Om Shanti Shanti Shantihi Review: ఓం శాంతి శాంతి శాంతి శాంతి: ఎలా ఉందంటే

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:27 PM

'జయ జయ జయ జయహే’ మలయాళంలో బ్లాక్‌ కామెడీగా తెరకెక్కి మంచి విజయం సాధించిన చిత్రం. దానినే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా 'ఓం శాంతి శాంతి శాంతిః’ టైటిల్‌తో రీమేక్‌ చేశారు దర్శకుడు ఏఆర్‌ సజీవ్‌. తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బ జంటగా నటించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరీ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..

సినిమా రివ్యూ: ఓం శాంతి శాంతి శాంతిః
విడుదల తేది:
30–1–2026


'జయ జయ జయ జయహే’ మలయాళంలో బ్లాక్ కామెడీగా తెరకెక్కి మంచి విజయం సాధించిన చిత్రం. దానినే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టైటిల్ తో దర్శకుడు ఏఆర్ సజీవ్ రీమేక్ చేశారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించగా, శివన్నారాయణ, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం…

కథ:
ప్రశాంతి (ఈషా రెబ్బ) మధ్య తరగతి కుటుంబంలో పుట్టి  బాగా చదువుకుని ఉద్యోగం చేయాలనుకునే యువతి. అయితే ఇంట్లో నియమ నిబంధనలతో ఆమెకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేస్తారు. ప్రశాంతి కాలేజ్ లో లెక్చరర్ తో చిన్న ప్రేమాయణం నడపడంతో సడన్ గా చదువుకు ఫుల్ స్టాప్ పెట్టించి పెళ్ళి చేయాలనుకుంటారు కుటుంబ సభ్యులు. రాజమండ్రి సమీపంలో చేపల వ్యాపారం చేసే ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్)తో ప్రశాంతి పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చనే అంగీకారంతో ప్రశాంతి అతనితో మూడు ముళ్ళు వేయించుకుంటుంది. అయితే పెళ్ళి తర్వాత కూడా ప్రశాంతి జీవితం తను కోరుకున్నట్లు ఉండదు. ఓంకార్ నాయుడు మాటిమాటికీ తనపై చేయి చేసుకుంటుంటాడు. ఈ పంచాయతీని కన్నవారి ముందుంచితే సర్దుకుపోవాలంటూ సలహా ఇచ్చి పంపుతారు. ఇవన్నీ తట్టుకుంటూ, సమయం రాగానే ఎదురు తిరిగి భర్తకు బుద్ధి చెబుతుంది. దానికి ఓంకార్ వేసిన ప్లాన్ ఏంటి? వీరి బంధం సుఖంగా సాగిందా? లేదా? అన్నదే మిగతా కథ.


Untitled-1.jpg

విశ్లేషణ:
ఓ మధ్య తరగతి అమ్మాయి... కోపిష్ఠి భర్త బారిన పడితే ఎలా ఉంటుందన్న నేపథ్యానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం జోడించి తెరకెక్కించిన చిత్రమిది. పూర్తిగా గోదావరి జిల్లా నేపథ్యంలో సాగుతుంది.  మలయాళంలో హిట్ అయిన ‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి రీమేక్ గా కథలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా గోదావరి నేపథ్యాన్ని తీసుకుని దానికి అనుగుణంగా స్వల్పమైన మార్పులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఒరిజినల్లో ఉన్న ఎమోషన్, ఎఫెక్షన్ ఈ చిత్రంలో లోపించాయి. సినిమా ప్రారంభం అంతా సాఫీగా, ఎంటర్టైనింగ్ గా సాగినా హీరో పాత్రను బిల్డప్ చేయడానికి బాగా టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. అదంతా సాగదీతలా ఉంది. కథలోకి వెళ్ళడానికి ఇంటర్వెల్ వరకూ సమయం తీసుకోవడం  ప్రేక్షకుడి సహనానికి పెద్ద పరీక్షే. అయితే భార్య భర్తకు బుద్ది చెప్పే సీన్స్, బ్రహ్మాజీ క్యారెక్టర్ మెప్పిస్తాయి. అలాగే గోదావరి ప్రాంత పడికట్టు పదాలు, యాసతో ఉన్న సన్నివేశాలు కొంత వరకూ ఆకట్టుకుంటాయి. కట్టుబాట్లు, పరువు, ప్రతిష్టల పేరుతో అమ్మాయిల స్వేచ్చను హరిస్తున్నామని ఈ సినిమా ద్వారా సందేశాన్ని ఇచ్చారు. సెకెండ్ హాఫ్ ప్రారంభం కాస్త గాడి తిప్పినా కాసేపటికే దార్లోకి వస్తుంది. కోర్టు రూమ్ సన్నివేశాలు రొటీన్గానే అనిపించినా కొంత ఆలోచింపజేసేలా ఉంటాయి. బ్రహ్మాజీ కామెడీ అలరిస్తుంది. అయితే సినిమా ముగింపును మెచ్చేలా తీయటంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే ఇందులో క్లైమాక్స్ తేలిపోయిందనే చెప్పాలి.
నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితీరు విషయానికి వస్తే…  ఓంకార్ నాయుడిగా తరుణ్ భాస్కర్ ఫిట్ అయ్యాడు. పాత్రకు తగ్గట్లు తన ఆహార్యాన్ని మలుచుకున్నాడు. గోదావరి యాసతో పాత్రకు న్యాయం చేశాడు. ప్రశాంతి పాత్రకు ఈషా రెబ్బ కరెక్ట్ అనిపించేలా చేసింది. అయితే సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్ అయింది. హీరో పాత్రకు మేనమామగా నటించిన బ్రహ్మాజీ ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించి మెప్పించాడు. చక్కటి వినోదం అందించాడు. హీరోయిన్ మేనమామ పాత్ర కాస్త ఓవర్గా అనిపించినా ఓవరాల్గా ఓకె. సినిమా రీమేక్ అయినా దర్శకుడు ఎక్కువగా లోకల్ టచ్ ఇచ్చాడు. మాటలు, పాటలు పర్వాలేదు. ఎడిటింగ్ అక్కకడక్కడ వీక్ అనిపించింది. సినిమాటోగ్రఫీ బావుంది. జె.క్రిష్ సంగీతం సినిమాకు ప్లస్. నిర్మాణ పరంగా పేరు పెట్టక్కర్లేదు. చిన్న సినిమా అయినప్పటికీ క్వాలిటీ విషయంలో నిర్మాత సృజన్ ఎరబోలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్రెష్ ఫీల్ మాత్రం కలగదు. కథను నడిపించిన తీరు చూస్తే... థియేట్రికల్ గా  కన్నా ఓటీటీల్లో ఎక్కువగా ఆదరణ లభించే అవకాశం ఉందనిపిస్తుంది.

రేటింగ్: 2.5 / 5
ట్యాగ్ లైన్: అక్కడక్కడా అశాంతి!

Updated Date - Jan 30 , 2026 | 06:25 PM