The Raja Saab Review: ప్రభాస్ ‘ద రాజాసాబ్‌’ మూవీ రివ్యూ

ABN , Publish Date - Jan 09 , 2026 | 01:34 PM

పాన్ ఇండియా స్టార్ అయ్యాక డార్లింగ్ ప్రభాస్ (Prabhas) తెలుగువారికి దూరమైపోయాడు అని ఫీలవుతున్న వేళ... ‘ద రాజాసాబ్ (The Raja Saab)’ తో ఆ లోటును తీరుస్తాడని యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ భావించారు

The Raja Saab Review

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ అయ్యాక డార్లింగ్ ప్రభాస్ (Prabhas) తెలుగువారికి దూరమైపోయాడు అని ఫీలవుతున్న వేళ... ‘ద రాజాసాబ్ (The Raja Saab)’ తో ఆ లోటును తీరుస్తాడని యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ భావించారు... సంక్రాంతికి పండుగ చేసుకుందామని కూడా అనుకున్నారు... ఫస్ట్ టీజర్ తో ఆకట్టుకున్న ‘ద రాజాసాబ్’ ఆ తర్వాత వచ్చిన పాటలు అంతగా ఆకట్టుకోక పోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఒక్కసారిగా మళ్ళీ రేసులోకి దూసుకు వచ్చాడు ప్రభాస్. మరి సంక్రాంతి కానుకగా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘ద రాజా సాబ్ (The Raja Saab Review)’ ఏమంటున్నాడో చూద్దాం...


కథ:

కథ విషయానికి వస్తే మనవడు రాజు (ప్రభాస్) కి తనను వదలి వెళ్ళిన తాత (సంజయ్ దత్) సంగతులు చెబుతూ ఎప్పటికైనా భర్త దగ్గరకి వెళ్ళాలనుకుంటూ ఉంటుంది గంగమ్మ (జరీనా వహాబ్). అప్పటికే ఓ అమ్మాయిని (రిద్ది కుమార్) ఇష్టపడ్డ రాజు తాతను వెతికే క్రమంలో మరో ఇద్దరు భామలు (మాళవిక మోహన్, నిధి అగర్వాల్) కలుస్తారు. అయితే రాజుతో పాటు అతని లవర్స్ ని, స్నేహితులను ప్రేతాత్మగా మారిన తాత వశం చేసుకునే క్రమంలో ప్యాలెస్ లోకి వచ్చేలా ట్రాప్ చేస్తాడు. మరి అక్కడ చేరుకున్న వారందరికీ ఎదురైన సమస్యలు ఏమిటి!? వాటిని రాజు ఎలా అధిగమిస్తాడు? అసలు తాత లక్ష్యం ఏమిటన్నదే ‘ద రాజాసాబ్’ కథాంశం.


విశ్లేషణ:

సినిమా ఆరంభమే పాటతో మొదలవుతుంది… ఇక్కడ ఈ పాటలోనే కటౌట్, కంటెంట్ ఉన్న ప్రభాస్ ను సరిగ్గా చూపడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అంతే కాదు ఈ సినిమాలో ప్రభాస్ లుక్ తీవ్రంగా నిరాశపరుస్తుంది. నిజానికి సినిమా అంటేనే లాజిక్కులుండవు... పోన్లే మునుముందైనా బాగుండక పోతుందా అని ఎప్పటికప్పుడు ఫీలై చూద్దామనుకున్నా... సాగేకొద్దీ పిచ్చెక్కిస్తుంటుంది.. లాజిక్, మేజిక్, హారర్, కామెడీ, ఫాంటసీ... అసలు వీటిలో ఇది ఏ జానర్ సినిమా అనే సందేహం కూడా కలుగుతుంది... దర్శకుడి మీద నమ్మకంతో ప్రభాస్ గుడ్డిగా అతనిని ఫాలో అయ్యాడనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా రొట్టకొట్టుడుకు రొట్టకొట్టుడులా అనిపిస్తుంది. హీరోయిన్స్ తో హీరో సన్నివేశాలు కొన్ని పాతకాలపు సినిమాలను గుర్తు చేస్తాయి. ఆ రోజుల్లో ఉన్నావా? లేక ఈ రోజుల్లో ఉన్నావా?, అసలు ఏ రోజుల్లో ఉన్నావు? డైరెట్టరూ అనిపిస్తుంది.. హీరోయిన్స్ తో ప్రేమ సన్నివేశాలకు ఓ కారణం, లాజిక్కులుండవు.. హీరోయిన్ కోటి రూపాయలను సింపుల్గా ఓ టీ స్టాల్ కు తీసుకురావడం, ఆ తర్వాత వచ్చే సీన్స్ ఎంతో ఎబ్బెట్టుగా అనిపిస్తాయి..


సెకండ్ హాఫ్ లో అందరూ కలసి రాజ మహల్ కు చేరుకున్నాక.. సంజయ్ దత్ సన్నివేశాలు కొన్ని ఆసక్తికరంగా అనిపించినా... దర్శకుడు అసలేం చెప్పదల్చుకున్నాడో ఎవరికీ అర్థం కాదు. క్లయిమాక్స్ ఒక్కటే ఈ సినిమాను కాస్తయినా నిలబెట్టిందనుకోవచ్చు... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీమ్ గ్రాఫిక్స్ వర్క్ పనితనం కొంత వరకూ సెకండ్ హాఫ్ నిలబెట్టింది. రాజమహల్ లో మాయలు మంత్రాలు అంటారు.... బయటకు వెళ్ళడానికి వీల్లేదంటారు.. కానీ వచ్చేవాళ్ళు వస్తుంటారు... సెల్ ఫోన్స్ వాడుతూ పిజ్జాలు, బర్గర్లు తింటుంటారు... అంతా అయోమయం... గందరగోళం... పాన్ ఇండియా రేంజ్ హీరోతో సినిమా తీయడంలో ఒత్తిడి ఫీలయ్యాడా, లేక ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిందా? అనేది తెలియకున్నది.. పాటల్లో సౌండ్ తప్ప ఇంకేం విన పడదు.. ప్రభాస్, జరీనా వాహబ్, సంజయ్ దత్ చివరి అరగంటను నిలబెట్టారు.. హీరోయిన్స్ లో మాళవికా మోహన్ కు కాస్తంత ఎక్కువ స్క్రీన్ టైమ్ దొరికింది.

నిధి అగర్వాల్ అందాల ఆరబోతకు పనికొచ్చింది. అమ్మడి కెరీర్ ను ఈ సినిమా అయినా నిలబెడుతుందేమో అనుకుంటే మరింత పాతాళానికి తీసుకు వెళుతుంది. రిద్ధి కుమార్ పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. ఉన్న కొద్ది సీన్స్ లో బొమన్ ఇరానీ పర్వాలేదు. సత్య, సప్తగిరి, విటిగణేశ్ చేసింది కామెడీ అని మనం అనుకోవాల్సిందే. అయితే కెమెరా పనితనం బాగుంది. థమన్ ఎప్పటిలాగే రీసౌండ్ తో ఆడియన్స్ చెవుల్లో తుప్పు రాలగొట్టాడు. ఎడిటింగ్ లో లోపాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ స్టార్టయినప్పుడు intermission అనే బ్రేక్ కూడా కనిపించి ఆ తర్వాత సినిమా కొనసాగుతుంది. అంటే నిడివి ఎక్కువై కన్ఫ్యూజన్ లో ఎడిట్ చేశారో? ఏమో!? మొత్తానికి టాలీవుడ్ సంక్రాంతికి పెద్ద ఫ్లాప్ తో స్వాగతం పలికిందినే చెప్పాలి.


సినిమా అంతా గజిబిజీగా ఉండి... డార్లింగ్ వీరాభిమానులు కూడా విసుగెత్తిపోయేలా చేసింది ‘ద రాజాసాబ్’. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని చేతిలో పెట్టుకుని ఓ సాధారణ హీరోతో సినిమా తీసినట్లు తీశాడు దర్శకుడు మారుతి. పాన్ ఇండియా స్టార్, ఖర్చు గురించి పట్టించుకోని నిర్మాత, అద్భుతమైన సాంకేతిక సహకారం ఇన్నింటిని చేతికి ఇచ్చినా వాటన్నింటితో పనిలేదు. నాకు నచ్చిందే తీస్తా అన్నట్లు చేసి చూపించాడు మారుతి. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిపోయి సినిమా నచ్చని అభిమానులు ఇంటికి రావచ్చంటూ అడ్రెస్ కూడా చెప్పేశాడు. అంతే కాదు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘ద రాజాసాబ్ సర్కస్’ ఉంటుందని ప్రకటించేశారు. అసలుకే అతీగతీలేదు. ఇక కొసరు కూడానా!? ఏది ఏమైనా ‘ద రాజాసాబ్’ రిజల్ట్ కి పూర్తిగా దర్శకుడు మారుతినే బాధ్యత తీసుకోవాలి. మరి అడ్రెస్ తెలిసిన డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి తనని తాను ఎలా కాపాడుకుంటాడో చూడాలి.

ట్యాగ్ లైన్: డార్లింగ్ ఇమేజ్ కి డామేజ్ ‘రాజాసాబ్’

రేటింగ్: 2.25/5

Updated Date - Jan 09 , 2026 | 02:17 PM