Husharu Pittalu Review: హుషారు పిట్టలు ఎలా ఉందంటే..
ABN , Publish Date - Aug 15 , 2026 | 07:56 AM
అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
సినిమా రివ్యూ: హుషారు పిట్టలు (Husharu Pittalu Review)
అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. యువతను టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ: (Husharu Pittalu Review)
మాసినపల్లి రవి (అన్ష్) చదువులో ఫస్ట్. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడు. అదే ఊళ్లో ఉండే చిట్టి (వాసవి గణేషన్) రవిపై ఇష్టం పెంచుకుంటుంది. అయితే రవికి ప్రేమ, ఎట్రాక్షన్ ఇవేమీ తెలీదు. అతని ప్రపంచం అంతా చదువే! అతని చుట్టూ ఉండే బ్యాచ్లో ఉండే బాలన్న రవిని ప్రభావితం చేసి తప్పుదారిలోకి తీసుకెళ్లాడు. అతని మాటలకు, చేష్టలకు ఎట్రాక్ట్ అయిన రవి చిట్టితల్లి ప్రేమలో పడతాడు. యుక్త వయసులో వచ్చే మార్పులు, అవగాహన లేమీ ఇద్దరిని దారి తప్పి, హద్దులు దాటే దాకా తీసుకెళ్తుంది. వీరిద్దరి వ్యవహారం తెలిసిన చిట్టి అక్క శైలు (ప్రణీ రెడ్డి)కి హెచ్చరించినా వినే పరిస్థితిలో రవి, చిట్టి ఉండరు. హద్దు దాటిన విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో వీరిద్దరి పరిస్థితులు తారుమారవుతాయి. దీంతో ఇరు కుటుంబాలు ఎలా స్పందించాయి. చిన్న వయసులో తెలిసీతెలియక చేసిన తప్పు ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? రవి, చిట్టి జీవితాలు ఏమయ్యాయి? అన్నది కథ.
విశ్లేషణ
స్కూలింగ్ పూర్తయిన ఓ యువకుడు, స్కూలింగ్‌లోనే ఉన్న యువతీ శరీరాక్షణకు లోనై చేసిన పని వారి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపించింది అన్నది ఈ సినిమా ఇతివృత్తం. దీనిలో బోల్డ్ కంటెంట్‌తోపాటు తండ్రి సెంటిమెంట్‌ను, చివర్లో ఓ సందేశాన్ని జోడించి దర్శకుడు తెరకెక్కించారు. గతంలో ఈ తరహాలో 'చిత్రం, ఈరోజుల్లో' వంటి చిత్రాలు వచ్చాయి. అయితే ఈ సినిమాను వాటికంటే బోల్డ్‌గా చిత్రీకరించారు. ఫస్టాఫ్ అంతా రవి, చిట్టి మధ్య ప్రేమ చిగురించడం, ఫోన్ సంభాషణ, శారీరక ఆకర్షణ.. ఆ తర్వాత జరిగే శృంగార కలాపాలతో బోల్డ్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులతో ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ట్విస్ట్‌తో మరింత ఆసక్తి పెరుగుతుంది. అక్కడినుంచి కథ ఫ్యామిలీ, ఫాదర్ సెంటిమెంట్ వైపు టర్న్ అవుతుంది. ఆ ఇద్దరూ చేసిన తప్పు వల్ల ఇరు కుటుంబాల మధ్య సంఘర్షణ, ఎంతగా ఆవేదనకు గురయ్యాయి అనే అంశాలను దర్శకుడు ఎంతో భావోద్వేగంగా మలిచారు. ఫాదర్ సెంటిమెంట్ సన్నివేశాలు మాత్రం కొన్ని చోట్ల తేలిపోయాయి. ఫోన్లు, చుట్టు పక్క జనాల వాతావరణం, యుక్తవయసులో వచ్చే శారీరక, మానసిక మార్పులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇందులో బోల్డ్ కంటెంట్‌ను డబుల్ మీనింగ్ డైలాగ్‌లను విపరీతంగా ఉపయోగించారు. తెరపై వల్లర్, ఎక్స్‌పోజింగ్ లాంటివి చూపించలేదు. కానీ అంతగా ఫీలయ్యేలా చేశారు. ఇందులో హీరోయిన్ పాత్ర కండోమ్స్, వయాగ్రా వంటి మెడిసిన్‌ను స్వయంగా హీరోకి ఇచ్చి.. ఇంకా కోరికలు పెరగాలి అని చెప్పే సన్నివేశాలు యాక్సెప్ట్ చేసేలా లేవు. మైనర్ బాలికతో శృంగారం చేస్తే ఫోక్సో యాక్ట్ తప్పదని ఆ తరహా సన్నివేశాలు వచ్చిన ప్రతిసారీ డిస్క్లైమర్ వేశారు. బోల్డ్ కంటెంట్‌ను డీల్ చేసినంతగా సందేశాత్మక సన్నివేశాలను దర్శకుడు డీల్ చేయలేకపోయాడు. ఆ సన్నివేశాల్లో ఇంకా భావోద్వేగాలు చూపించి సందేశం ఇచ్చే అవకాశం ఉంది. కానీ తేల్చేసి చెప్పారు. ప్రీ–క్లైమాక్ ఆసక్తికరంగా ఉంది. కానీ క్లైమాక్స్ మొత్తం ఊహకు అందేలాగే ఉంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
హీరో అన్ష్, హీరోయిన్ వాసవి గణేషన్ ఇద్దరికీ ఇది తొలి సినిమా. అయినా నటన పరంగా పాత్రల్లో ఇమిడిపోయారు. టీనేజర్స్లో ఉండే అమాయకత్వం, ఆకర్షణ, భయాలను నేచులర్గా తెరపై పలికించారు. హీరోయిన్ తండ్రి పాత్రలో గోవర్ధన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రణీ రెడ్డి స్ర్కీన్ ప్రెజెన్స్ బావుంది. కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్ను డామినేట్ చేసింది. ఇతర పాత్రధారులు అంతా పరిధి మేరకు నటించారు. బోల్డ్ కంటెంట్‌కు తగ్గట్టే లిరిక్స్ కూడా ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్‌ను నేపథ్య సంగీతం ఎలివేట్ చేసింది. పల్లె వాతావరణానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ కుదిరింది. కథకు తగ్గట్లు నిర్మాణ విలువలున్నాయి. ఎడిటింగ్ ఓకే. ఈ తరహా కథలు చాలానే వచ్చినా దర్శకుడు దీనిని కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ యువతను ఆకట్టుకుంటే.. సెకెండాఫ్ మాత్రం పేరెంట్స్‌ను బాగా ఆకట్టు కుంటుంది.
ట్యాగ్‌లైన్: యూత్‌ని టార్గెట్ చేసే పిట్టలు..
రేటింగ్: 2.5/5