Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి కొణిదెల సతీ లీలావతి రివ్యూ
ABN , Publish Date - May 08 , 2026 | 01:42 PM
లావణ్య త్రిపాఠి కొణిదెల, మోహన్ దేవ్ జంటగా నటించిన సినిమా 'సతీ లీలావతి'. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం జనం ముందుకొచ్చింది.
దాదాపు పదిహేనేళ్ళ క్రితం 'అందాల రాక్షసి' (Andala Rakshasi_ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాఖండ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇవాళ తెలుగువారింటి కోడలు. కథానాయకుడు వరుణ్ తేజ్ (Varun Tej) తో ఆమె వివాహం 2023లో అయ్యింది. పెళ్ళికి ముందు లావణ్య త్రిపాఠి ఉమెన్ సెంట్రిక్ మూవీ 'హ్యాపీ బర్త్ డే' (Happy Birthday) చేసింది. పెళ్ళి తర్వాత మరోసారి అదే తరహాలో 'సతీ లీలావతి' (Sathi Leelavathi) సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది. అప్పట్లో 'హ్యాపీ బర్త్ డే' ఆమెకు చేదు అనుభవాన్ని అందించింది. మరి ఇప్పుడు 'సతీ లీలావతి' ఎలాంటి అనుభవాన్ని అందించిందో చూద్దాం.
చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు (పవిత్ర లోకేష్, నరేశ్) చీటికీమాటికి కీచులాడుకోవడంతో చిన్నారి లీల (లావణ్య త్రిపాఠి) మానసికంగా బాగా డిస్ట్రబ్ అవుతుంది. పెరిగి పెద్దయ్యాక సైకియాట్రిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్ Dev Mohan) ఆమెలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచుతాడు. సేతులోని గుడ్ క్వాలిటీస్ నచ్చి అతన్నే ఆమె పెళ్ళాడుతుంది. సేతు కారణంగా ఆమె మూడేళ్ళలో స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతుంది. అక్కడ నుంచే ఆమె కష్టాలు మొదలవుతాయి. భార్య షూటింగ్స్ బిజీలో తనను పట్టించుకోక పోవడంతో సేతు డిప్రెషన్ కు లోనవుతాడు. ఆ సమయంలో నర్స్ నికోలా సెబాస్టియన్ (మడోన్నా సబాస్టియన్) కు దగ్గరవుతాడు. భార్యకు విడాకులిచ్చి... నికోలాను పెళ్ళి చేసుకోవాలని సేతు అనుకుంటాడు. ఆ విషయాన్ని లీలకు చెప్పినప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అయ్యింది? ప్రేమించి మరి పెళ్ళి చేసుకున్న భర్త దూరం అవుతాడని తెలిసి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ ప్రేమజంట విడిపోయిందా? తప్పులు దిద్దుకుని జీవితాన్ని కొనసాగించిందా? దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటీ? అనేదే ఈ సినిమా కథ.
చిన్న చిన్న కారణాల వల్ల భార్య భర్తలు విడిపోవడం చూస్తున్నాం. ఈ కథలోనూ అలాంటి సిల్లీ రీజనే దర్శకుడు తీసుకున్నాడు. భార్య దర్శకురాలని తెలిసి, ఆమె తనకు తగినంత సమయం ఇవ్వలేదని గుర్తించి, అదీ సైకాలజిస్ట్ అయిన ఓ వ్యక్తి అదే కారణంతో ఆమెకు విడాకులు ఇవ్వాలను కోవడం సిల్లీగా అనిపిస్తుంది. విడాకులు తీసుకోబోతున్న ప్రేమజంట అనేది ఈ మూవీలోని బేసిక్ పాయింట్! అందుకు కారణంగా చూపించిన పాయింట్ చాలా బలహీనంగా ఉండటంతో ఆ తర్వాత వచ్చే ఏ సన్నివేశాలతోనూ ప్రేక్షకుడు కనెక్ట్ కాలేని పరిస్థితి నెలకొంది. భార్యాభర్తలు ఎలాంటి అభిప్రాయభేదాలు ఉన్నా కలిసి కాపురం చేయాలంటూ లీల తల్లిదండ్రులనే దర్శకుడు ఉదాహరణగా చూపుతాడు. ఈ పాయింట్ ఎన్నో సినిమాలలో చూపించిందే! అందులో కొత్తదనం లేదు. భార్యను అపార్థం చేసుకుని దూరం అవ్వాలనుకున్న భర్త తిరిగి తప్పు తెలుసుకుని భార్యకు దగ్గరయ్యే కథలు కోకొల్లలుగా వచ్చాయి. కాకుంటే ఇందులో హీరోయిన్ డైరెక్టర్. ఆమె ప్రొఫెషన్ ను బేస్ చేసుకుని కొన్ని కామెడీ సీన్ ను దర్శకుడు తాతినేని సత్య (Thatineni Satya) తెరకెక్కించాడు. కానీ ఆ సన్నివేశాలు పేలవంగా ఉండి, ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి. దాంతో సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఏదో కంగాళీగా సాగినట్టే అనిపిస్తుంది. లీల ప్రెగ్నెంట్ కావడం, భర్తను తిరిగి తన వైపు తిప్పుకోవడం కోసం ఆమె ప్లే చేసే డ్రామా ఇవన్నీ అతికించినట్టుగా ఉన్నాయి. భర్త బుర్ర బద్దలుకొట్టి ఇంటిలోనే బంధించే సన్నివేశాలు, దాని చుట్టూ అల్లిన కామెడీ కూడా అతికించినట్టే ఉంది. కాగితం మీద కథగా రాసుకున్నప్పుడు కాస్తంత కొత్తగా ఉండి ఉండొచ్చు కానీ దాని ఎగ్జిక్యూషన్ ను దర్శకుడు సత్య ఫెయిల్ అయ్యాడు. దాంతో సతీ లీలావతి శిరోభారంగా మారిపోయింది. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలన్నట్టుగా, టైటిల్స్ ముందు వచ్చే కథలోనే ఈ సినిమా జాతకం ఏమిటనేది అర్థమైపోతుంది.
నటీనటుల విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి తెరమీద అందంగా ఉంది. కథానుగుణంగా యాక్షన్ సీన్స్ కూడా చేసింది. కాకపోతే సెంటిమెంట్ సీన్స్ పండించలేకపోయింది. హీరో దేవ్ మోహన్ చూడటానికి బాగున్నాడు. కానీ డబ్బింగ్ అతనితో కాకుండా వేరే వాళ్ళతో చెప్పించి ఉండాల్సింది. నిజ జీవితంలో భార్యాభర్తలైన పవిత్ర లోకేష్, నరేశ్ ఇందులో అవే పాత్రలు చేశారు. నరేశ్ పాత్ర నిడివి కాస్త ఎక్కువ. కానీ ఆయన్ని సరిగా ఉపయోగించుకోదు. సినిమా నిర్మాతగా మొట్ట రాజేంద్రన్, లాయర్ గా వీటీవీ గణేశ్, లీల మేనబావగా జాఫర్ సిద్ధిక్, పోలీస్ ఆఫీసర్ గా తాగుబోతు రమేశ్ తదితరులు నటించారు. హీరో ప్రేమించే నర్స్ పాత్రను మడోన్నా సబాస్టియన్ చేసింది. ద్వితీయార్థంలో దొంగగా అడుగుపెట్టిన సప్తగిరి చేసే అతిని తట్టుకోవడం చాలా కష్టం. సినిమాలో మిక్కీ జే మేయర్ స్వరపర్చిన పాటలు కూడా భారంగానే సాగుతాయి. వాటిని తీసేసినా సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సినిమాకు ఉదయ్ పొట్టిపాడు మాటలు రాశారు. కొన్ని చోట్ల అవి శుత్రిమించాయి. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ అందించారు. నిర్మాత నాగమోహన్ తొలి యత్నంగా తీసిన 'సతీ లీలావతి' ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చే ఆస్కారం ఎక్కువ. ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లి అయిన లావణ్య త్రిపాఠి ఈ సినిమా ప్రమోషన్స్ లో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 'సతీ లీలావతి' చూసిన తర్వాత ఆమె సరైన నిర్ణయమే తీసుకున్నారనిపిస్తుంది.
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: అతి లీలావతి!