Premane Oorilo Review: కన్నడ సూపర్ హిట్ చిత్రం 'ప్రేమనే ఊరిలో' ఎలా ఉందంటే

ABN , Publish Date - Oct 04 , 2026 | 10:38 AM

కన్నడలో సూపర్‌ హిట్టైన ‘ప్రేమడ ఊరలి’ చిత్రం తెలుగులో ‘ప్రేమనే ఊరిలో’ పేరుతో అనువాదమైంది. శ్రీరామ్‌, తపస్విని పూనాచ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించిందో చూద్దాం. 

సినిమా రివ్యూ: ప్రేమనే ఊరిలో... (Premane Oorilo Movie Review)

కన్నడలో సూపర్‌ హిట్టైన ‘ప్రేమడ ఊరలి’ చిత్రం తెలుగులో ‘ప్రేమనే ఊరిలో’ పేరుతో అనువాదమైంది. శ్రీరామ్‌, తపస్విని పూనాచ జంటగా నటించిన చిత్రమిది. రమిక శివు, రంగాయణ రఘు కీలక పాత్రధారులు. మనోజ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. వనిల్లా ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపైౖ మమత దేవేంద్ర నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 25న కన్నడలో విడుదల చేయగా బ్లాక్‌బస్టర్‌ హిట్టైంది. మహారత్న ప్రొడక్షన్స్‌, ఐఓ పిక్చర్స్‌ బ్యానర్‌ పై చందు శ్రీనివాస్‌, సురేష్‌ కొండేటి తెలుగులో రిలీజ్‌ చేశారు. మరీ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించిందో చూద్దాం.  
కథ:  

సంతోశ్‌ (శ్రీరామ్‌) చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో తండ్రి నాగన్న(రంగాయన రఘు) తల్లిలేని లోటు తెలియకుండా పెంచుతాడు. పొలం పనులు చేసుకుంటూ తండ్రికి అండగా ఉంటాడు సంతోశ్‌. ఆ ఊళ్ళోనే చదువు లేకుండా మగరాయుడిలా తిరిగే వసంత(రమిక శివు) తన స్నేహితురాలి మాట విని సంతోష్‌ని ఇష్టపడుతుంది. అతన్నే పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. కానీ నాగన్న తన కొడుకుకి చక్కగా చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. సంతోష్‌ ఏమో పెళ్లి అనగానే ‘కండీషన్స్‌ అప్లై’ అంటాడు. అలా ఎన్నో సంబంధాలు వెనక్కి వెళ్లిపోతాయి. అదే సమయంలో అమెరికా నుంచి వచ్చి  లవర్‌ మోసం చేసిన డిప్రెషన్‌లో ఉన్న రుక్మిణి (తపస్విని పూనాచ)కి సంతోష్‌ పరిచయం అవుతుంది. ఆమె మాటలకు ఫిదా అయ్యి ఇష్టం పెంచుకుంటాడు. ఓ రోజు తండ్రి నాగన్న తన కొడుకుని ఓ పెళ్లి మండపానికి పిలిచి, తన ఫ్రెండ్‌ కూతురు పెళ్లి పీటల మీద ఆగిపోయిందని చెప్పి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్‌ చేస్తాడు. మరి సంతోష్‌ తండ్రి మాటలు విన్నాడా? రుక్మిణిపై ప్రేమను వదులుకున్నాడా? బావ మీదున్న ప్రేమను వసంత బయట పెట్టిందా? గతాన్ని తలుచుకుని నాగన్న కుమిలి పోవడానికి కారణం ఏంటి? ఫైనల్‌గా సంతోశ్‌ ఎవరికి దగ్గరయ్యాడు అన్నది కథ.


విశ్లేషణ:
కన్నడలో సూపర్‌హిట్టై కలెక్షన్లు వర్షం కురిపించిన సినిమా ఇది. ఫస్టాఫ్‌ అంతా సంతోష్‌, అతని మరదలి అల్లరి, పల్లెలో వారి జీవితాల నేపథ్యంలో సరదాగా సాగిపోయింది. క్యూట్‌ లవ్‌స్టోరీతో మొదలైన కథ.. ఎమోషనల్‌ టర్న్‌ తీసుకుంటుంది. వసంత వన్‌ సైడ్‌ లవ్‌ ట్రాక్‌, రుక్మిణి కోసం సంతోశ్‌ వెతుకులాట, నాగన్న తన కొడుకుని ఫ్రెండ్‌ కూతుర్ని పెళ్లి చేసుకోమని ఆర్డర్‌ వేయడంతో విరామం ఇచ్చి సెకెండాఫ్‌ మీద ఆసక్తి క్రియేట్‌ చేశారు. ద్వితీయార్థం అంతా సంతోష్‌ పెళ్లి,  కొత్త జీవితం, చిన్నచిన్న మనస్పర్థలు, నాగన్న ఫ్లాష్‌ బ్యాక్‌, బావని ఇష్టపడ్డ వసంత ఎమోషన్స్‌, హీరో అంటే పడని ఓ వ్యక్తి వల్ల ఎదురైన సమస్యల మధ్య పూర్తిగా సినిమా ఎమోషనల్‌ టర్న్‌ తీసుకుంటుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు ఎంతో క్యూట్‌గా సాగుతాయి. కొన్ని మాత్రం కాస్త సాగదీసిన భావన కలుగుతాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ తర్వాత వచ్చే ట్విస్ట్‌ ఏంటనేది ఊహకు అందేలా ఉంది. నాగన్న ఫ్లాష్‌ బ్యాక్‌ హృద్యంగా ఉంటుంది. చివరి అరగంట మాత్రం బరువైన భావోద్వేగాలకు పరిమితం చేశారు. తెరపై అంత ఎమోషన్‌ కనిపించినా ఎక్కడా బోర్‌ కొట్టదు. రెండు మూడు చోట్ల కళ్లు చెమర్చక మానదు. ఇద్దరి మధ్య ఉన్న బంధం లో అనుమానాలు, మనస్పర్థలు, వాటి నుంచి బయటకు రావడాన్ని దర్శకుడు డీల్‌ చేసిన విధానం బావుంది. ఆ సన్నివేశాలు ప్రతి ఒక్కరికి టచ్‌ అవుతాయి. అమ్మాయిలు, చదువు, రైతులు, వ్యవసాయం గురించి లైటర్‌ వేలో సందేశం ఇచ్చారు.


నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల పనితీరు..
హీరోగా శ్రీరామ్‌ పాత్ర ఇన్నోసెంట్‌గా బావుంది. భావోద్వేగ సన్నివేశాల్లో ప్రతిభ కనబర్చాడు. సెకెండాఫ్‌లో పాత్ర రీత్యా అతని పెర్‌పార్మెన్స్‌ చూస్తే కోపం వచ్చేలా ఉంటుంది. అంతగా పాత్రలో లీనమై పోయాడు.  మగరాయుడి పిల్లలా రమిక శివు క్యూట్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది. బ్రేకప్‌ ఎమోషన్‌ని బాగా పండించింది. తపస్విని పూనాచ కూడా రుక్మిణి పాత్రకు పర్‌ఫెక్ట్‌గా యాప్ట్‌ అయింది. అందం, అభినయం, క్యూట్‌ లుక్స్‌తో అలరించింది. ఎమోషనల్‌ సీన్స్‌లో మాత్రం కాస్త డల్‌ అనే చెప్పాలి. సీనియర్‌ నటుడు రంగాయన రఘు పాత్ర ఈ సినిమాకు మేజర్‌ ఎసెట్‌. తండ్రిగా నాగయ్య పాత్రలో  అదరగొట్టేశారు. భావోద్వేగ సన్నివేశాలైతే కంటతడి పెట్టించేలా పీక్స్‌లో నటించారు. తండ్రి కొడుకుల ఎమోషన్‌ని కూడా బాగా పండించారు. హీరోకి అమ్మమ్మగా నటించిన ఆర్టిస్ట్‌ కూడా అద్భుతంగా నటించారు. తెరపై కనిపించిన ఏ ఆర్టిస్‌కు పేరు పెట్టక్కర్లేదు. పల్లె, రైతు నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి సినిమా మొత్తంగా పచ్చగా కనులవిందుగా సాగింది. ఈ విషయంలో సినిమాటోగ్రాఫర్‌ రాజ్‌కాంత్‌ను ప్రశంసించాల్సిందే! ఈ సినిమాకు మరో ఎసెట్‌ సంగీతం. సునద్‌ గౌతమ్‌ అందించిన బాణీలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం రణగొణ ధ్వనిలా కాకుండా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. పాటలు కూడా అర్థవంతంగా ఉన్నాయి. విజువల్‌గానూ బావున్నాయి.  కేజీఆఫ్‌, కాంతార చిత్రాలకు డైలాగ్‌ రాసిన హనుమాన్‌ చౌదరి ఈ సినిమాకు తెలుగు మాటలు రాశారు. గుర్తుంచుకునే డైలాగ్‌లు ఎన్నో ఉన్నాయి. స్ర్కీన్‌ ప్లే కూడా బాగుంది. అయితే డబ్బింగ్‌ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవలసింది. ఎడిటర్‌ హర్షిత్‌ ప్రభు ఫస్టాఫ్‌కు కాస్త కత్తెర వేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో స్వచ్చమైన ప్రేమకథలు అరుదుగా వస్తున్నాయి. ఎలాంటి యాక్షన్‌, వయలెన్స్‌ లేకుండా సింపుల్‌ లైన్‌తో తెరపై ఒక ఎమోషనల్‌ లవ్‌ రైడ్‌ని చూపించాడు దర్శకుడు. జెన్‌జీ బ్యాచ్‌కి ఎలా ఉన్నా.. ఫ్యామిలీ ఆడియన్స్‌ మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అవుతారు.

ట్యాగ్‌లైన్‌: బరువైన భావోద్వేగాల ప్రేమకథ
రేటింగ్‌: 2.75/5

Updated Date - Oct 04 , 2026 | 12:24 PM