The Last Man in Tower Review: ఇల్లు కోసం.. మనుషులు ఎంతకైనా తెగిస్తారా?
ABN , Publish Date - Nov 26 , 2026 | 11:10 AM
ఇల్లు అంటే నాలుగు గోడలు మాత్రమేనా? తన ఇంటిని వదులుకోవడానికి నిరాకరించిన ఓ వ్యక్తికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ది లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ సినిమా విశేషాలు,
రెండు న్యాయాలు పరస్పరం ఢీకొంటే అన్యాయం కచ్చితంగా మొదలు కావల్సిందేనా? మనిషి తన అవసరాల కోసం ఎంతవరకు దిగజారగలడు? తన ప్రయోజనం కోసం మరొకరి జీవితాన్ని నాశనం చేయడాన్ని ఏ తర్కంతో సమర్థించుకుంటాడు? ఇల్లు అనేది కేవలం నివాస స్థలమా? లేక మనిషి తన జీవితాన్ని కొద్దికొద్దిగా నిక్షిప్తం చేసుకున్న వ్యక్తిగత చరిత్రా? ఇల్లు కూల్చేస్తారు సరే.. ఆ ఇంట్లో నివసించిన జీవితాన్ని ఎక్కడికి తరలిస్తారు? ఒక ఇంటికి మార్కెట్ విలువ కన్నా ఎక్కువే ఇస్తారు సరే.. ఆ ఇంట్లో గడిచిన కాలానికి ఏ విలువ కడతారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నమే ది లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ (Last Man in Tower).
వ్యక్తిగత స్వార్థం.. సామూహిక నైతికతగా మారిపోతుందన్న వాస్తవానికి దృశ్యరూపం ఈ సినిమా. మధ్యతరగతి తనను తాను నైతికంగా.. ఉన్నతమైన వర్గంగా భావించుకుంటుంది. కానీ తన ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగి నప్పుడు.. అదే వర్గం తన నైతిక ప్రమాణాలను సవరించుకుంటుంది. ఈ రెండు హక్కుల మధ్య సమతుల్యతను సాధించాల్సిన ఆ వర్గం ఒక వ్యక్తిని తొలగించడమే పరిష్కారమని కూడా భావిస్తుందని తేల్చి చెప్పిన సినిమా ఇది. ముంబైలో ఒక చిన్న మధ్యతరగతి ప్రపంచం అది. అక్కడికి ధర్మన్ షా అనే బిల్డర్ రంగప్రవేశం చేస్తాడు. ఆ పాత అపార్ట్‌మెంట్‌ను కూల్చి, అక్కడ విలాసవంతమైన నివాస సముదాయాన్ని నిర్మించాలనుకుంటాడు. అందుకు ప్లాట్ల యజమానులకు మార్కెట్ ధరకు రెండున్నర రెట్లు ఇస్తానంటాడు. నివాసులంతా సంతోషిస్తారు. ఒక్క మాస్టర్ తప్ప.
ఆయన తన ఇంటిని అమ్మడానికి నిరాకరిస్తాడు. మొదట ఆయన నిర్ణయాన్ని గౌరవించిన పొరుగు వాళ్లు క్రమంగా అసహనానికి గురవుతారు. ఆ అసహనం ద్వేషంగా పరిణమిస్తుంది. ఇక్కడి నుంచి కథ కేవలం రియల్ ఎస్టేట్ వివాదంగా మిగలదు. మనుషుల మధ్య సంబంధాల విధ్వంసంగా మారుతుంది. అసలు విలన్ ఎవరు? బిల్డరా? మధ్యతరగతి మనస్తత్వమా? ఒక మనిషిని ఖాళీ చేయించడానికి ఒక సమాజమంతా కుట్ర చేస్తే ఎలా ఉంటుంది? అని చర్చించే ఈ సినిమా ఒక వ్యక్తి నైతిక నిశ్చయానికీ, ఒక సమూహపు ఆర్థిక ఆకాంక్షలకీ.. ఆ ఆకాంక్షలు తీర్చుకోవడానికి జారే లోతులకీ మధ్య జరిగే యుద్ధం. అరవింద్ అడిగ (Aravind Adiga) 2011లో రాసిన Last Man in Tower పుస్తకానికి ఈ సినిమా అనుసరణ కాగా బెన్ రేఖీ (Ben Rekhi) దర్శకుడు. మన తెలుగు హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈ చిత్రానికి ఒక నిర్మాత కావడం విశేషం.
ఒక వ్యక్తి తన ఇంటిని కాపాడుకోవాలని అనుకోవడం న్యాయమే. అదే సమయంలో మిగిలిన వాళ్లు తమ ఇళ్లను అమ్ముకుని మెరుగైన జీవితాన్ని పొందాలనుకోవడం కూడా తప్పు కాదు. తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి మరొకరి స్వేచ్ఛను హరించాలనుకున్న క్షణంలో న్యాయం అన్యాయంగా మారుతుంది. మాస్టర్ నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నించడం సరే. ఆయనను మానసికంగా హింసించి, ఒంటరిని చేసి, బలవంతంగా లొంగదీసుకోవాలని అనుకోవడం సరైంది కాదు. ఒక్కొక్కరిగా చూస్తే తమను తాము మంచివాళ్లుగా భావించుకునే మనుషులు, సమూహంగా మారినప్పుడు క్రూరంగా ప్రవర్తించగలరని ఈ సినిమా చెబుతుంది.

మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) పోషించిన మాస్టర్ జీ పాత్రను కేవలం నైతిక విలువల కోసం పోరాడే ఆదర్శవాదిగా చూస్తే ఆ పాత్రలోని మానవీయ సంక్లిష్టత అర్థం కాదు. ఆయన మొండివాడు కూడా. తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఇతరుల అవసరాలకన్నా తన అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఆయనకు ఇల్లు ఒక ఆస్తి కాదు. ఒక అస్తిత్వం. యువకుడు రేపటి కోసం ఇల్లు కొంటాడు. వృద్ధుడు నిన్నటిని కాపాడుకోవడానికి ఇంటిని వదులుకోడు. ఈ రెండు తరాల ఆలోచనల మధ్య తేడాను దర్శకుడు సున్నితంగా ప్రతిపాదిస్తాడు. మాస్టర్‌కి కొత్త ఇల్లు అవసరం లేదు. ఎందుకంటే కొత్త ఇంట్లో ఆయనకు కొత్త జీవితం ప్రారంభించడానికి కావలసినంత కాలం మిగిలి ఉందో లేదో తెలియదు. ఆయన కాపాడుకోవాలని అనుకుంటున్నది గోడలను కాదు. తన భార్య మరణించిన తర్వాత కూడా ఆమెతో కలిసి జీవించగలిగే ఒకే ఒక్క ప్రదేశాన్ని. ఇక్కడ ఇల్లు ఒక భౌతిక నిర్మాణం నుంచి భావోద్వేగ పర్యావరణంగా మారుతుంది.
నిజానికి మాస్టర్ జీకి ప్రత్యక్ష ప్రత్యర్థి బిల్డర్. ఆయనకు అత్యంత సమీపంలో ఉన్న నైతిక ప్రత్యర్థి సంగీత (దివ్యా దత్తా) (Divya Dutta). ఆమె బయటి శత్రువు కాదు. అదే అపార్ట్మెంట్లో నివసించే పొరుగింటి మనిషి ఆమె ఆకాంక్షలు అసాధారణమైనవి కావు. ఆమె కూడా మెరుగైన జీవితాన్ని కోరుకుంటుంది. కానీ ఆ ఆకాంక్ష నెరవేరడానికి అడ్డుగా నిలిచిన వ్యక్తి పట్ల ఆమెలో క్రమంగా అసహనం పెరుగుతుంది. దివ్యా దత్తా నటనలో ముఖ్య మైన విశేషం ఈ పరిణామాన్ని అతిశయోక్తి లేకుండా వ్యక్తీకరించడం. మొదట సహజంగా కనిపించే చిరునవ్వు క్రమంగా ఒక ఒత్తిడి సాధనంగా మారుతుంది. ఆమె పాత్ర ద్వారా దర్శకుడు ఒక విషయాన్ని సూచిస్తాడు. మనిషి క్రూరంగా మారడానికి మొదటి నుంచీ క్రూరుడై ఉండాల్సిన అవసరం లేదు. తన కోరిక నెరవేరకపోవడానికి మరొకరు కారణమని నమ్మడం ప్రారంభిస్తే చాలు. ఇక బిల్డర్‌గా బోమన్ ఇరానీ (Boman Irani) హుందాతనం, గాంభీర్యంతో ఆకట్టుకుంటాడు.
ఇది మనుషుల మధ్య సంబంధాలకు.. ధర నిర్ణయించే సమాజం గురించిన సినిమా. డబ్బు మనుషులను మారుస్తుందా? లేక మనుషుల్లో అంతర్లీనంగా ఉన్న స్వార్ధాన్ని బయట పెడుతుందా? ఈ రెండు ప్రశ్నల మధ్యే సినిమా నడుస్తుంది. అయితే మాస్టర్ జీని సంపూర్ణమైన ఆదర్శ పురుషుడిగా చూడాల్సిన అవసరం లేదు. ఆయన నిర్ణయంలో మొండితనం ఉంది. కానీ ఆయన మొండితనం వల్ల మిగిలినవాళ్లలో బయటపడిన క్రూరత్వాన్ని సమర్థించలేం. అదే ఈ కథలోని అత్యంత ముఖ్యమైన నైతిక వైరుధ్యం. ఒక భవనం కూలిపోతే శిథిలాలు మిగులుతాయి. ఒక సమాజం కూలిపోతే మనుషులే శిథిలాలుగా మిగులుతారు. ఇదిలాఉంటే 97 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం జీ5 (ZEE5) ఓటీటీలో కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. - ప్రసేన్, 70133 58154