Biker Review: శర్వానంద్ స్పోర్ట్స్ డ్రామా.. 'బైకర్’ మూవీ ఎలా ఉందంటే?
ABN , Publish Date - Apr 03 , 2026 | 09:31 AM
సంక్రాంతి బరిలో 'నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో అలరించారు శర్వానంద్ (Sharwanand). తాజాగా 'బైకర్’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇది దేశంలోనే మొదటి మోటోక్రాస్ సినిమాగా తెరకెక్కించింది.
సినిమా రివ్యూ: బైకర్ (Biker Review)
విడుదల తేది: 3–4–2026
సంక్రాంతి బరిలో 'నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో అలరించారు శర్వానంద్ (Sharwanand). తాజాగా 'బైకర్’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇది దేశంలోనే మొదటి మోటోక్రాస్ సినిమాగా తెరకెక్కించింది. మాళవిక నాయర్ కథానాయిక. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి, శశాంక్ తదితరులు కీలక పాత్రధారులు. 'మా నాన్న సూపర్ హీరో’ తీసిన అభిలాష్‌రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. శర్వానంద్ న్యూ లుక్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆయన చేసిన కొత్త ప్రయత్నం, రాజశేఖర్ ఆయనకు తండ్రిగా నటించడం ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
సునీల్ నారాయణ్ (రాజశేఖర్) పేరున్న మోటో క్రాస్ రేసర్. ఈ క్రీడకు క్రికెట్ తరహాలో గుర్తింపు తీసుకురావాలనేది ఆయన కోరిక. కొన్ని కారణాల వల్ల సునీల్ మాజీ మోటోక్రాస్ రేసర్ అవుతాడు. దాంతో మరింత మందిని రేసర్‌లను తయారు చేసే పనిలో ఉంటాడు. చిన్నప్పటి నుంచి రేసింగ్ ఇష్టమైన తన కుమారుడు విక్కీ నారాయణ్ (శర్వానంద్) తండ్రి దగ్గరే రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అతను ట్రాక్ ఎక్కాడంటే గెలిచి తీరాల్సిందే! అయితే కోచ్గా ఉన్న తండ్రి మాత్రం విక్కీ గెలుపును అంగీకరించడు. 'నువ్వు రేస్‌లో గెలవలేదు.. మిగిలిన వాళ్లు ఓడిపోయారంతే’ అంటూ అతని సక్సెస్‌ను ఎంజాయ్ చేయనివ్వడు. క్రీడ విషయంలో అంత కఠినంగా ఉంటాడు. దాంతో తండ్రి కలను నెరవేర్చడానికి విక్కీ ఇంటర్నేషనల్ రేసింగ్‌లో పాల్గొనగా కొన్ని కారణాల వల్ల మూడో స్థానంలో ఆగిపోతాడు. ఆ తర్వాత రేసింగ్‌కు దూరమై భార్య అనన్య (మాళవిక నాయర్) తన బిడ్డతో సరదాగా గడుపుతుంటాడు. దానివల్ల తండ్రీ కొడుకులు ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది. విక్కీ రేసింగ్ ఆపేయడానికి కారణమేంటి? కొన్నేళ్ల తర్వాత విక్కీ మళ్లీ ట్రాక్ ఎందుకు ఎక్కాడు? ఇంటర్‌నేషనల్ స్థాయిలో రేసింగ్‌లో పాల్గొని గెలిచాడా? తండ్రి కల నెరవేరిందా లేదా అన్నది కథ.
విశ్లేషణ:
మోటోక్రాస్ రేసింగ్, తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో సాగే కథ ఇది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథలకు ఆడే ఆటలో సోల్ ఎంత ముఖ్యమో.. భావోద్వేగాలకు అంతే స్థానం ఉంటుంది. ఇలాంటి కథలో అడుగు ముందుకు వేయాలన్నా.. వెనక్కి వేయాలన్నా భావోద్వేగాలే కీలకం. దర్శకుడు ఈ రెండింటిని మిళితం చేసి ఈ సినిమా తెరకెక్కించాడు. అయితే ఇందులో కీలకమైన భావోద్వేగాలు పండలేదు. 2003 సమయంలో కథ మొదలవుతుంది. ఫస్టాఫ్ అంతా హీరో ఇంట్రడక్షన్, ప్లాష్‌బ్యాక్, తండ్రితో బంధం, ప్రేయసితో లవ్ సీన్స్, అన్వర్‌తో రేసింగ్ కాంపిటీషన్‌తో సాగుతుంది. ఇదంతా కొత్తగా ఏమీ ఉండదు. తండ్రిపై నిందలు పడటం.. అది కొడుకు తట్టుకోలేకపోవడంతో సెకెండాఫ్ మంచి సంఘర్షణతో మొదలవుతుంది. హీరో రేసింగ్‌కు దూరమవ్వడానికి కారణాలు తేలిపోయినట్లు ఉన్నా.. తిరిగొచ్చి జర్మనీ రేసర్‌తో తలపడే సన్నివేశాలు థ్రిల్ కలిగిస్తాయి. తండ్రీకొడుకుల నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్లాష్‌బ్యాక్ పక్కనపెడితే ట్రాక్‌లో రేసింగ్ సన్నివేశాలు మాత్రం ఆడియన్స్‌ను చక్కగా అలరిస్తాయి. రేసింగ్ నేపథ్యమున్న చిత్రాలు తెరపై అంతగా రాకపోవడంతో ఇది కాస్త కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సినిమాకు ఎంతో కీలకమైన క్లైమాక్స్ రేసింగ్ సీన్‌కు ఇంకాస్త భావోద్వేగాలు జోడించే ఉంటే ఇంపాక్ట్ బావుండేది. దర్శకుడు రాసుకున్న కథ బావుంది. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ దగ్గరకు వచ్చే సరికి పాత ఫార్మెట్‌లో వెళ్ళిపోయాడు. రేసింగ్ సీన్స్ మాత్రం మెప్పిస్తాయి. సెకెండాఫ్‌లో మాటలు ఆకట్టుకుంటాయి. కథకు కావలసిన భావోద్వేగాలను పక్కన పెడితే మిగతాది అంతా దర్శకుడు బాగానే మేనేజ్ చేశాడు. చివరి 20 నిమిషాల సినిమాను బాగా ప్లాన్ చేసుకున్నాడు.
నటీనటుల పనితీరు..
హీరోగా శర్వానంద్ ఈ సినిమాకు యాప్ట్ అయ్యారు. రేసర్‌గా నటించడానికి శారీరకంగా, మానసికంగా ఆయన పడ్డ కష్టం తెరపై కనిపించింది. లుక్ పరంగా, నటన పరంగా ఎక్కడా పేరుపెట్టలేం. నేచురల్‌గా కనిపించారు. యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించారు. శర్వాకు భార్యగా అనన్య పాత్రలో మాళవిక నాయర్ కూడా బాగా చేశారు. నటన పరంగానూ, గ్లామర్‌గానూ అలరించారు. హీరోహీరోయిన్.. ఇద్దరికీ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. రేసింగ్ కోచ్ సునీల్ నారాయణ్ పాత్రలో రాజశేఖర్ జీవించారు. సినిమాకు ఆయన పాత్ర కీలకం. ఆయన అనుభవం ఈ పాత్రను పండించడంలో ఉపయోగపడింది. హీరోయిన్ తల్లిగా తులసి మెరిశారు. అతుల్ కులకర్ణి పాత్ర హుందాగా ఉంది. బ్రహ్మాజీ, నవీన్ నేని మరో రేసర్ అన్వర్ పాత్రధారి ఆయా పాత్రలకు యాప్ట్ అయ్యారు. సాంకేతిక పరంగా చూస్తే జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్. జిబ్రాన్ పాటల్లో మెరుపులు లేవుగానీ, నేపథ్య సంగీతం బాగా ఇచ్చాడు. రేసింగ్ సీన్స్‌లో రీ-రికార్డింగ్ బావుంది. ఎడిటర్ ఫస్టాఫ్‌కు కాస్త కత్తెర వేసుంటే బావుండేది. యు.వి సంస్థ ఖర్చు బాగానే పెట్టారు. అది తెరపై కనిపించింది. అంచనాలు లేకుండా వెళ్లి థియేటర్లో కూర్చుంటే రేసింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
ట్యాగ్‌లైన్: ఎమోషన్ లెస్ బైకర్
రేటింగ్: 2.5/5