నవాబ్స్ కేఫ్‌ మూవీ రివ్యూ

ABN , Publish Date - Feb 20 , 2026 | 05:16 PM

శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా నటించిన సినిమా 'నవాబ్స్ కేఫ్‌'. శుక్రవారం విడుదలైన ఈ సినిమాను ప్రమోద్ హర్ష డైరెక్ట్ చేశాడు.

Nawabs Cafe

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి (Raj Kandukuri) కుమారుడు శివ కందుకూరి (Shiva Kandukuri) హీరోగా నటించిన సినిమా 'నవాబ్స్ కేఫ్‌' (Nawabs Cafe). తేజు అశ్విని హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ద్వారా ప్రమోద్ హర్ష దర్శకుడిగా పరిచయమయ్యారు. 'చాయ్ వాలా' (Chai wala) పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమా పేరును సెన్సార్ అభ్యంతరంతో 'నవాబ్స్ కేఫ్‌'గా మార్చారు. సో... 'నవాబ్స్ కేఫ్‌' ఎలా ఉందో తెలుసుకుందాం...

రంగనాథ్‌ (రాజీవ్ కనకాల Rajeev Kanakala) పూర్వీకులు గోదావరి జిల్లా నుండి వచ్చి హైదరాబాద్‌లో టీ దుకాణం ప్రారంభిస్తారు. ఆ చాయ్ తాగిన అప్పటి నిజాం నవాబ్ దిల్ ఖుష్ అయ్యి... చార్మినార్ దగ్గరలో వారికో స్థలం ఇస్తాడు. అందులో వారు నవాబ్ కేఫ్‌ను నిర్వహిస్తుంటారు. తండ్రి ఆస్తిని ఆశించకుండా రంగనాథ్‌ కేవలం తన వాటాగా నవాబ్ కేఫ్‌ను మాత్రం తీసుకుంటాడు. అయితే తండ్రి అడుగు జాడల్లో నడిస్తే తన మీద చాయ్ వాలా అనే ముద్ర పడిపోతుందని రాజా (శివ కందుకూరి) భయపడుతుంటాడు. అతి కష్టం మీద ఇంజనీరింగ్ గట్టెక్కిన అతనికి విదేశాలకు వెళ్ళి కోట్లు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకోసం తండ్రికి తెలియకుండా ఓల్డ్ సిటీలోని ఓ పహిల్వాన్ దగ్గర రెండు లక్షలు అప్పు కూడా చేస్తాడు. ఇదే సమయంలో రాజా పెదనాన్న కొడుకు కుమార్ (చైతన్యకృష్ణ Chaitanya Krishna) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తుతాడు. అతని కన్ను ఇప్పుడు బాబాయ్ నిర్వహిస్తున్న నవాబ్ కేఫ్‌ మీద పడుతుంది. దాన్ని అమ్మేస్తే ఆ స్థలంలో పెద్ద మాల్‌ను కట్టొచ్చని కొందరితో కలిసి పథక రచన చేస్తాడు. దాంతో రాజాను తనవైపు తిప్పుకోవడానికి అతను ఎలాంటి ఎత్తులు వేశాడు? అన్న కుమార్ బుట్టలో పడి రాజా తండ్రితో ఎలా విభేదించాడు? దాని పర్యవసానం ఏమిటీ? రంగనాథ్‌ కోరుకున్నట్టుగా నవాబ్ కేఫ్‌ బాధ్యతలను రాజా స్వీకరించాడా? లేదా? అనేది మిగతా కథ.


ఈ సినిమా లైన్ చూస్తే ఆ మధ్య వచ్చిన ధనుష్‌ 'ఇడ్లీ కొట్టు' గుర్తొస్తుంది. తండ్రి నిర్వహించే వ్యాపారం పట్ల చిన్నచూపు ఉన్న ఓ యువకుడు తిరిగి దానినే తన జీవనాధారంగా ఎలా చేసుకున్నాడు? తండ్రి పేరును ఎలా నిలబెట్టాడు? అన్నదే ఈ రెండు సినిమాల్లో బేసిక్ పాయింట్. అయితే కథను తెరకెక్కించిన విధంగా పూర్తి భిన్నంగా ఉంది. అందులో హీరో ప్రియురాలి తండ్రీ, అన్న విలన్స్ కాగా, ఇందులో హీరో పెదనాన్న కొడుకే విలన్! అయితే... ఆ పాత్రను సైతం చివరిలో పాజిటివ్‌గా మార్చేశారు. నిజానికి ఇది మూడు నాలుగు దశాబ్దాల క్రితం రావాల్సిన సినిమా. అప్పటి కథను ఇప్పుడు చెబితే చూసేవాళ్ళు ఎవరుంటారు! పోనీ చెప్పిన విధానంలో అయినా కొత్తదనం ఉంటే ఆదరించేవారేమో. కానీ పాత కథను, పాత పద్థతిలోనే దర్శకుడు ప్రమోద్ హర్ష తెరకెక్కించాడు.


తొలి చిత్రం 'చూసి చూడంగానే'తో ఫర్వాలేదనిపించుకున్న హీరో శివ కందుకూరి ఆ తర్వాత భిన్నమైన చిత్రాలు చేసినా... అవేవీ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరేదే. శివ నటుడిగా కాస్తంత బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ తేజు అశ్విని (Teju Aswini) తెర మీద బాగానే కనిపించింది. అయితే ఇది బేసికల్‌గా తండ్రీ కొడుకు సెంటిమెంట్ మూవీ కావడంతో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. రాజీవ్ కనకాల హీరో తండ్రిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించాడు. అలానే అతని స్నేహితుడిగా వడ్లమాని శ్రీనివాస్ (Vadlamani Srinivas) చక్కగా నటించాడు. చైతన్యకృష్ణ ప్రతినాయకుడి పాత్రలో ఫర్వాలేదనిపించాడు. రాజ్ కుమార్ కసిరెడ్డి (Raj Kumar Kasireddy) కామెడీ సీన్స్, పంచ్ డైలాగ్స్ అన్నీ అవుట్ డేటెడ్. ఇతర పాత్రలను మణిచందన, చిత్రం బాషా, జెమినీ సురేశ్‌ తదితరులు పోషించారు. పరిమితమైన బడ్జెట్‌లో రాధా వి పపుడిప్పు ఈ సినిమాను నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారి (Prasanth R Vihari) నేపథ్య సంగీతం, క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ ఓకే. అయితే... సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ మూసధోరణిలో సాగడంతో ప్రేక్షకులకు ఈ చాయ్ రుచించడం కష్టమే!

ట్యాగ్ లైన్: రుచి లేని చాయ్

రేటింగ్ : 2 / 5

Updated Date - Feb 20 , 2026 | 05:16 PM