సినిమా రివ్యూ: ‘పళ్ల బురుసు’
ABN , Publish Date - Aug 15 , 2026 | 08:45 AM
మంచి కథలతో వచ్చే రచయితలను, దర్శకులను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే! మంచి కథ అనిపిస్తే.. బడ్జెట్ లో సినిమా తీసి విడుదల చేయడం వంటివి కొంతకాలంగా చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి వచ్చిన చిత్రం ‘పళ్ళ బురుసు’.
సినిమా రివ్యూ: ‘పళ్ల బురుసు’ (Palla Burusu Review)
మంచి కథలతో వచ్చే రచయితలను, దర్శకులను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే! మంచి కథ అనిపిస్తే.. బడ్జెట్ లో సినిమా తీసి విడుదల చేయడం వంటివి కొంతకాలంగా చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి వచ్చిన చిత్రం ‘పళ్ళ బురుసు’. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సూజాత కీలక పాత్రధారులు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ పల్లె కథను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో చూద్దాం.
కథ:
తెలంగాణలోని పల్లెలో శంభ (సుధాకర్రెడ్డి) అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో సెటిల్ అయి ఆయన బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేపపుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది అన్నదే కథ.
విశ్లేషణ:
వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో చూస్తూనే ఉన్నాం. అలాంటి కథే ఇది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి, అతని ఒంటరితనం, కన్న బిడ్డల నుంచి తాను ఆశించే కూసింత ప్రేమ ఇతివృత్తంగా దర్శకుడు ఈ కథ తయారు చేసుకున్నారు. సమాజంలో కళ్ళముందు చూస్తున్న కథే ఇది. అయితే ఇలాంటి లైన్ తీసుకున్నప్పుడు భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించగలగాలి. బలమైన కథనం అల్లుకోవాలి. ఇందులో ఈ రెండూ లేవు. సినిమా మొదలైన తక్కువ టైమ్ లోనే కథలోకి వెళ్లినా... అది ప్రేక్షకుల మనసుల్లోకి మాత్రం వెళ్లలేకపోయింది. తండ్రీ కొడుకుల మధ్య దూరంతో పాటు… తండ్రి కోర్టు మెట్లు ఎక్కడానికి కారణాన్ని బలంగా చెప్పలేకపోయారు. ఫస్టాఫ్ అంతా నీరసంగా సాగింది. సెకెండాఫ్ ఏమైనా ఆసక్తిగా నడిపిస్తారేమో అనుకుంటే అక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు సాగింది. టీవీ సీరియల్ కంటే అన్యాయంగా చిత్రీకరణ సాగింది. శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. శంభా స్నేహితులు నలుగురు తెరపై కనిపించిన ప్రతిసారీ విసుగు పుట్టించారు. ఈ సీన్స్ బాగా ట్రిమ్ చేయవచ్చు. అయితే చివర్లో ఆ నలుగురు స్నేహితులు శంభా కోసం నిలబడే సన్నివేశం మాత్రం ఆకట్టుకుంటుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే..
శంభా పాత్రలో సుధాకర్ రెడ్డి నేచురల్ గా నటించారు. కొడుకుగా, రైల్వే గేట్మెన్గా తిరుపతి పాత్రలో మురళీధర్ కూడా మెప్పించారు. ఎక్స్ప్రెషన్స్ తో నవ్వులు పూయించారు. ప్రజ్వల్, గోమతి పాత్రలు ఓకే. శంభా స్నేహితులుగా కనిపించినా నలుగురు ఫోన్, అలెక్సా, ట్యాబ్ పట్టుకుని వయసుకు సంబంధంలేని చేష్టలతో విసుగు పుట్టించారు. పల్లె అందాలను వినోద్ బంగారి కెమెరా బాగానే క్యాప్చర్ చేసింది. లవ్ స్టోరీ సినిమాకు సంగీతం అందించిన పవన్ ఈ సినిమాకు దర్శకుడా అనిపించకమానదు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఇలాంటి చుట్టేసిన సినిమాను ప్రేక్షకులు ఆశించరు. ఆరంభం నుంచి చివరి వరకూ నీరసంగా సాగిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఏమాత్రం లేదనే చెప్పాలి.
ట్యాగ్ లైన్: ఆసక్తి కలిగించని ‘పళ్ళబురుసు’
రేటింగ్: 2/5