DC Movie Review: లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన 'డీసీ' మూవీ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:35 PM

కోలీవుడ్‌లో వచ్చిన ఖైదీ, మాస్టర్‌, విక్రమ్‌, లియో, కూలీ వంటి చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ లోకేష్‌ కనగరాజ్. ఇప్పుడు  ఆయన హీరోగా పరిచయమైన 'డీసీ' మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎలా ఉందో చూద్దాం. 

సినిమా రివ్యూ: డీసీ (DC Movie Review)

విడుదల తేది: 7-8-2026

'ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ' చిత్రాలతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanakaraju) అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు పొందారు. తమిళనాట ఇప్పుడాయన మోస్ట్ క్రేజీయెస్ట్ డైరెక్టర్. లోకేష్ కనగరాజ్ తెరపై అతిథిగా కూడా మెరుస్తుంటారు. ఇప్పుడు ‘డీసీ’ సినిమాతో ఏకంగా హీరోగానే ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన ప్రకటన రాగానే, భారీ అంచనాలు నెలకొనడంతో పాటు ఈ కల్ట్ డైరెక్టర్... హీరోగా మెప్పించగలడా? పాత్రకు ఎంత వరకూ న్యాయం చేయగలడు? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ‘సానీ కాయిదం’, ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాల దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన 'డీసీ' తమిళంతోపాటు తెలుగులోనూ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో హీరోగా లోకేశ్ మెప్పించారా? రొమాంటిక్ యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూద్దాం!

కథ: (DC Movie review)

ఆర్మ్స్ రాబరీ కేసులో జైలులో ఉన్న సర్కార్ కు దేవదాసు (లోకేష్ కనగరాజ్), అతని స్నేహితులు పరిచయమవుతారు. అప్పటి నుంచి దేవదాసు టీమ్ సర్కార్ తో కలిసి పని చేస్తుంటుంది. దేవదాసు మంచి వైపు ఉండాలని కోరుకునే వ్యక్తి. కానీ ఓ రాబరీ కేసులో పోలీసులు ఈ గ్యాంగ్ ను  వెంటాడుతుంటారు. ఈ క్రమంలో అన్యాయంగా ఓ అమాయకుడిని చంపిన ఓ పోలీస్ అధికారిని దేవదాస్ అండ్ గ్యాంగ్ చంపేస్తుంది. దీంతో పోలీసులు ఈ గ్యాంగ్ పై మరింత ఫోకస్ పెడతారు. అసలు దేవదాస్ గ్యాంగ్ లక్ష్యం ఏంటి? పోలీసులు వీరిని ఎందుకు టార్గెట్ చేశారు? విజయవాడ లాడ్జ్ లో దేవదాసుకు పరిచయమైన గాయని పార్వతి (సంజనా కృష్ణమూర్తి) ఎందుకు మరణించింది? వేశ్యాగృహంలో పరిచయమైన చంద్రిక (వామిక గబ్బి) దేవదాసులో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ఫైనల్ గా దేవదాసు అనుకున్నది చేశాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.


విశ్లేషణ:

గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే రివేంజ్ యాక్షన్ డ్రామాకు కాస్త ఎమోషన్స్ జోడించి రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించిన చిత్రమిది. అయితే కథగా ఇదేమీ కొత్తది కాదు. రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామానే. ఓ కొడుకును గొప్పగా చదివించాలని ప్రణాళిక వేసుకున్న తండ్రి పట్ల పోలీస్ ఆఫీసర్ వ్యవహరించిన తీరుతో ఎమోషనల్ గా  ఫస్టాఫ్ మొదలవుతుంది. ఆ తర్వాత పోలీసులు,  గ్యాంగ్ స్టర్స్  కు మధ్య ఎన్ కౌంటర్ తో అసలు కథలోకి వెళ్తుంది. పార్వతి, చంద్రికల ఎపిసోడ్స్ తో ఎమోషనల్ డ్రైవ్ గా నడుస్తుంది. సెకండాఫ్ అంతా పోలీసులకు, గ్యాంగ్ స్టర్ టీమ్ కు మధ్య ట్రేసింగ్ నేపథ్యంలోనే సాగుతుంది. అదే టైమ్ లో దేవదాసు గ్యాంగ్ ఏం చేయాలనుకున్నారో అది చేస్తారు. ఫ్రెండ్ షిప్, ఎమోషన్స్ ను  జోడించి బాగానే డ్రైవ్ చేసినా… హింసాత్మక సన్నివేశాలు ఎక్కువ కావడం, యాక్షన్ కు పెద్ద పీట వేయడం వల్ల కథలోని అసలు ఫ్లేవర్, ఎమోషన్స్ సైడ్ అయి పోయిన భావన కలుగుతుంది. 

నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితీరు:

స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతూ అప్పుడప్పుడు కామియో రోల్ లో మెరిసిన లోకేశ్ పూర్తి స్థాయి హీరోగా నటించిన చిత్రమిది. గ్యాంగ్ స్టర్ దేవదాస్ పాత్రకు పర్ఫెక్ట్ యాప్ట్ అన్నట్టు నటించాడు లోకేష్. నటుడిగా ఆయనకు మంచి మార్కులే పడతాయి. అలాగే యాక్షన్, ఎమోషన్స్ సీన్ లో కూడా మెప్పించారు. హీరోయిన్ గా వామికా గబ్బి పోషించిన చంద్రిక పాత్ర గుర్తుండిపోతుంది. తెరపై కాసేపే కనిపించినా పార్వతి పాత్రలో సంజనా కృష్ణమూర్తి కూడా బెస్ట్ అనిపించుకుంది. లోకేశ్ స్నేహితులుగా నటించిన నలుగురు కూడా రా లుక్ లో కనిపిస్తూనే అక్కడక్కడా నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. మిగతా ఆర్టిస్టులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ఈ సినిమాకు మేజర్ ఎసెట్ సంగీతం. అనిరుధ్ నూటికి నూరు శాతం తన పనికి న్యాయం చేశాడు. సాంగ్స్ ఇంపాక్ట్ పెద్దగా లేకపోయినా బిట్స్ సాంగ్స్, బీజీఎమ్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ను  ఎలివేట్ చేశాయి. ముఖేష్. జి సినిమాటోగ్రఫీ స్టోరీకి, నేటివిటీకి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ కూడా ఫర్వాలేదు. ‘ప్రాణంలేని పువ్వు, ప్రాణం తీసే తుపాకీ ముందుకు నడిపిస్తున్నాయి’ లాంటి కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. రొటీన్ కథే అయినా దర్శకుడు నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. పూర్తిగా హింసతో యాక్షన్ కు  ఎక్కువ స్పేస్ ఇవ్వడంతో ఒక సెక్షన్ ఆడియన్స్ కు  నచ్చకపోవచ్చు. గ్యాంగ్ స్టర్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రం సినిమా నచ్చుతుంది. దర్శకుడిగానే కాదు... లోకేశ్ హీరోగా కూడా కంటిన్యూ కావచ్చు అనిపిస్తుంది.

ట్యాగ్ లైన్: గ్యాంగ్ స్టర్ లవ్ స్టోరీ

రేటింగ్: 2.5/5

Updated Date - Aug 07 , 2026 | 02:57 PM