సినిమా రివ్యూ: ‘అగ్లి స్టోరీ’

ABN , Publish Date - May 22 , 2026 | 05:46 PM

‘దండోరా’ సక్సెస్‌ తర్వాత నందు మంచి జోరుమీదున్నాడు. వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. తాజాగా ఆయన నుంచి వచ్చిన చిత్రం ‘అగ్లి స్టోరీ’.

సినిమా రివ్యూ: ‘అగ్లి స్టోరీ’ (Ugly Story Review)
విడుదల తేది:
22-5-2026


‘దండోరా’ సక్సెస్‌ తర్వాత నందు మంచి జోరుమీదున్నాడు. వరుస సినిమాతో సందడి చేస్తున్నాడు. తాజాగా ఆయన నుంచి వచ్చిన చిత్రం ‘అగ్లి స్టోరీ’. రియా జియా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సుభాషిణి, కొండా లక్ష్మణ్‌ దీనిని నిర్మించారు. ప్రణవ స్వరూప్‌ దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలు, వినూత్న రీతిలో చేసిన ప్రమోషన్‌తో ఈ సినిమా కంటెంట్‌ ప్రేక్షకులకు చేరువైంది. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ఎలా ఉందో చూద్దాం.


కథ:

నేహా (అవికా గోర్‌) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతుంది. మేనమామ (శివాజీరాజా) ఆమె బాధ్యతను తీసుకుని పెంచుతాడు. అతని కొడుకైన కార్తిక్‌ (నందు)ను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. నేహ అంటే పిచ్చి ప్రేమ అతనికి. నేహ మాత్రం చిన్నప్పటి మిత్రుడైన గౌతమ్‌ (రవితేజ మహాధాస్యం)ను ప్రేమిస్తుంది.. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అది సహించని కార్తిక్‌ సైకోలా మారి నేహాను ఇబ్బందిపెడతాడు. తప్పని పరిస్థితిలో ఇష్టం లేకుండానే అతన్ని పెళ్లి చేసుకొని మౌనంగా అన్ని భరిస్తూ ఉంటుంది. ఓ రోజు నేహా రక్తపు మడుగులో పడుతుంది. ఆ తర్వాత కనిపించకుండా పోతుంది. అసలు ఏం జరిగింది? చివరికి కార్తిక్‌ ఏమయ్యాడు? అన్నది కథ.


విశ్లేషణ..

ఈ మధ్యకాలంలో నందు ఎంచుకున్న ప్రతి కథ విభిన్నమైనదే. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి తపన పడుతున్నాడు. అతనికి ఈ కథ కాస్త భిన్నమైనదే! ఫస్ట్‌ హాఫ్‌ అంతా కార్తీక్‌ నేహాను అనేక రకాలుగా హింసించడంతో సాగుతుంది. ఈ సన్నివేశాలన్నీ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మధ్యలో గౌతమ్‌, నేహల కథ నడుస్తుంది. దాంతో ఇంటర్‌వెల్‌ కాస్త సింపుల్‌గా ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. సెకండ్‌ హాఫ్‌ లో మళ్లీ అదే తంతు. టార్చర్‌ దిశగానే సినిమా నడుస్తుంది. అసలేం జరిగిందనే ఫ్లాష్‌బ్యాక్‌ అప్పుడు తెరపైకి వస్తుంది. నేహా కనిపించకుండా పోయి, ఇష్యూ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాక కాస్త వేగం పుంజుకుంటుంది. క్లైమాక్స్‌లో పోలీస్‌ చేత ఓ ట్విస్ట్‌ ఇచ్చారు. అది అంతగా కనెక్ట్‌ కాలేదు. భర్త ఎంతగా టార్చర్‌ పెడుతున్నా ఆ అమ్మాయి ఎందుకు అంత ఓపికగా భరిస్తుందో చివరి దాకా చెప్పలేదు. కొన్ని సన్నివేశాలు ఊహకు అందేలా ఉన్నాయి. దర్శకుడు లాజిక్కులు అసలు ఫాలో కాలేదు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు...

నెగటివ్‌ షేడ్‌లో సైకోగా నందు మాత్రం ఇరగదీశాడనే చెప్పాలి. స్క్రీన్ మీద ఎవరు కనిపించినా.. ప్రేక్షకుల కళ్లు మాత్రం నందు సైకోయిజం మీదకు వెళ్తాయి. క్షణాల్లోనే రెండు మూడు వేరియేషన్స్‌ చూపించి ఆకట్టుకున్నాడు. నేహా పాత్రలో అవికా గోర్‌ ఇమిడిపోయింది. రవి మహాదాస్యం కనిపించింది కాసేపే అయిన ఓకే అనిపించాడు. శివాజీ రాజా, ప్రగ్యా నయన్‌.. మిగిలిన నటీనటులు పరిధి మేరకు నటించారు. కథానుగుణంగా కెమెరా పనితనం ఉంది. సాయికుమార్‌ ధారా విజువల్స్‌ చక్కగా ఉన్నాయి. శ్రవణ్‌ భరద్వాజ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

ఇష్టం లేని పెళ్లి చేసుకుని నరకయాతన పడుతున్న అమ్మాయిలకు కనెక్ట్‌ అయ్యే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. అయితే అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఈ చిత్రం మెప్పించడం కష్టం. ఇందులో హీరో సైకోయిజాన్ని సున్నిత మనస్కులు చూడలేరు. సైకో భర్తలు పెట్టే టార్చర్‌ను బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న మహిళ అంతరంగాన్ని ఈ చిత్రంలో చూపించారు. దర్శకుడు రాసుకున్న లైన్‌ బావుంది. క్యారెక్టర్స్‌ను బాగా ఎస్టాబ్లిష్‌ చేశాడు. కానీ కథ నడిపిన తీరులో ఎక్కడో మిస్‌ఫైర్‌ అయింది. అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే కొంతవరకూ ఎంటర్‌టైన్‌ అయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్‌లైన్‌: సైకో టార్చర్‌..
రేటింగ్‌: 2.25/5

Updated Date - May 22 , 2026 | 07:10 PM