'నిలవే' సినిమా ఎలా ఉందంటే..

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:31 PM

మూడేళ్ళ క్రితం మొదలైన 'నిలవే' చిత్రం ఎట్టకేలకు శుక్రవారం జనం ముందుకొచ్చింది. 'అర్జున్ రెడ్డి' తరహాలో విపరీతమైన ముద్దు సన్నివేశాలతో ట్రైలర్ వదలడం ఈ సినిమాపై ఊహించని బజ్ క్రియేట్ అయ్యింది. మరి 'నిలవే' చిత్రం ప్రేక్షకుల్ని ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

సినిమా రివ్యూ: ‘నిలవే’ (Nilave Review)

మూడేళ్ళ క్రితం మొదలైన 'నిలవే' చిత్రం ఎట్టకేలకు శుక్రవారం జనం ముందుకొచ్చింది. 'అర్జున్ రెడ్డి' తరహాలో విపరీతమైన ముద్దు సన్నివేశాలతో ట్రైలర్ వదలడం ఈ సినిమాపై ఊహించని బజ్ క్రియేట్ అయ్యింది. సౌమిత్‌ రావు(Soumith rao), శ్రేయాసి సేన్‌ (Shreyasi sen) జంటగా హర్ష చెముడు, సుప్రియా ఐసోలా ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సౌమిత్‌ రావు, సాయి వెన్నం కలిసి దర్శకత్వం వహించారు. సాయి వెన్నం, గిరిధరరావు పోలాటి దీన్ని నిర్మించారు. మరి 'నిలవే' చిత్రం ప్రేక్షకుల్ని ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

అర్జున్‌ (సౌమిత్‌ రావు) ఓ అనాథ. తన స్నేహితుడి (వైవా హర్ష) కుటుంబంతో కలిసి ఉంటూ ఓ యాడ్‌ ఏజన్సీలో అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి అనుభవించిన ఒంటరితనం కారణంగా ఏ మనిషికైనా కష్టసుఖాలు పంచుకోవడానికి ఓ తోడు ఉండాలని భావిస్తాడు. అయితే కోరుకున్న విధంగా జీవితం సాగక పోవడంతో ఆత్మహత్యాయత్నం చేస్తాడు. అదే సమయంలో ఎదురు అపార్ట్‌మెంట్‌తో ఉండే అతిథి (శ్రేయాసి సేన్‌)ని చూస్తాడు. తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. రకరకాల ప్రయత్నాలు చేసి ఆమెకు దగ్గరవుతాడు. వృత్తిరీత్యా ఓ బ్యాండ్‌లో సింగర్‌ అయిన అతిథి కూడా అర్జున్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరూ శారీరకంగా దగ్గరవుతారు. కానీ అర్జున్‌ ప్రేమను అతిథి అంగీకరించలేకపోతుంది. గర్భవతి అయినా అర్జున్‌తో పెళ్లికి మాత్రం సిద్ధం కాదు. అందుకు గల కారణం ఏమిటీ? అసలు ఆమె నేపథ్యం ఏమిటీ? మంచి కుటుంబాన్ని కోరుకున్న అర్జున్‌ ఆశ నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కథ.


విశ్లేషణ: (Nilave Movie Review)

అనాథగా పెరిగిన ఓ యువకుడిని ఒంటరితనం ఎలా కుంగదీసింది? దాని నుంచి బయటకు రావడానికి ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు ఏమిటీ? అనేది ఇందులోని ప్రధానాంశం. దీనిని ఓ మ్యూజికల్‌ లవ్‌స్టోరీగా దర్శకులు తెరుకెక్కించారు. అర్జున్‌ ఆత్మహత్యాయత్నంతో సినిమా మొదలవుతుంది. దానికి సంబంధించిన సన్నివేశాలను ఎమోషనల్‌గా చూపించారు కానీ అతని ఒంటరి తనానికి బలమైన కారణం చూపించలేకపోయారు. పైగా ఆ సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. హీరోయిన్‌ ఎంట్రీ నుంచి సినిమా కాస్త వేగం పెరుగుతుంది. హీరోహీరోయిన్ల పరిచయం, అర్జున్‌కు దగ్గర కావడం, ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ బాగా తీశారు. ఆ సన్నివేశాలను మరీ అసభ్యకరంగా చూపించకపోయినా కొన్ని చోట్ల మాత్రం మోతాదు కాస్త మించినట్టు అనిపిస్తుంది. అర్జున్‌ తనని ప్రేమిస్తున్నాడని తెలిసి, శారీరకంగా దగ్గరైనా కూడా పెళ్లికి మాత్రం ఆమె వెనకడుగు వేయడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని ప్రేక్షకులు ఊహిస్తారు. ఆ సస్పెన్స్ ను క్లైమాక్స్‌ వరకూ కొనసాగించడంలో దర్శకులు సఫలమయ్యారు. విశ్రాంతి తర్వాత అతిథి ఫ్లాష్‌బ్యాక్‌ను రివీల్‌ చేయడంతో ఇంకాస్త ఆసక్తి పెరిగింది. అయితే ద్వితీయార్థం కూడా కొంత సాగదీతగానే ఉంది. హీరోయిన్‌ పెళ్లికి అంగీకరించకపోవడానికి, ఓ బిడ్డను కనడానికి చూపించిన కారణాలు కన్వెన్సింగ్ గా ఉన్నాయి. భావోద్వేగాలతో మిళితమైన పతాక సన్నివేశాలను ఇంకాస్త బలంగా చెప్పుంటే బాగుండేది.

నటీనటులంతా దాదాపు కొత్తవారే. అర్జున్‌ పాత్రలో సౌమిత్‌ చక్కని నటన కనబర్చాడు. డాన్స్‌లతో మెప్పించాడు. హీరో పాత్రకు భావోద్వేగ సన్నివేశాలు ఎక్కువ రాయడంతో అధిక శాతం కన్నీళ్లతో కనిపిస్తాడు. జనరల్‌గా హీరో పాత్రను అలా చూడటానికి ఆడియెన్స్‌ పెద్దగా ఇష్టపడరు. హీరో ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవలసింది. అతిథి పాత్రకు శ్రేయాసి సేన్‌ పూర్తి న్యాయం చేకూర్చింది. ఈ కథకు ఆమె పాత్రే కీలకం. నటనతోనే కాకుండా గ్లామర్‌తోనూ ఆకట్టుకుంది. నటిగా తొలి సినిమానే అయినా ఆ భావన ఎక్కడా కనిపించదు. వైవా హర్ష కొన్ని చోట్ల నవ్వించాడు. మిగిలిన పాత్రధారులు పరిధి మేరకు నటించారు. ఈ సినిమాకు మేజర్‌ ఎసెట్‌ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌. 'మేమ్‌ ఫేమస్‌, మారుతీనగర్‌ సుబ్రమణ్యం' చిత్రాలతో సంగీత దర్శకుడిగా ఆకట్టుకున్న కళ్యాణ్‌ నాయక్‌ మరోసారి తన ప్రతిభను చూపించాడు. బిట్స్‌తో కలిపి ఇందులో 11 పాటలున్నాయి. అన్నీ సందర్భానుసారంగా కుదిరాయి. నేపథ్యసంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. సినిమాటోగ్రాఫర్‌ దిలీప్‌ కె. కుమార్‌ చక్కని పనితనం కనబరిచాడు. ప్రమోషన్స్ లో నిర్మాతలు చెప్పినట్లు చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో ఇది పెద్ద సినిమాను తలపిస్తుంది. ఎడిటర్‌ ద్వితీయార్థాన్ని కాస్త క్రిస్ప్‌ చేయాల్సింది. చక్కని మ్యూజికల్‌ లవ్‌స్టోరీకి భావోద్వేగాలను మిళితం చేయడంలో దర్శక ద్వయం సఫలమైంది. కొత్తవారు తీసిన సినిమా కాబట్టి జనాల్లోకి బాగా వెళితే మంచి ఫలితం దక్కే ఆస్కారం ఉంది.

రేటింగ్‌: 2.5/5

ట్యాగ్‌లైన్‌: ఎమోషనల్ డ్రామా!

Updated Date - Feb 13 , 2026 | 12:31 PM