సినిమా రివ్యూ: మృత్యుంజ‌య్‌

ABN , Publish Date - Mar 06 , 2026 | 09:05 AM

శ్రీవిష్ణు.. కథాబలం, వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్‌. ఆయన కథల ఎంపిక భిన్నంగా ఉంటుంది. ఎక్కువ శాతం హాస్య ప్రధాన చిత్రాలే చేశారాయన. అయితే ఈసారి రూట్‌ మార్చి క్రైమ్‌ థ్రిల్లర్‌ వైపు అడుగేశారు. అలా వచ్చిన చిత్రమే ‘మృత్యుంజయ్‌’. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

సినిమా రివ్యూ: ‘మృత్యుంజయ్‌’
విడుదల తేది:
6-3-2026


శ్రీవిష్ణు.. కథాబలం, వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్‌. ఆయన కథల ఎంపిక భిన్నంగా ఉంటుంది. ఎక్కువ శాతం హాస్య ప్రధాన చిత్రాలే చేశారాయన. అయితే ఈసారి రూట్‌ మార్చి క్రైమ్‌ థ్రిల్లర్‌ వైపు అడుగేశారు. అలా వచ్చిన చిత్రమే ‘మృత్యుంజయ్‌’. రెబ్బా మౌనికా జాన్‌ కథానాయిక. సుకుమార్‌ శిష్యుడు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకుడు. గుణ్ణం గంగరాజు కుమారుడు సందీప్‌ నిర్మాత. అయ్యప్ప శర్మ, సుదర్శన్‌, రచ్చ రవి ఇతర పాత్రధారులు. టీజర్‌, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్నాన్ని దర్శకులు రాజమౌళి, సుకుమార్‌, ఎన్టీఆర్‌, నాని, నాగచైతన్య, రామ్‌ వంటి స్టార్స్‌ ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేశారు. దాంతో సినిమాకు బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

జయ్‌ అలియాస్‌ మృత్యుంజయ్‌ (శ్రీవిష్ణు) ఓ మీడియా హౌస్‌లో క్రైమ్‌ రిపోర్టర్‌ కావాలని కలలు కంటాడు. ఆ కోరిక తీరకపోవడంతో అదే కంపెనీలో యాడ్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ కాలం గడుపుతుంటాడు. ఎవరైనా చనిపోతే.. ఆ ఇంట్లో వారి గురించి తెలుసుకుని అక్కడ హడావిడి చేసి శ్రద్ధాంజలి యాడ్స్‌ తీసుకొస్తుంటాడు. ఓ రోజు అచ్యుత శర్మ (బాలాదిత్య) అనే వ్యక్తి చనిపోవడంతో అక్కడికి వెళ్తాడు. అచ్యుత్‌ కూతురు అంజలి కన్నీరు లేని బాధతో దిగాలుగా ఉండటం గమనిస్తాడు జయ్‌. ‘నాన్నకు ఎందుకిలా అయింది’ అనే ఆ చిన్నారి ప్రశ్నకు సమాధానం వెతకాలనుకుంటాడు. ఆ వెంటనే మరో మనిషి మరణిస్తాడు. ఈ ఇద్దరూ ప్రమాదాల్లో మరణించారని పోలీసులు నమ్ముతారు. కానీ ఆ మరణాల వెనుక ఏదో కారణం ఉందని ఐపీఎస్‌ అధికారి సీత (రెబా మౌనికా జాన్‌) ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభిస్తుంది. ఇదే విషయాన్ని జయ్‌ కూడా డిపార్ట్‌మెంట్‌కు చెబుతాడు. సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును పక్కన పెట్టేస్తారు. జయ్‌ మాత్రం వదలడు. ఆ హత్యలు చేసేది ఎవరు? అందుకు గల కారణాలు ఏంటి? ఈ కేసును ఛేదించే క్రమంలో జయ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అన్నది కథ.


విశ్లేషణ:
ఎప్పుడూ వినోదం ప్రధానంగా సాగే చిత్రాలతో అలరించే శ్రీవిష్ణు కాస్త జానర్‌ మార్చి క్రైమ్‌ థ్రిలర్‌ వైపు వెళ్లి చేసిన సినిమా ఇది. పేపర్‌ యాడ్స్‌ తెస్తూ రకరకాల వేషాల్లో కనిపించే హీరో.. అతనిలాగే ఆలోచించే ప్రతినాయకుడి మధ్య మైండ్‌ గేమ్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. అచ్యుతశర్మ మరణంతో అసలు కథ మొదలవుతుంది. తన బిడ్డ అంజలితో హీరో కనెక్ట్‌ కావడం, ఒక్కసారిగా జయ్‌కు బాల్యం గుర్తు రావడం భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఈ మరణాల వెనక ఏదో ఉందని గ్రహించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విలన్‌ ఎవరో తెలుసుకుని అతను కూడా తనలాగే ఆలోచిస్తాడని తెలుసుకునే సన్నివేశాలు ‘జులాయి’ సినిమాను గుర్తు చేస్తాయి. అయితే ఇందులో పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ రొటీన్‌గా సాగుతుంది. ఫస్టాప్‌ స్లోగా  అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో హీరో.. విలన్‌ మధ్య సాగే మైండ్‌ గేమింగ్‌ ఛేజ్‌ ఆసక్తిగా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌కు ఉండాల్సిన లాజిక్కులు ఈ సినిమాలో ఏ ఒక్క చోట లేవు. కానీ తెరపై కథను నడిపించిన తీరు మాత్రం ఫిట్‌గా ఉంది. తనకు ఓ విలన్‌ ఉన్నాడు అని హీరోకి తెలిసినప్పటి నుంచీ హీరో ఆలోచించే తీరు.. అతని ఆలోచనకు దీటుగా ఆలోచించే విలన్‌ తీరు.. ఈ సన్నివేశాలను దర్శకుడు బ్యాలెన్స్‌డ్‌గా తెరకెక్కించారు. కొన్ని మరణాలు, ఓ చిన్నారికి కనెక్ట్‌ అయిన కథ కాబట్టి భావోద్వేగాలను కాస్త పెంచి ఉంటే బావుండేది. లాజిక్కులను, ఎమోషన్స్‌ను దర్శకుడు పక్కన పెట్టాడనిపించింది.  మాటలు, కొన్ని సన్నివేశాల్లో రైటింగ్‌ పరంగా దర్శకుడి బలం కనిపించింది.

నటీనటులు పనితీరు..
శ్రీవిష్ణు నటనకు ఓ ప్రత్యేకత ఉంటుంది. సింపుల్‌గా ఉంటూనే సందర్భానుసారంగా ఎక్కడ ఎలా నటనను బయటకు తీయాలో తెలిసిన నటుడు. ఇప్పటి దాకా ఆయన చేసిన జానర్లు వేరు. ఇది వేరు. మైండ్‌ గేమ్‌తో సాగే ఈ కథలో జయ్‌ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇది ఆయనకు కొత్త పాత్ర అని చెప్పవచ్చు. సినిమాలో జయ్‌ పాత్రకు మాటలు తక్కువ.. మైండ్‌తో ఆలోచించేది ఎక్కువ. ఆయా సందర్భాల్లో శ్రీవిష్ణు నటన చక్కగా కుదిరింది. ఐపీఎస్‌ అధికారి పాత్రలో రెబా మౌనికా జాన్‌ మెప్పించింది.   పాటలు, లవ్‌ సీన్స్‌, గ్లామర్‌ షో ఇలాంటి వాటికి తావే లేదు. విలన్‌గా వీర్‌ ఆర్యన్‌ మెప్పించాడు. తన ఆహార్యానికి తగ్గట్టే పాత్ర సూట్‌ అయింది. విలన్‌గా వీర్‌కి మంచి మార్కులు పడతాయి. సుదర్శన్‌ తనదైన శైలిలో నవ్వించాడు. అయ్యప్ప శర్మ, రచ్చరవి, చిన్నా, బాలాదిత్య పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. ఈ తరహా థ్రిల్లర్‌ చిత్రాలకు సంగీతం చాలా ముఖ్యం. ఇందులో థీమ్‌ సాంగ్‌ మినహా పాటలు లేకపోయినా నేపథ్య సంగీతంతో అద్భుతంగా నడిపించారు సంగీత దర్శకుడు కాల భైరవ. తన పనికి  పూర్తి న్యాయం చేశారు. విద్యాసాగర్‌ చింతా సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. రెండు గంటల నిడివి గల సినిమాకు ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ అనుభవం ఉపయోగపడింది. సందీప్‌ గుణ్ణం నిర్మాణ విలువలు బావున్నాయి. ఇదేమీ కొత్త కథ కాదు.. రొటీన్‌ రివేంజ్‌ డ్రామానే. కానీ హీరో చేసే ఇన్వెస్టిగేషన్‌, మైండ్‌ గేమ్‌ ఆకట్టుకుంటుంది. ప్రథమార్థం కాస్త వేగంగా ఉండి.. లాజిక్కులు, భావోద్వేగాలను జోడించి ఉంటే రిజల్ట్‌ ఇంకా బావుండేది. శ్రీవిష్ణు తన జానర్‌ మార్చి నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ కావడంతో.. ఈ తరహా కథల్ని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.


ట్యాగ్‌లైన్‌: అక్కడక్కగా థ్రిల్లింగ్‌
రేటింగ్‌: 2.5/5 

Updated Date - Mar 06 , 2026 | 10:37 AM