Sri Chidambaram Garu Movie Review: శ్రీ చిదంబరం గారు.. సినిమా రివ్యూ
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:26 PM
వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమౌతు తెరకెక్కించిన సినిమా 'శ్రీ చిదంబరం గారు'. శుక్రవారం జనం ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం...
ప్రముఖ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా 'క' (Ka) చిత్రాన్ని నిర్మించిన చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి తాజాగా 'శ్రీ చిదంబరం గారు' (Sri Chidambaram Garu) మూవీని నిర్మించారు. మెల్లకన్ను ఉన్న ఓ యువకుడి మనోవ్యథ నేపథ్యంలో ఈ సినిమాను వినయ్ రత్నం (Vinay Ratnam) తెరకెక్కించాడు. ఫిబ్రవరి 6న విడుదలైన దాదాపు పది చిత్రాలలో ఇది కూడా ఒకటి. నూతన దర్శకుడు వినయ్ రత్నం రూపొందించిన 'శ్రీ చిదంబరం గారు' ఎలా ఉందో తెలుసుకుందాం.
చిదంబరం (వంశీ తుమ్మల Vamsi Thummala) అసలు పేరు సాల్మన్! అతనికి మెల్లకన్ను ఉండటంతో ఊళ్ళో వాళ్ళంతా 'కళ్ళు' చిదంబరంను దృష్టిలో పెట్టుకుని చిదంబరం అని పిలుస్తుంటారు. రాను రాను సాల్మన్ కూ అలా పిలిస్తేనే పలకడం అలవాటైపోతుంది! తన అసలు పేరు ఏమిటో అతను కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మెల్లకన్ను కారణంగా అవమానం ఎదురైన ప్రతిసారి దేవుడు ఎందుకు తనని ఇలా పుట్టించాడా? అని బాధపడుతూ ఉంటాడు. చిదంబరం చిన్నప్పుడే అప్పులు తీర్చలేని పరిస్థితిలో అతని తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో తల్లి (కల్పలత), కొడుకులే ఆ అప్పులు తీర్చుతూ జీవితాన్ని గడుపుతుంటారు. తండ్రి మరణం కారణంగా చదువు మధ్యలో ఆపేసి చిదంబరం తాపీ పనికి వెళ్ళడం మొదలు పెడతాడు. ఎప్పటికైనా మేస్త్రి అవ్వాలని, చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ జీవితంలో ఎదగాలని అతను కోరుకుంటాడు. అదే ఊరికి చెందిన లీల (సంధ్య వశిష్ఠ)కు చిదంబరం అంటే ఇష్టం. కానీ తన కంటి లోపాన్ని అతను కూలింగ్ గ్లాసెస్ తో కవర్ చేసుకోవడాన్ని ఆమె సహించలేకపోతుంది. 'తనని తాను ప్రేమించుకోని వ్యక్తితో జీవితాన్ని ఎలా గడపాల'నే సందేహం లీలకు కలుగుతుంది. దాంతో చిదంబరం, లీల మధ్య ఊహించని దూరం ఏర్పడుతుంది. మెల్లకన్నుకు చికిత్స చేయించుకుందామని లక్షరూపాయలు అప్పు చేసి మరీ రాజమండ్రి వెళ్ళిన చిదంబరంకు అక్కడ ఎలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది? అతనికి ఆ సమయంలో లీల ఎలా అండగా నిలిచింది? చిదంబరంగా బలపడిపోయిన తన పేరును తిరిగి సాల్మన్ గా ఎలా పొందాడు? అనేది మిగతా కథ.
గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో రెండు క్రైస్తవ కుటుంబాల మధ్య సాగే కథ ఇది. హీరో, హీరోయిన్లు ఇద్దరివీ క్రైస్తవ మూలాలున్న కుటుంబాలే. అయితే వాటిని అలా దర్శకుడు ఎందుకు చూపించాడనే దానికి కారణం ద్వితీయార్ధంలో తెలుస్తుంది. సువార్త స్వస్థత కూటమిలో నడవలేని వారిని సైతం పాస్టర్ నడిపించడం చూసి, హీరో తన మెల్లకన్ను బాగు చేయించుకోవడానికి వెళ్ళి మోసపోతాడు. ఆ రకంగా హీరో మతం నేపధ్యాన్ని దర్శకుడు సరిగ్గా వాడుకున్నాడు! ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నది లోపం మనిషి శరీరానికే గానీ మనసుకు కాదు అనేది! దానిని చాలా బలంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. ఈ కథను రాసుకున్న తీరు, తెరకెక్కించిన విధానం రెండూ హృద్యంగానే ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో కథ సాగటంతో ఎలాంటి హంగులు, ఆర్భాటాల జోలుకు వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఆ రకంగా నిర్మాతలు పరిమితమైన బడ్జెట్ లోనే ఈ చిత్రాన్ని తీయగలిగారు.
నటీనటుల విషయానికి వస్తే కొత్త వారైనా వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ తమ పాత్రలను చాలా సహజంగా, చక్కగా పోషించారు. హీరో తల్లిగా కల్పలత, హీరోయిన్ తల్లిగా తులసి సైతం ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇతర ప్రధాన పాత్రలను గోపీనాథ్, శివకుమార్ మట్టా, అరుణ్ కుమార్, నాయుడు మోరమ్, శంకరరావు తదితరులు పోషించారు. అందరి నుండి అద్భుతమైన నటనను రాబట్టడంలో దర్శకుడు వినయ్ రత్నం సక్సెస్ అయ్యారు. అలానే చందు రవి అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం కూడా చక్కగా ఉన్నాయి. ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి (M.M. Keeravani) పాడిన పాట సినిమాకు హైలైట్. పాటల సాహిత్యమూ అర్థవంతంగా ఉంది.
మనిషి తనలోని లోపాలకు వెరవకుండా, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలనే చక్కని సందేశం ఇందులో ఉంది. చిన్న చిన్న సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడే వారికి ఈ చిత్రం మనో ధైర్యాన్ని ఇస్తుంది. పతాక సన్నివేశం ఊహకందేదే అయినా... చిదంబరం పాత్రను మలిచిన తీరు చక్కగా ఉంది. ఓ అర్థవంతమైన, సహజమైన, సందేశాత్మక చిత్రాన్ని చూశామనే భావనకు ప్రేక్షకులు లోనవుతారు. అయితే ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు పెద్దంత పేరున్న వారు కాకపోవడంతో థియేటర్లలో ఈ సినిమా ఎంతకాలం నిలిచి ఉంటుందన్నదే సందేహం! ఓటీటీలో దీనికి గొప్ప ఆదరణ లభించే ఆస్కారం ఉంది. ఇలాంటి చిత్రాలు మలయాళంలో వస్తే మనవాళ్ళే నెత్తిన పెట్టుకుని ప్రచారం చేసేవారు. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వడానికి ప్రయత్నించిన దర్శకుడు వినయ్ రత్నం, నిర్మాతలు చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి, పంపిణీ దారుడు వంశీ నందిపాటిని అభినందించాలి.
రేటింగ్: 3 / 5
ట్యాగ్ లైన్: మనసులు గెలిచే చిదంబరం!