Mahasakthi Review: నయనతార నటించిన 'మహా శక్తి' ఎలా ఉందంటే

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:55 PM

నయనతార నటించిన 'మూకుత్తి అమ్మన్‌’ చిత్రం తమిళ, తెలుగునాట ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఆర్‌జె బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా 'మూకుత్తి అమ్మన్‌ –2’ వచ్చింది.

సినిమా రివ్యూ: మహాశక్తి (మూకుత్తి అమ్మన్‌2)

విడుదల తేది: 6–11–2026

నయనతార నటించిన 'మూకుత్తి అమ్మన్‌’ చిత్రం తమిళ, తెలుగునాట ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఆర్‌జె బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా 'మూకుత్తి అమ్మన్‌ –2’ వచ్చింది. అయితే రెండో భాగానికి సుందర్‌ సి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. స్నేహ, ఖుష్బూ సుందర్‌,  రెజీనా, సునీల్‌, దునియా విజయ్‌, ఊర్వశి, యోగిబాబు కీలక పాత్రధారులు. తెలుగులో ఈ చిత్రాన్ని 'మహాశక్తి’ టైటిల్‌తో విడుదల చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

శక్తి (నయనతార) పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తుంది. పెంపుడు తల్లి బాలమ్మ (ఊర్శశి)దగ్గర చిన్నప్పటి నుంచి పెరుగుతుంది. నిద్రలో ఆమెకు భయంకరమైన కలలు వస్తుంటాయి. ఆ కలల్లో తరచూ 'నువ్వు మైలాంచికి రా’ అంటూ వినిపిస్తుంటుంది. దాంతో శక్తి, బాలమ్మ ఎందుకిలా జరుగుతుంది అనే ఆలోచనలో పడతారు. ఆ ఊరుకి, ఆమెకు ఏదో సంబంధం ఉందని చాలామంది చెప్పడంతో మైలాంచికి వెళ్లి అదేంటో తెలుసుకోవాలనుకుంటుంది శక్తి. మైలాంచికి ట్రాన్‌ఫర్‌ చేయమని పై అధికారులను  కోరుతుంది.  ఫైనల్‌గా ఆమెను ఊరుకి పంపిస్తారు. అక్కడికి వెళ్లాక శక్తికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అక్కడ ఉన్న భైరవి (రెజీనా), ఆమె భర్త(దునియా విజయ్‌), మరో తాంత్రికుడు శక్తిని ఎందుకు చంపాలనుకుంటారు? 2000 ఏళ్ల కిందట భూమిలో పూడ్చిన శరీరం ఎవరిది? దానికి.. ఈ కథకు లింక్‌ ఏంటి అన్నది ఈ సినిమా కథ.


విశ్లేషణ:

2000 ఏళ్ల కిందట పగ ప్రతీకారం నేపథ్యంలో సాగే కథ ఇది. దేవతల సినిమాలు అంటే నమ్మిన వారికి అండగా ఉండటం, దుష్టులను శిక్షించడం.. దాదాపుగా ఇంతే ఉంటాయి. ఇది కూడా అలాంటి కథే! తాంత్రిక విద్యలతో అతి బలవంతురాలిగా ఎదిగి, తిరుగులేకుండా ఉన్న బైరా అనే మహిళకు, సాధారణ మహిళలో ఉన్న అమ్మవారి స్వరూపానికి మధ్య సాగే కథ ఇది. ఇలాంటి జానర్‌ చిత్రాల్లో దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్దం అనేది కామన్‌గా ఉంటుంది. ఇందులో అమ్మవారికి, ఓ బలమైన మహిళకు మధ్య ప్రతీకారం అనేది ఆసక్తికర అంశం. ఫస్టాఫ్‌లో శక్తి పోలీస్‌గా కొనసాగుతూ మైలాంచికి వెళ్లడం.. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడంతో ఆసక్తిగా సాగుతుంది. సెకెండాఫ్‌కు వచ్చేసరికి సినిమా కాస్త స్లో అవుతుంది. 2000 ఏళ్ల క్రితం కథకు వెళ్లడం.. దానిని ఇప్పటి కథతో మెర్జ్‌ చేయడం అంత ఆసక్తిగా అనిపించలేదు. దానిని దర్శకుడు జనాలకు రీచ్‌ అయ్యే రీతిలో చెప్పలేకపోయాడు. విజువల్‌గా, గ్రాండియర్‌గా ప్లాన్‌ చేశారు కానీ.. కథలో ఆత్మను సరిగ్గా చెప్పలేకపోయారు. కొన్ని సీన్లు చూస్తే మగధీర, బాహబలి సీన్లు కనిపించిన భావన కలుగుతుంది. క్లైమాక్స్‌ 15 నిమిషాలు సూపర్‌ అనేలా ఉన్నాయి. దుష్టులను అంతం చేయడానికి మహాశక్తికి తోడుగా మరో రెండు పాత్రలు తెరపైకి రావడంగూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. అమ్మవారిగా నయన్‌ విజృంభించింది. సినిమాలో లాస్ట్‌ సాంగ్‌ కాస్త నిరాశ పరచింది. ఓపికగా కూర్చుంచే కైమాక్స్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..

శక్తి పాత్రలో నయనతార చక్కని నటన కనబర్చింది. ఇటు పోలీస్‌గానూ, అటు అమ్మవారిగానే చక్కని అభినయం కనబర్చింది. అయితే అమ్మవారిగా పాత్రను ఎలివేట్‌ చేసేలా పెద్దగా సన్నివేశాలు రాయలేదు. తల్లిగా ఊర్వశి ఎప్పటిలాగే బాగా చేసింది. ఇందులో రెజీనా భైరవిగా నెగటివ్‌ షేడున్న పాత్ర పోషించింది. తాంత్రిక విద్యలతో ఓ సైతాన్‌గా ఆమె నటన అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఆమెకు దక్కిన మంచి పాత్రగా చెప్పవచ్చు. నటనకు ఎక్కడ పేరు పెట్టక్కర్లేదు. కాస్య్టూమ్స్‌, డైలాగ్‌ డెలివరీ విషయంలో కాస్త అతిగా అనిపించింది. ఆమెకు భర్త పాత్రలో దునియా విజయ్‌ కూడా బాగా చేశారు. తెలుగు నటుడు సునీల్‌ తక్కువ సేపే కనిపించినా ఫర్వాలేదనిపించారు. అమ్మవారి పాత్రల్లో స్నేహ, ఖుష్భూ ఓకే. ఇతర పాత్రధారులు  పరిధి మేరకు చేశారు. గోపీ అమర్‌నాధ్‌ సినిమాటోగ్రఫీ, హిప్‌హాప్‌ తమిళ సంగీతం సినిమాకు ఎసెట్‌. సెకెండాఫ్‌ కాస్త ల్యాగ్‌ అనిపించింది. సినిమా గ్రాండిగానే ఉన్నా విజువల్‌ ఎఫెక్ట్స్‌ అంతగా ఆకట్టుకోలేదు. విజువల్స్‌ మీద పెట్టిన దృష్టి కథను డెవలప్‌ చేయడంపై పెడితే అవుట్‌పుట్‌ బావుండేది. దర్శకుడు ఆ పార్ట్‌కు కాస్త దూరంగా ఉండి విజువల్‌ వండర్‌ క్రియేట్‌ చేద్దామనుకున్నట్లు ఉన్నారు. ఇందులో వార్‌ సీన్స్‌ చూస్తే.. ఈ మధ్యకాలంలో వచ్చిన భారీ చిత్రాల్లో చూసిన మాదిరిగానే ఉన్నాయి. అయితే ఆ సీజీ వర్క్‌ కూడా బాగా లేదు. కొన్ని సీన్స్‌లో నాసిరకమైన విజువల్స్‌తో ఇరిటేటింగ్‌గా అనిపించాయి. గత చిత్రం 'మూకుత్తి అమ్మన్‌'తో పోల్చితే ఇది కాస్త డల్‌ అనే చెప్పాలి.

ట్యాగ్‌లైన్‌: 'మహాశక్తి' రొటీన్ రివెంజ్

రేటింగ్‌:  2/5

Updated Date - Nov 06 , 2026 | 06:06 PM