సీతా పయనం సినిమా రివ్యూ
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:38 PM
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాలో ఓ దర్శకుడూ ఉన్నాడు. తన కుమార్తె ఐశ్వర్య ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ అర్జున్ నిర్మించిన సినిమా 'సీతా పయనం'. శనివారం ఈ సినిమా జనం ముందుకు వచ్చింది.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja)... బాల నటుడిగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ యాక్టర్. అయితే నటుడిగా కొనసాగుతూనే కొన్ని చిత్రాలను అర్జున్ డైరెక్ట్ చేశారు కూడా. కాస్తంత గ్యాప్ తర్వాత ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా 'సీతా పయనం' (Seetha Payanam). ఈ సినిమాతో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా, ఉపేంద్ర సోదరుడి కొడుకు నిరంజన్ హీరోగా పరిచయం అయ్యారు. శనివారం జనం ముందుకు వచ్చిన 'సీతా పయనం' ఎలా ఉందో తెలుసుకుందాం.
సీత (ఐశ్వర్య అర్జున్ Aishwarya Arjun) తల్లి లేని పిల్ల. మల్టీమిలియనీర్ రాజేంద ప్రసాద్ (సత్యరాజ్ Satya Raj) ఆ లోటు తెలియకుండా కూతురుని పెంచుతాడు. షెఫ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీత ఒకసారి వైజాగ్ నుండి హైదరాబాద్‌కు కారులో జర్నీ చేస్తుంది. కారు బ్రేక్ డౌన్ అయిన అభి (నిరంజన్) అనే కుర్రాడు హైదరాబాద్ వరకూ లిఫ్ట్ ఇవ్వమని కోరడంతో మొదట కాస్తంత హెజిటేట్ చేసినా చివరకు అంగీకరిస్తుంది. ఆ దారిలో ఒకరి గురించి ఒకరికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. సీతాపురం వెళ్ళే దారిలో అభిని దించి, సీత హైదరాబాద్ చేరుతుంది. సీత హాజరు కావాల్సిన వర్క్ షాప్ జరిగే హోటల్... ఆమె లోపలకు అడుగు పెట్టడానికి కొన్ని సెకన్ల ముందు భారీ అగ్ని ప్రమాదానికి గురవుతుంది. అందులోని వారంతా చనిపోతారు. కాస్తంత ఆలస్యంగా అక్కడకు రావడం వల్లే తను ప్రాణాలతో ఉన్నానని సీత భావిస్తుంది. వైజాగ్ నుండి హైదరాబాద్ వరకూ చేసిన ప్రయాణంలో తనకు తారసపడిన వారందరికీ ధ్యాంక్స్ చెప్పాలని అనుకుంటుంది. ఆ తిరుగు ప్రయాణం సీత జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది? తల్లిలేని సీత... అభికి తన మనసులోని ప్రేమను తెలియచేసిందా? అసలు అభి ఆమె జీవితంలోకి ఎప్పుడు, ఎలా అడుగుపెట్టాడు? అందులో ఆమె తండ్రి పాత్ర ఏమిటీ? అనేది మిగతా కథ.
పేరుకు తగ్గట్టుగానే ఇది సీత జీవిత పయనం. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన సీతకు... ఆమె తండ్రికి సంబంధించిన కథ. ఈ తండ్రీ కూతుళ్ళు ఒకరి కోసం ఒకరు త్యాగాలకు సిద్థపడటం అనేది కాస్తంత కొత్త పాయింటే. సినిమా దాదాపుగా వైజాగ్ టు హైదరాబాద్ రోడ్ జర్నీనే అయినా... ఆ సమయంలో తారసపడే వ్యక్తులు, వారి సమస్యలు, తిరుగు ప్రయాణంలో వారి జీవితాల్లో జరిగే మార్పులు.. వీటిని మనసుకు హత్తుకునేలా హాయిగా దర్శకుడు అర్జున్ తెరకెక్కించారు. ఈ జర్నీలోనే సీత, అభి ప్రేమాయణాన్ని హృద్యంగా తెర మీద చూపించారు. పాటలకు స్పేస్ లేకపోయినా... కల్పించుకుని వాటికి చోటిచ్చారు. అయితే వాటి బాణీలు, చిత్రీకరణ బాగుండటంతో ఎలాంటి ఇబ్బంది కలగదు. చిత్రం ఏమంటే... ఈ సినిమాలో అన్ని పాత్రలు మంచివే. అర్జున్ పోషించిన గిరి అనే రౌడీ పాత్రను కూడా పాజిటివ్‌గా మార్చేశారు. ప్రథమార్ధం సరదాగా సాగిపోయినా... ద్వితీయార్ధంకు వచ్చేసరికీ మూవీ గ్రాఫ్ దిగిపోయింది. సీత-అభి ప్రేమకు సంబంధించిన చిక్కు ముడిని తొలగించడానికి దర్శకుడు అర్జున్ కాస్తంత ఎక్కువ సమయమే తీసుకున్నారు. దాంతో ఎప్పుడెప్పుడు శుభం కార్డు పడుతుందా అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే... తన కూతురు ఐశ్వర్యను హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం చేయడానికే అర్జున్ ఈ సినిమా చేశారు. అందువల్ల ఆమె పాత్ర చుట్టూనే కథ తిరిగేలా రాసుకున్నారు. సీత పాత్రను ఐశ్వర్య చక్కగా ఓన్ చేసుకుంది. కాకపోతే డబ్బింగ్ ఆమెతోనే చెప్పించడంతో కొన్ని చోట్ల పదాలను పట్టిపట్టి పలకడం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొత్తవాడైనా నిరంజన్ తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. అర్జున్ స్టైలిష్ రౌడీ పాత్రను సునాయాసంగా పోషించారు. హీరో తాతయ్యగా ప్రకాశ్ రాజ్ (Prakash Raj) తనదైన అభినయాన్ని ప్రదర్శించారు. సత్యరాజ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇతర ప్రధాన పాత్రలను కోవై సరళ (Kovai Sarala), సిరి హన్మంతు, నాగమహేశ్, మణిచందన, సుమిత్ర తదితరులు పోషించారు. అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా ఇందులో ఓ కీలక సన్నివేశంలో నటించాడు. అతనిపై ఫైట్‌ను పాట నేపథ్యంలో చిత్రీకరించారు. దర్శకులు, నిర్మాతలు ఇటీవల సినిమాల్లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం కామన్ అయిపోయింది. ప్రముఖ నిర్మాత కె. ఎల్. దామోదర ప్రసాద్ ఇందులో అతిథి పాత్రను పోషించారు.
అనూప్ రూబెన్స్ (Anup Rubens) నేపథ్య సంగీతంతో పాటు రెండు మూడు పాటల స్వరాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్‌గా నిలిచింది. బుర్రా సాయిమాధవ్ మాటలు బాగున్నాయి. అర్జున్ దర్శకత్వప్రతిభ సినిమాలోని ప్రతి సన్నివేశంలో కనిపిస్తూనే ఉంది. కుటుంబ విలువలు, అనుబంధాలు మృగ్యమౌతున్న ఈ రోజుల్లో అర్జున్ వాటికి ప్రాధాన్యమిస్తూ ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ను రూపొందించడం అభినందించదగ్గది. అయితే నిడివి సినిమాకు ప్రధాన ప్రతిబంధం అని చెప్పక తప్పదు.
రేటింగ్: 2.75/5
ట్యాగ్ లైన్: సుదీర్ఘ పయనం!