Rakasa Review: నిహారిక కొణిదెల 'రాకాస'.. సినిమా ఎలా ఉందంటే!

ABN , Publish Date - Apr 03 , 2026 | 03:18 PM

'కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మంచి విజయం అందుకున్నారు మెగా డాటర్‌ నిహారిక కొణిదెల. ఆ సినిమా ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో మానస శర్మను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'రాకాస’.

సినిమా రివ్యూ: రాకాస (Rakasa Review)

'కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మంచి విజయం అందుకున్నారు మెగా డాటర్‌ నిహారిక కొణిదెల. ఆ సినిమా ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో మానస శర్మను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'రాకాస’. సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక జంటగా నటించిన ఈ సినిమాలో గెటప్‌ శ్రీను, వెన్నెల కిశోర్‌, తనికెళ్ల భరణి, రోహిణి కీలక పాత్రధారులు. మూవీ ప్రమోషన్స్‌ భిన్నంగా చేయడంతో విడుదలకు ముందు మంచి బజ్‌ ఏర్పడింది. దాంతో నిహారిక ఖాతాలో మరో విజయం ఖాయమని జోరుగా ప్రచారం సాగింది. హారర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి 'రాకాస' అంచనాలను అందుకుందా? నూతన దర్శకురాలు మానస, నిర్మాత నిహారిక ఖాతాలో హిట్‌ పడిందా? అన్నది చూద్దాం.

కథ:

రాకవనం అనే ఓ ఊరు. ఆ ఊళ్లో వందల ఏళ్ల చరిత్ర ఉన్న భయంకరమైన కోట. అందులో ఓ బ్రహ్మరాక్షసి. ఊరిలో ఉల్క పడిన ప్రతిసారీ మూతపడి ఉన్న కోటలో ఉన్న రాకాసికి బలిదానం ఇవ్వాలి. లేదంటే.. ఊరు వల్లకాడు అవుతుంది. వింతలు జరుగుతుంటాయి. ఆ కోటలోకి వెళ్లిన ఎవరూ బయటకు రాలేరు. ఆ రాకాసిని అంతం చేయడానికి తన సైనికులతో ఓ రాజు లోపలికి వెళ్లి బలైపోతాడు. అప్పటి నుంచి ఆ కోట జోలికి ఎవరూ వెళ్లరు. తోక చుక్క పడినప్పుడు మాత్రం ఆ ఊరి ఆచారం, సంకేతాల ప్రకారం ఓ మనిషిని బలిస్తారు. అలా ఓ సారి అమెరికా నుంచి రాకవనం వచ్చిన వీరబాబు (సంగీత్‌ శోభన్‌) ఆ కోట ప్రాంతంలోకి వెళ్లి ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. అప్పుడు తలెత్తిన సమస్యలకు అతనే కారణమంటూ బలిగా అతన్నే వెళ్ళమంటారు గ్రామస్తులు. పిరికివాడైన వీరు కోటలోకి వెళ్లి ఏం చేశాడు? అప్పటికే కోటలో ఉన్న సోము (వెన్నెలకిశోర్‌) ఎవరు? వీరును ప్రేమించిన సుబ్బలక్ష్మీ (నయన్ సారిక) అతని కోసం ఏం చేసింది? రాకాసి బారి నుంచి వీరు, సోము, సుబ్బు బయటపడ్డారా లేదా అన్నది మిగతా కథ.

Sangee.jpg

విశ్లేషణ

హారర్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ఎప్పుడూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఈ తరహా కథల్లో కొత్తదనం లేకపోయినా... కథనం ఎలా ఉందనేది ప్రధానం. ఇలాంటి వాటిలో ప్రేక్షకులకు కాస్త ఉత్కంఠ కలిగించే సన్నివేశాలను క్రియేట్‌ చేస్తే చాలు.. చక్కని ఆదరణ లభిస్తుంది. ఈ విషయంలో దర్శకురాలు మానస శర్మ మొదట తడబడినా.. ఆ తర్వాత కథను ట్రాక్‌లోకి తెచ్చేశారు. వెయ్యేళ్ల కోట, దానిలో ఓ రాకాసి... అంటూ ఊరి ఇతివృత్తం చెప్పి కథలోకి తీసుకెళ్లారు. వీరబాబు ఊరికి రావడం, సుబ్బూతో ప్రేమలో పడి ఫెయిల్‌ అవ్వడం, తన తింగరి పనులతో కోటకు సంబంధించిన చిక్కుల్లో ఇరుక్కోవడం.. భయంకరమైన కోటలోకి వెళ్లే పరిస్థితి తెచ్చుకోవడంతో నవ్వులు పూయిస్తూ ఫస్ట్ హాఫ్‌ సాగుతుంది. అయితే ఇందులో మర్డర్‌ కేస్‌ అంటూ చేసిన హడావిడి బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. ఇక ఊరి కట్టుబాటు ప్రకారం ఈసారి బలికి వీరబాబే వెళ్లాలనే నిబంధనతో కోటలోకి వెళ్లడంతో సెకండ్ హాఫ్‌ మొదలవుతుంది. లోపలికి వెళ్లాక హీరోకి ఎదురైన సమస్యలు, వాటి నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు అలరిస్తాయి. అప్పటికే లోపల ఉన్న సోము (వెన్నెల కిశోర్‌) పాత్ర కూడా నవ్విస్తుంది. వీరిద్దరూ కాకుండా... తర్వాత హీరోయిన్‌, గెటప్‌ శ్రీను లోపలికి వెళ్లి బయటకు రావడం కోసం ఎలాంటి పాట్లు పడ్డారు అన్నది వినోదం పండిస్తుంది. కానీ రాకాసిని అంతం చేయడం కోసం వేసే ప్లాన్‌లో సీరియస్‌నెస్‌ మిస్‌ అయింది. ఆ సందర్భంలో వినోదం పండినప్పటికీ అదంతా కాస్త బలవంతంగానే అనిపిస్తుంది. కోట లోపలున్న బ్రహ్మరాక్షసుడి ఇతివృత్తం బావుంది కానీ ఆ సన్నివేశాలు ఎక్కడా భయం పుట్టించలేదు. కోట అంటే భయం అంటారు ఆ ఊరి జనాలు. కానీ వెన్నెల కిశోర్‌ ఆ కోటలో పది రోజులు భయంతో ఉంటాడు కానీ అతనికి ఏమీ జరగదు. అలాగే కోటకు రెండో దారి ఉందని తెలిసినా చెప్పకుండా దాచారు. ఈ రెండింటికి లాజిక్కులు మిస్‌ అయ్యాయి. క్లైమాక్స్‌ కూడా సింపుల్‌గా ముగించేశారు. ఈ తరహా కథకు కావలసిన థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను వదిలేసి రాకాసి, చిన్న పిల్లకు మధ్య సెంటిమెంట్‌ సీన్స్‌ పెట్టారు. అది బాగానే అనిపించినా ఓవరాల్‌గా సింక్‌ అవ్వదు. ఓ సీన్‌లో రాకాసికి మనసు, జాలి ఉంటాయనే చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. ఇదొక చందమామ కథలాంటి చిన్న సినిమా అని దర్శకురాలు ముందే చెప్పారు. కథ పరంగా కొత్తగా లేకపోయినా నవ్వుకోవడానికి కావలసిన కంటెంట్‌ అయితే కథలో భాగం చేశారు. హారర్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ కాకుండా చూసుకుని ఉంటే ఇంకా బావుండేది. దర్శకురాలు తీసుకున్న కథలో కొత్త లేకపోయినా ఆమె చెప్పిన విధానం బావుంది.

నటీనటుల పనితీరు..

వీరబాబుగా సంగీత్‌ శోభన్‌ చక్కగా నటించాడు. అతనిలోని ఈజ్‌ క్యారెక్టర్‌కు బాగా ఉపయోగపడింది. కొన్ని సీన్స్‌లో డైలాగ్‌ చెబుతుంటే ఖలేజాలో మహేశ్‌ బాబు గుర్తొస్తాడు. అతని కామెడీ టైమింగ్‌ బావుంది. హీరో తర్వాత ఎక్కువగా అలరించింది సోము పాత్రధారి వెన్నెలకిశోర్‌. నయన్‌సారిక క్యారెక్టర్‌ ఓకే అనేలా ఉంది. హీరోహీరోయిన్‌కి మధ్య లవ్‌సీన్స్‌ కూడా పెద్దగా లేవు. బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, రోహ‌న్ రాయ్, తనికెళ్ల భరణి, గెటప్‌ శ్రీను తదితరులు పాత్రలకు న్యాయం చేశారు. అనుదీప్‌ సంగీతం సినిమాకు ఎసెట్‌ అయింది. రెండు పాటలు ఆకట్టుకున్నాయి. కోట, విలేజ్‌ సెటప్‌ అంతా గ్రాండ్‌గా ఉంది, సీజీ వర్క్‌లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవలసింది. కెమెరా వర్క్‌ బాగానే ఉంది. ఎడిటింగ్‌ ఓకే. కథానుగుణంగా నిహారిక బాగానే ఖర్చు పెట్టారు. ఓ చిన్న కథతో దర్శకురాలు పాస్‌ అయ్యారనే చెప్పవచ్చు. కామెడీ హారర్‌ థ్రిల్లర్స్‌ ఇష్టపడేవాళ్లు ఓసారి ఈ సినిమాను చూడొచ్చు.

ట్యాగ్‌లైన్‌: భయం నాస్తి... వినోదం జాస్తి

రేటింగ్: 2.75/5

Updated Date - Apr 03 , 2026 | 04:22 PM