మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ రివ్యూ
ABN , Publish Date - May 15 , 2026 | 03:42 PM
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' సినిమా శుక్రవారం విడుదలైంది. మధుదీప్ చెలికాని దర్శకత్వంలో అరవింద్ మండెం ఈ సినిమాను నిర్మించారు. ఆదర్శవంతమైన కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కొన్ని కథలను వేడివేడిగా వడ్డించాలి. అలా కాకుండా ఆలస్యం చేస్తే అవి పాతబడి పోతాయి. అలాంటి కథలే మరికొన్ని వస్తే... వీటి ప్రాధాన్యం తగ్గిపోతుంది. దాంతో ఆ కథలకు రిపేర్ చేయాలనుకుంటే.. అవి కిచిడీగా మారిపోతాయి. తాజాగా విడుదలైన 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' సినిమా కథ అలాంటిదే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టారనడానికి ఇందులోని ఇద్దరు నటులు (డీఎంకే మురళీ కృష్ణ, కోసూరి వేణుగోపాల్) కరోనా సమయంలో కన్నుమూశారు. సో... అప్పుడెప్పుడో మొదలైన ఈ సినిమా ఇప్పటికి జనం ముందుకొచ్చింది. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన ఈ సినిమాను మధుదీప్ చెలికాని దర్శకత్వంలో అరవింద్ మండెం నిర్మించారు.
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' (Mr Work from home) మూవీ గొప్పతనం ఏమిటంటే దర్శకుడు ఎంచుకున్న అంశం. ఇవాళ మనుషుల సగటు జీవిత కాలం పెరుగుతోందని అంటున్నారు కానీ ఆరోగ్యం ఎంతగానే క్షీణిస్తోంది. దానికి కారణం మనం తీసుకునే ఆహారం. విపరీతంగా ఎరువులు వేసి పండించే ఆహారం తినడం వల్ల మన ఆరోగ్యమే కాదు... భూమి కూడా పాడైపోతోంది. దీనిని గుర్తించి ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేసి, మిల్లెట్స్ ను పండించి, వాటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు ఇచ్చారు. దానికి ఆయన రాసుకున్న కథేమిటంటే... అరవింద్ (త్రిగుణ్ Trigun)కు ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళంతా సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగం చేసి కోట్లు గడించాలని అనుకుంటే... అతను మాత్రం ప్రొఫెసర్ బలరాం చక్రవర్తి (శివాజీరాజా Shivaji Raja) ప్రభావంతో, రైతు కావాలని అనుకుంటాడు. అందుకోసం తాను దాచుకున్న డబ్బుల్నే పెట్టుబడిగా పెట్టి పెన్ మహాడ్ అనే గ్రామంలో కొంత భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తాడు. ఇదే సమయంలో జీవితంలో చాలా ప్రాక్టికల్‌గా ఉండే అతని ప్రియురాలు మహి (పాయల్ రాధాకృష్ణ Payal Radhakrishna) ఇతని తీరు నచ్చక దూరమౌతుంది. తాను ఎంచుకున్న మార్గంలో సాగుతూనే, రైతుగా విజయం సాధించడంతో పాటు మరెంతో మందికి అరవింద్ ఎలా ఆదర్శంగా నిలిచాడు? మహి ప్రేమను ఎలా గెలుచుకుని ఓ ఇంటి వాడు అయ్యాడు? అనేదే ఈ సినిమా కథ.
ఇందులో రెండు అంశాలను మిళితం చేస్తూ దర్శకుడు మధుదీప్ చెలికాని కథను నడిపారు. రెండు భిన్న ధృవాలైన అరవింద్, మహీ మధ్య ప్రేమకథ ఒకటి అయితే... ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసి... రైతును రాజుగా చేయాలనే హీరో పట్టుదల మరొకటి. ఇందులోని రెండో పాయింట్ కాస్తంత భిన్నమైంది. అంతేకాదు ఆదర్శవంతమైంది. అయితే ఇలాంటి ఆదర్శాలను తెర మీద చూపిస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయంతో కావచ్చు... కోర్ పాయింట్ ను సైడ్ చేసేసి హీరో హీరోయిన్ల ప్రేమ, ఎడబాటు, తిరిగి వారు కలుసుకోవడం అనే దానిని మెయిన్ ప్లాట్ గా మార్చేశారు. చిత్రం ఏమంటే... రెండు గంటల పాటు కథ నడిచిన తర్వాత కూడా హీరో అభిప్రాయాన్ని హీరోయిన్ కానీ, ఆమె అభిప్రాయాన్ని అతను గాని గౌరవించరు. ఎవరి వాదన వారిదే అన్నట్టుగా ఉంటారు. మరి ఈ మాత్రం దానికి ఇంత కథ ఎందుకు నడపడం? అని ప్రేక్షకుడికి అనిసిస్తుంది. ఎంతకూ వీరి మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఇదంతా వృధా ప్రయాసే కదా! అనే భావన కలుగుతుంది. మరోపక్క కష్టపడి వ్యవసాయం చేసి, విజయవంతంగా మిల్లెట్స్ పండించి, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన అంశాన్ని ఎలాంటి నాటకీయత లేకుండా చకచకా లాగించారు. ఇలాంటి వ్యవసాయం చేయడం ఇంత సింపులా!? అనిపించేలా చేశారు. పైగా ఈ రెండు అంశాలను ముందుకు, వెనక్కు తిప్పుతూ చూపించడంతో ప్రేక్షకుడు ఈ కథకు కనెక్ట్ కావడం కష్టమైపోయింది. దాంతో ఇటు లవ్ స్టోరీ, అటూ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఏదీ కూడా జనాలపై బలమైన ముద్ర వేయలేకపోయాయి. దర్శకుడు ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు కానీ అది మన బుర్రలకు ఎక్కడం కష్టం అనే భావనకు ప్రేక్షకుడు లోనవుతాడు.
'సినిమాను ఎప్పుడో మొదలు పెట్టి, ఇప్పుటికి పూర్తి చేశాం. అందువల్ల ఎలాగొలా రిలీజ్ చేసేద్దాం' అని మాత్రం నిర్మాత ఆలోచించినట్టుగా అనిపించదు. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు ఎంతో కష్టపడి తీర్చిదిద్దాడు. అవకాశం ఉన్న దగ్గర, లేని దగ్గర కూడా వీఎఫ్ఎక్స్ వాడాడు. దాంతో నిర్మాతకు ఖర్చు తడిసి మోపెడు అయి ఉండొచ్చు. కథను, దర్శకుడిని నమ్మిన నిర్మాత అరవింద్ మెండెం దొరకడం ఈ సినిమా చేసుకున్న అదృష్టం!
నటీనటుల విషయానికి వస్తే హీరో త్రిగుణ్ చాలా సన్నివేశాల్లో యాక్టివ్ గా కనిపించాడు. కానీ కొన్ని సీన్స్‌లో ఎందుకో డీలాగా అనిపించాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ తన పాత్రను సమర్థవంతంగా పోషించింది. హీరో తల్లిదండ్రులుగా సత్యకృష్ణన్, అనీశ్ కురువిల్ల జంటగా నటించారు. విశేషం ఏమంటే... ఇరవై ఆరేళ్ళ క్రితం శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన తొలి చిత్రం 'డాలర్ డ్రీమ్స్'లో తొలిసారి వీళ్ళిద్దరూ జంటగా నటించారు. హీరోయిన్ పేరెంట్స్ గా సీవిఎల్ నరసింహారావు, జయశ్రీ రాచకొండ యాక్ట్ చేశారు. ఇతర కీలక పాత్రలను గుండు సుదర్శన్, నెల్లూరు సుదర్శన్, వైవా హర్ష, శివాజీ రాజా, గిరిధర్, హర్షవర్థన్ తదితరులు చేశారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య అతిథి పాత్ర పోషించారు. ఇంకా చాలామందే ఈ సినిమాలో నటించారు. అందరి పాత్రలూ ఇలా వచ్చి అలా వెళ్ళేవే! సాంకేతిక నిపుణుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు సంగీతం గురించి. నేపథ్య సంగీతంతో పాటు అవసరమైన చోట నేపథ్య గీతాలతో సినిమాను నింపేశారు. అయితే వాటి ప్రభావం పెద్దంతగా లేదు. రవికుమార్ వి. ఫోటోగ్రఫీ ఓకే! మాటలు కొన్ని చోట్ల బాగున్నాయి.
సినిమా ప్రారంభానికి, విడుదలకు మధ్య ఇలాంటి కథలతోనే కొన్ని మూవీస్ రావడంతో ఈ కథకు రిపేర్ చేసినట్టుగా అర్థమౌతోంది. ఈ మార్పులు చేర్పులతో కోర్ పాయింట్ ను చెప్పడంతో దర్శకుడు తడబడ్డాడు. సినిమా ప్రారంభంలోనే 'సొంతవాళ్లకైనా, సొసైటీకైనా ప్రయత్నాలు నచ్చవు. ఫలితాలే నచ్చుతాయి' అనే కొటేషన్ వేశారు. నిజమే... మనం ఎంత కష్టపడి సినిమా తీశాం అనేది జనాలకు అనవసరం. ఆకట్టుకునేలా తీశారా లేదా అనేదే వాళ్ళకు కావాలి. అదే ఫలితాన్ని కూడా నిర్దేశిస్తుంది. ఆ విషయంలో దర్శకుడు ప్రతికూల ఫలితాన్నే పొందాడు. కాన్సెప్ట్ మంచిదే అయినా దానిని సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు.
రేటింగ్: 2.25/ 5
ట్యాగ్ లైన్: అలవి కాని ఆదర్శం!