I Am Game Review: దుల్కర్‌ సల్మాన్ 'ఐమ్‌ గేమ్‌’ ఎలా ఉందంటే

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:58 PM

దుల్కర్‌ సల్మాన్  నటించి, జోమ్‌ వర్గీస్‌తో కలిసి నిర్మించిన చిత్రం  'ఐమ్‌ గేమ్‌’. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి నహాస్‌ హిదయత్‌ దర్శకత్వం వహించారు. కయాదు లోహర్‌ కథానాయిక. మిస్కిన్‌, అంటోని వర్గీస్‌, సంయుక్త విశ్వనాథన్‌, వినయ్‌ ఫోర్ట్‌ కీలక పాత్రధారులు. ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.  

సినిమా రివ్యూ: ఐమ్ గేమ్ ( I Am Game Review)
విడుదల తేది:
04–09–2026


దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. దుల్కర్ మలయాళంలో నటించిన ప్రతీ సినిమా తెలుగులోనూ అనువాదమవుతోంది. తాజాగా ఆయన నటించి, జోమ్ వర్గీస్ తో కలసి నిర్మించిన చిత్రం ‘ఐమ్ గేమ్’. ఫాంటసీ థ్రిల్లర్ గా  తెరకెక్కిన ఈ చిత్రానికి నహాస్ హిదయత్ దర్శకత్వం వహించారు. కయాదు లోహర్ కథానాయిక. మిస్కిన్, అంటోని వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్ కీలక పాత్రధారులు. గురువారం రిలీజ్ కావాల్సిన ఈమూవీ సాంకేతిక కారణాలతో ఆలస్యంగా ఫస్ట్ షో నుంచి తెలుగువారికి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటోందో చూద్దాం.

కథ:
హైద‌రాబాద్‌లో.. ఓ మిల‌య‌నీర్ వార‌సుడైన డ్యాన్ (దుల్క‌ర్ స‌ల్మాన్‌) త‌న తండ్రి సాయం లేకుండా డ‌బ్బులు సంపాదించి త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డాల‌ని అనుకుంటుంటాడు. కానీ వ్యాపారంలో పీక‌ల్లోతూ అప్పుల్లో మునిగిపోతాడు. అప్పుల వాళ్ల‌ నుంచి నిత్యం బెదిరింపులు రావ‌డమే గాక ఓ మారు ఆఫీసుకే వ‌చ్చి డ్యాన్‌పై అంద‌రి ముందే దాడి చేస్తారు. దాంతో తండ్రి సైతం మంద‌లిస్తాడు. ఈ క్ర‌మంలో ఎలాగైనా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డ‌బ్బు సంపాదించాల‌ని అమ్మ ఇచ్చిన డ‌బ్బును బెట్టింగ్‌లో పెట్టి న‌ష్ట‌పోతాడు. అది జీర్ణించుకోలేని డ్యాన్ నిర్వాహ‌కుల‌ను భ‌య‌పెట్టి త‌న డ‌బ్బుతో త‌ప్పించుకునే క్ర‌మంలో ఓ తీవ్ర‌ ప్ర‌మాదానికి గురై త‌న చేతిని కోల్పోతాడు. అదే స‌మ‌యంలో డోన‌ర్ దొర‌క‌డంతో చేతిని ఆప‌రేష‌న్ చేసి డ్యాన్‌కు అతికిస్తారు. ఆ క్ర‌మంలో అత‌నికి  ఫిజియోథెరపీ చేయడానికి వచ్చిన ఇషా (కయాదులోహర్)తో ఏర్ప‌డిన‌ పరిచయం, ఆమె సాయంతో త్వ‌ర‌గా కోలుకుంటాడు. అయితే అప్పుడే క‌థ మ‌రో మ‌లుపు తిరుగుతుంది. త‌న‌కు అతికించిన చేయితో కొత్త స‌మ‌స్య‌లు పుట్టుకొస్తాయి. అది డ్యాన్ ఆధీనంలో ఉండ‌కుండా విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తుంటుంది. డ్యాన్ దానిని అదుపులో పెట్టుకోవ‌డానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అది కంట్రోల్‌లోకి రాదు. ఓ రోజు డ్యాన్‌ బెట్టింగ్ కోసం వెళ్లగా అక్క‌డ అత‌ని ప్ర‌మేయం లేకుండానే డేవిడ్ అనే పెద్ద‌ బిజినెస్ మ్యాన్‌ను చంపేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ నేప‌థ్యంలో అస‌లు అతికించిన చేయి ఎందుకు అలా చేసింది, దాని వెన‌క దాగి ఉన్న క‌థేంటి చివ‌ర‌కు ఏ స్థాయికి ఈ స‌మ‌స్య వెళ్లింది.. దానికి పరిష్కారం దొరికిందా లేదా అనేదే క‌థ‌.


విశ్లేషణ:
మరణించిన వ్యక్తి ఆత్మ గ్యాంబ్లర్ ను ఆవహించి ప్రతీకారం తీర్చుకునే ఫాంటసీ డ్రామా ఇది. ఆత్మలు మనిషిని ఆవహించి తనకు అన్యాయం చేసిన వాళ్లను అంతం చేయడం అన్నది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. తెలుగులోనూ గతంలో చాలా సినిమాల్లో చూశాం. ఫస్టాఫ్లో హీరో పరిచయం అతని గ్యాబ్లింగ్, అప్పుల సన్నివేశాలతో కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. హీరో చెయ్యి నియంత్రణ కోల్పోయిందన్న విషయం తెలిసే వరకూ కథ సోసోగా సాగుతుంది. డాక్టర్ ఈ విషయం రివీల్ చేసినప్పటి నుంచి ఆసక్తి కలుగుతుంది. హీరోకి అమర్చిన చెయ్యి తన పగ తీర్చుకోవడానికి సిద్ధపడిన సన్నివేశాలతో ఇంటర్వెల్ ఆసక్తి కరంగా ఉండి సెకండాఫ్ పై  క్యూరియాసిటీని పెంచుతుంది. డ్యాన్ కు  అమర్చిన హ్యాండ్ ఎవరిదో కనుక్కునే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్రికెటర్ విక్కీ (ఆంటోనీ వర్గీస్) ఫ్లాష్ బ్యాక్ అంతా రొటీన్గా సాగటంతో తన కథలో పెయిన్ ఉన్నా భావోద్వేగాలు అంతగా పండలేదు. అయితే క్లైమాక్స్లో చెయ్యి చేసే హంగామా ఆకట్టుకుంటుంది. ప్రతీకారం కుడి చెయ్యిదే అయినా తెరపై దుల్కర్ కనిపిస్తాడు కాబట్టి అతనికి అంత ఓవర్ గా యాక్షన్ అవసరం లేదనిపిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
డ్యాన్ పాత్రలో దుల్కర్ చక్కగా ఒదిగిపోయాడు. కుడి చేతికి అతనికి మధ్య సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. ఇషా పాత్రలో కయాదు లోహర్ పర్వాలేదనిపించింది. ఆంటోనీ వర్గీస్ క్రికెటర్గా బాగా చేశారు. మిస్కిన్ కు  రొటీన్ పాత్రే ఇది. సంయుక్త విశ్వనాథన్ పరిధి ఓకె. మెర్సీ పాత్రలో జయసుధ తన మార్క్ చూపించారు. టెక్నికల్ విషయాలకొస్తే… జేక్స్ బిజోయ్ సంగీతం సినిమాకు ఎంతో ప్లస్ అయింది. చాలా చోట్ల సన్నివేశాలను ఎలివేట్ చేసింది. సెకెండాఫ్ నిడివి ఎక్కువై కాస్త బోర్ కొడుతుంది. కెమెరా వర్క్ బాగుంది. సినిమా అంతా రిచ్ గా ఉంది. ఆత్మ ఆవహించడం పాత పాయింటే అయినా చెయ్యి పగ తీర్చుకోవడమనే పాయింట్, దానిని తెరకెక్కించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి కథలను తెరపై ఎంత వైవిధ్యంగా చెప్పామనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. ఫస్టాఫ్ ను ఎంగేజింగ్గా తెరకెక్కించిన దర్శకుడు సెకెండాఫ్లో దారితప్పాడు. రొటీన్ రివేంజ్ డ్రామా అయినా పలు చోట్ల ఆకట్టుకుంటుంది. సినిమాకు ప్రచారం లేకపోవడం, లేట్ గా రిలీజ్ కావటం పెద్ద మైనస్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి విషయాల్లో కేర్ ఫుల్ గా ఉండాలి. లేకుంటే బాగుందనే టాక్ వచ్చినా ఈ సినిమాలాగే మిస్ ఫైర్ అవటం ఖాయం.

ట్యాగ్లైన్: రొటీన్ గేమ్
రేటింగ్: 2.75/5

Updated Date - Sep 04 , 2026 | 07:53 PM