Naari Naari Naduma Murari Review: నారీ నారీ నడుమ మురారి రివ్యూ
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:11 PM
శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'నారీ నారీ నడుమ మురారి'. ఈ సంక్రాంతి సీజన్ లో చివరిగా వచ్చిన ఈ మూవీ వినోదాల విందు వడ్డించడంలో మాత్రం ముందుంది.
'శర్వానంద్ కు కలిసొచ్చిన సీజన్ సంక్రాంతి. కాబట్టి ఈ సారీ ఆ సెంటిమెంట్ ఫలిస్తుందనే నమ్మకంతో వచ్చేస్తున్నాం' అని 'నారీ నారీ నడుమ మురారి' నిర్మాత అనిల్ సుంకర చెప్పినప్పుడు చాలామంది... ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా అనుకున్నారు. ఎందుకంటే ఇటు అనిల్ సుంకర... అటు శర్వానంద్... ఇద్దరూ సక్సెస్ అనే మాట విని చాలా యేళ్ళైంది. కానీ వాళ్ళది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు... పక్కాగా కాన్ఫిడెన్సే అని నిరూపించిందీ సినిమా. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ వినోదాన్ని పంచిన చిత్రాలే అందులో టాప్ త్రీ మూవీస్ లో ఖచ్చితంగా 'నారీ నారీ నడుమ మురారి' కూడా ఉంటుంది.
ఇంతకూ ఈ సినిమా కథేమిటంటే... కేరళలో పక్క ఇళ్ళలో ఉండే గౌతమ్ (శర్వానంద్), నిత్య (సాక్షి వైద్య) ప్రేమలో పడతారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చినా వీరి ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది. పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న సమయంలో గౌతమ్ తండ్రి కార్తీక్ (నరేశ్) చేసిన ఓ వ్యవహారం వీళ్ళ పెళ్ళికి అవరోధంగా మారుతుంది. కార్తీక్ రెండో పెళ్ళి చేసుకోవడంతో గౌతమ్ కు తన కూతురును ఇచ్చి పెళ్ళి చేయడానికి మొదట నిరాకరించిన నిత్య తండ్రి చివరకు రిజిస్టర్ మ్యారేజ్ కు అంగీకరిస్తాడు. అయితే అక్కడా గౌతమ్ కు చుక్కెదురవుతుంది. ఈసారి గౌతమ్ కు అతని గత జీవిత భాగస్వామి దియా (సంయుక్త) తో జరిపిన ప్రేమ, పెళ్ళి, విడాకులు అడ్డంకిగా మారతాయి. ఈ సమస్యలను పరిష్కరించుకుని ముందుకెళ్దామనుకుంటే... దియానే వీరిద్దరూ పనిచేసే ఆఫీస్ లో టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇస్తుంది. దాంతో ఈ ఇద్దరు అతివల నడుమ గౌతమ్ ఎలా నలిగిపోయాడు అనే దానిని దర్శకుడు వీలైనంత వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు.
'నారీ నారీ నడుమ మురారి' అనే టైటిల్ ను ఎందుకు ఏరికోరి పెట్టారో ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు బాగా అర్థమౌతుంది. గత కాలపు అనుభవాలు ఎలా మనిషి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు అవరోధమౌతాయో దర్శకుడు రామ్ అబ్బరాజు అద్భుతంగా తెరమీద చూపించాడు. అలానే ప్రేమకు, పెళ్ళికి వయసుతో సంబంధం లేదనే అంశాన్ని నరేశ్ తో చెప్పించాలనుకోవడంతో సబబుగా అనిపిస్తుంది. నరేశ్ పాత్రతో ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. సహజంగా ఆర్టిస్టులు కాకుండా పాత్రలే కనిపిస్తే జనం ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం పాత్ర కాకుండా నరేశే ఎక్కువగా కనిపిస్తాడు. నరేశ్ వ్యక్తిగత జీవితాన్ని లింక్ చేసుకుంటూ ఆడియెన్స్ మరింతగా ఎంజాయ్ చేసే ఆస్కారం ఏర్పడింది. ప్రతి సన్నివేశాన్ని ఫన్ రైడ్ లా దర్శకుడు మలిచాడు. తన ప్రేమను నిలబెట్టుకోవడానికి తండ్రిని గౌతమ్ అడ్డం పెట్టుకోవడం, గురుపూజ పేరుతో సంపత్ రాజ్, వెన్నెల కిశోర్ మీద చిత్రీకరించిన సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి.
బేసికల్ గా రైటర్ అయిన రామ్ అబ్బరాజు 'సామజవర గమన'తో దర్శకుడయ్యాడు. అతనికి కుడిఎడమలుగా భాను, నందు నిలిచారు. ఈ సినిమా విషయంలోనూ వారే దన్నుగా ఉన్నారు. ఒకరు కథను అందిస్తే మరొకరు మాటలు సమకూర్చారు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఓ నాన్ స్టాప్ ఫన్ రైడ్ ను ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. సినిమా ఎప్పుడు మొదలై ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియనంత వేగంగా సన్నివేశాలన్నీ చకచకా సాగిపోయాయి.

నటీనటుల విషయానికి వస్తే... శర్వానంద్ చాలా కాలం తర్వాత హాయిగా తన పాత్రను చేసేశాడనిపిస్తుంది. ఇరువురు భామల నడుమ నలిగిపోయే పాత్రలోనూ కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. ఆ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సిన అతని తండ్రిగా నటించిన నరేశ్ ను, 'సామజవర గమన' సినిమాలోనూ నరేశ్ పాత్రే వెన్నుముకగా నిలిచింది. ఇందులోనూ అది మరోసారి రిపీట్ అయ్యింది. అతని భార్యగా, శర్వా పిన్నిగా సిరి హన్మంతు బాగా చేసింది. ఇక హీరోయిన్లు ఇద్దరూ తెర మీద బాగున్నారు. సాక్షి వైద్య కంటే నిజానికి సంయుక్త సీనియర్ అయినా... ఆమె పాత్రకు ఉన్న స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో బాగానే చేసింది. కానీ సాక్షి కొంత డామినేట్ చేసింది. గతంలో అనిల్ సుంకర నిర్మించిన 'ఏజెంట్' మూవీలో సాక్షి వైద్య హీరోయిన్ గా చేసింది. ఆ సినిమాతో హిట్ అందుకోలేకపోయినా సాక్షికి అనిల్ సుంకర ఈ సినిమాతో విజయాన్ని అందించారు. ఇక సత్య, సుదర్శన్, వెన్నెల కిశోర్, సునీల్, మధునందన్ అందరూ ఒకరితో ఒకరు పోటీలు పడి నవ్వుల జల్లులు కురిపించారు. శ్రీకాంత్ అయ్యంగార్, రఘుబాబు, గెటప్ శ్రీను ఇతర పాత్రలలో కనిపిస్తారు. పతాక సన్నివేశంలో శ్రీవిష్ణు ఎంట్రీ, అతని పాత్రను మలిచిన తీరు చాలా బాగుంది. ఆ పాత్రతో ఓ టోటాలిటీ సినిమాకు వచ్చిన భావన అందరికీ కలిగింది. విశాల్ చంద్రశేఖర్ సమకూర్చిన బాణీలు, నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. మొత్తం మీద ఈ సంక్రాంతి శర్వాకు, అనిల్ సుంకరకు సరైన సమయంలో సరైన విజయాన్ని అందించిందని అనుకోవచ్చు.
రేటింగ్ : 3/5
ట్యాగ్ లైన్: హిలేరియస్ ఫన్ రైడ్!