ్ళ సమయంలో గుడిలో గ్రాండ్ గా పెళ్ళి చేసుకుంటానని మొక్కుకుంటాడు కూడా. అదే సమయంలో అతనికి పక్క ఊరిలోని అంగన్ వాడీ టీచర్ సుమతి (శైలి చౌదరి)తో జరిగిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. తీరా వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్న సమయంలో సుమతికి అమ్మవారు ఆవహిస్తుందన్న విషయం తెలుస్తుంది. మరి ఆమెను పెళ్ళి చేసుకోవాలని అనుకున్న కృష్ణ పరిస్థితి ఏమైంది? గుడికి రంగులు వేసే సమయంలో ఊరిలో మొదలైన గొడవ ఎక్కడికి దారితీసింది? ఇంతకూ సుమతికి అమ్మవారు ఆవహించడానికి కారణం ఏమిటీ అనేది మిగతా కథ.
పెళ్ళికోసం తాపత్రయ పడే ఓ యువకుడికి అనుకోని అవాంతరాలు ఎదురయితే ఎలా వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగాడనేది ఆసక్తికరమైన అంశమే. అయితే ఆ కథలో కొత్తదనం లేకపోయినా... కనీసం కథనం ఆసక్తికరంగా ఉంటే బాగుండేది. కానీ అదే ఈ సినిమాలో లోపించింది. పెళ్ళి గురించి హీరో తహతహలాడటం, చివరకు ఓ అమ్మాయిని అతను ప్రేమించడం, అది పెళ్ళి వరకూ వెళ్ళడం ఆ తర్వాత అవాంతరాలు ఎదురు కావడం ఇవన్నీ పరమ రొటీన్ గా సాగాయి. దాంతో థియేటర్లోని ప్రేక్షకులలో అసహనం పెరిగి పోతుంది. పోనీ కామెడీ సన్నివేశాలేమైనా ఆసక్తికరంగా ఉన్నాయా అంటే అదీ లేదు. అవీ సాదాసీదాగా ఉన్నాయి. కాకపోతే నటీనటులు కొంతలో కొంత మెప్పించే ప్రయత్నం చేశారు. అమర్ దీప్ యాక్టివ్ గా నటించినా రవితేజ (Raviteja) చేష్టలే ఎక్కువగా కనిపించాయి. అయితే ఫేస్ లో ఎలాంటి హావభావాలు పలికించలేకపోవడం పెద్ద మైనస్. కొత్తమ్మాయి శైలీ చౌదరి కూడా లవ్ ట్రాక్ వరకూ బాగానే చేసింది. కానీ అమ్మవారు ఆవహించిన సన్నివేశాలలో మాత్రం తేలిపోయింది. బిగ్ బాస్ షో లో ఆకట్టుకున్న టేస్టీ తేజా, మహేశ్ విట్టా కామెడీ పండించలేదు. ప్రథమార్ధంలో పోల్చితే, ద్వితీయార్ధం ఇంకా దారుణం. సుభాష్ ఆనంద్ సమకూర్చిన సంగీతం, ఎస్. హలేష్ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. ఈ సినిమాను అందరూ చూడాలనే ఉద్దేశ్యంతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ టిక్కెట్ రేట్లు కూడా తగ్గించింది. అయితే కథలో కొత్తదనం కరవు కావడంతో ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: కొత్తదనం కరవు!