Purushah Review: భార్యాబాధితుల కథ 'పురుషః' ఎలా ఉందంటే
ABN , Publish Date - May 22 , 2026 | 02:43 PM
నూతన నటుడు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పరిచయమవుతూ కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించిందో చూద్దాం.
సినిమా రివ్యూ: పురుషః
విడుదల తేది: 22-5-2026
నూతన నటుడు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పరిచయం చేస్తూ బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుషః’. దీనికి వీరు వులవల దర్శకత్వం వహించారు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని, పమ్మి సాయి, వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. భార్యాబాధితుల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించిందో చూద్దాం.
కథ:
గోవింద్ (పవన్ కళ్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజ్ కుమార్), కిస్ (వెన్నెల కిశోర్) చిన్నప్పట్నుంచి స్నేహితులు. ఈ ముగ్గురు కమల (రాయంచ), లక్ష్మి (హాసిని), గీత (విషిక)లను పెళ్లి చేసుకుంటారు. ఇందులో గోవింద్‌ది ప్రేమ వివాహం. మిగతా ఇద్దరివి పెద్దలు కుదిర్చినవి. పెళ్లయిన ఏడాదిలోపే వీరి జీవితాలు పెళ్లాల చేతిలోకి వెళ్లిపోతాయి. అనుమానంతో వీళ్ళంతా భర్తల్ని ఓ ఆట ఆడుకుంటారు. ఓ శుభ తరుణంలో కిస్ (వెన్నెల కిశోర్) పెళ్లి పిలుపు రావడంతో మూడు ఫ్యామిలీలు పెళ్లికి హాజరవుతారు. గోవింద, సత్తి, శ్రీను కుర్రతనంలో చేసిన చిలిపి చేష్టల గురించి కిస్ రాసిన డైరీ వల్ల భార్యలు ముగ్గురికి తెలుస్తుంది. ఇంతకీ ఆ డైరీలో ఏముంది? గోవింద్‌కు, ఫ్రాన్స్ అమ్మాయి రోజీకి ఉన్న సంబంధం ఏంటి? కోర్టు వరకూ వెళ్లిన ఈ మూడు జంటల కాపురాలు ఏ తీరానికి చేరాయి? అన్నది కథ.
విశ్లేషణ:
ప్రస్తుతం సొసైటీలో చూస్తున్న భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు, విడాకులకు దారితీస్తున్న వైనాలు, అప్పుడప్పుడు పడుతున్న రాజీల ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమా ఇది. మొదటి పదిహేను నిమిషాల కథ ఆర్టిస్ట్‌ల పరిచయం, వారి ప్రేమ, పెళ్లిలతో సాగింది. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన ముగ్గురు మగాళ్లు జడ్జి (వీటీవీ గణేశ్)కి తమ కథ చెప్పడంతో ఫ్లాష్‌బ్యాక్ మొదలవుతుంది. బ్యాక్ స్టోరీలో భార్యభర్తల మధ్య జరిగిన గొడవలు, ఇతర తంతు పెద్దంత కొత్తగా అనిపించదు. అదంతా సాదాసీదాగా సాగింది. 'వెన్నెల' కిశోర్ ఎంట్రీతో తెరపై కాస్త నవ్వులు పండుతాయి. అక్కడి నుంచే కథ ఆసక్తిగా మారుతుంది. విరామానికి ముందు కూడా 'వెన్నెల' కిశోర్ హంగామానే నడుస్తుంది. అతని చేతిలో ఉన్న పుస్తకం కథను మలుపు తిప్పుతుంది. 'వెన్నెల' కిశోర్ తెర మీద మిస్ అయినప్పటి నుంచి కథ ఫ్లో ఆగిపోతుంది. సెకెండాఫ్ ప్రారంభం నుంచి గోవింద్, రోజీ ట్రాక్ తెరపైకి వస్తుంది. అదేమీ పెద్ద ఆసక్తికరంగా సాగలేదు. జడ్జి ముందు ముగ్గురు హీరోలు చెప్పే కథ సాదాసీదాగా బోరింగ్‌గా అనిపిస్తుంది. భార్యభర్తలు ఫైటింగ్ చేసుకునే సన్నివేశాలు రక్తి కట్టిస్తాయి. క్లైమాక్స్‌లో కాస్త భావోద్వేగాన్ని జోడించారు. పెళ్లయిన మగాడి కష్టాలు ఎలా ఉంటాయో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అయితే అది అన్ని చోట్ల వర్కవుట్ కాలేదు. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఊహించనిది. చదువుకునే రోజులలో అల్లరి చేష్టలు సహజం. వాటివల్ల విడాకులు వరకూ వెళ్లాలా అన్నది సమంజసంగా అనిపించదు. దానికి ఇంకా ఏదైనా బలమైన రీజన్ చెప్పుంటే బావుండేది. క్లైమాక్స్‌లో భార్యల్ని యుద్ధంతో కాదు.. ప్రేమతో గెలవాలి’ అనే ఓ సందేశం ఇచ్చారు.
నటీనటులు సాంకేతిక నిపుణుల విషయానికొస్తే..
నూతన నటుడు పవన్ కల్యాణ్ నటన పరంగా ఫర్వాలేదని పించారు. హీరోయిన్‌గా నటించిన రాయంచ కొక్కుర అందం, అభినయంతో ఆకట్టుకుంది. హాసిని, విషిక కూడా పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. 'వెన్నెల' కిశోర్ తన స్టైల్ కామెడీతో న్యాయం చేశారు. వీటీవీ గణేశ్ పాత్రను అదే స్లాంగ్‌తో రొటీన్ చేసి పడేశారు. కసిరెడ్డి పాత్ర కూడా అంతే! సప్తగిరి యాక్టింగ్ సటిల్డ్‌గా ఉంది. తనదైన స్టైల్ వినోదంతో మెప్పించాడు. సినిమా మేకింగ్ విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కథకు కావలసినట్లు ఖర్చుపెట్టారు. పాటలు అంతగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా అంతే! ఐటెమ్ సాంగ్ ప్లేస్‌మెంట్ కరెక్ట్ గా లేదు. ఎడిటర్ సెకెండాఫ్ నిడివి తగ్గించాల్సింది. భార్యాబాధితుల నేపథ్యంలో దర్శకుడు రాసుకున్న కథ ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ తరహాలో ఉన్నా... ఆ స్థాయి ఎగ్జిక్యూషన్ తెరమీద కనిపించలేదు. ఈ కథను లైటర్ వేలో కామెడీగా చెప్పాలనుకున్నారు. కానీ తెరపై అది పూర్తిస్థాయిలో వర్కవుట్ కాలేదు. కథపై ఇంకాస్తంత శ్రద్థ పెట్టి ఉంటే బావుండేది. అయితే అక్కడక్కడా నవ్వులు పంచే ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.
ట్యాగ్‌లైన్: భార్యాబాధితులు.. అక్కడక్కడా నవ్వులు
రేటింగ్: 2.5/5