Euphoria Movie Review: యుఫోరియా మూవీ రివ్యూ

ABN , Publish Date - Feb 05 , 2026 | 10:59 PM

గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం 'యుఫోరియా'. భూమిక, సారా అర్జున్, విఘ్నేష్‌ గవిరెడ్డి, గౌతమ్ మీనన్, నాజర్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమాను నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించారు.

Euphoria Movie

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) 'యుఫోరియా' (Euphoria) మూవీని ప్రకటించగానే... సగటు సినీ ప్రేక్షకులు చాలామంది దాని అర్థం ఏమిటా? అని గూగుల్ లో సెర్చ్ చేశారు. అదే సమయంలో గుణశేఖర్ మూవీ థీమ్ ఏమిటనేది గ్లింప్స్ రూపంలో తెలియచేశారు. పబ్ కల్చర్ కు అలవాటు పడిన నవతరం డ్రగ్స్ కు బానిస అయ్యి, అకృత్యాలకు పాల్పడటం, తద్వారా జరిగే అనర్థాల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే సెన్సిబుల్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ అంశాలను ఎలా తీస్తారనే సందేహాలకు 'యుఫోరియా' జనం ముందుకు రావడంతో తెర పడింది. ఈ సినిమాను రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించారు. 'ఒక్కడు' మూవీ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి నటి భూమిక గుణశేఖర్ దర్శకత్వంలో 'యుఫోరియా'లో నటించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం 'ధురంధర్'లో నాయికగా నటించిన ఒకప్పటి బాలనటి సారా అర్జున్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రను పోషించింది.

'యుఫోరియా' కథ విషయానికి వస్తే... సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న చైత్ర (సారా అర్జున్ Sara Arjun) అనే అమ్మాయిని పబ్ నుండి బయటకు తీసుకెళ్ళి ఐదుగురు అబ్బాయిలు మానభంగం చేస్తారు. ధైర్యాన్ని గూడగట్టుకుని చైత్ర వాళ్ళ మీద కేసు పెడుతుంది. అమ్మాయి మైనర్ కావడంతో పోక్సో యాక్ట్ కింద వారిని అరెస్ట్ చేస్తారు. వారంతా సమాజంలో పలుకుబడి ఉన్న వారి పిల్లలే! అందులో విద్యా సంస్థల ప్రిన్సిపల్ వింద్య వేములపల్లి (భూమిక Bhumika) కొడుకు వికాశ్‌ (విఘ్నేష్‌ గవిరెడ్డి) కూడా ఉంటాడు. కొడుకు చేసిన పనికి తీవ్ర దిగ్భాంతికి గురైన వింధ్య కొడుక్కి, అతని స్నేహితులకు శిక్షపడేలా ఆధారాలను కమీషనర్ కు అందిస్తుంది. జైలు జీవితం గడిపిన వికాశ్ లో ఎలాంటి మార్పు వచ్చింది? కొడుకును సన్మార్గంలో పెట్టాలని ఆరేళ్ళ తర్వాత జైలు నుండి పెరోల్ పై బయటకు తీసుకొచ్చిన వింద్య లక్ష్యం నెరవేరిందా? కొడుకు కోసం వింద్య పడిన తాపత్రయ ఫలితం ఏమిటీ? అనేది మిగతా కథ.

euphoria123.jpg


సమాజంలో ఇవాళ జరుగుతున్న వివిధ సంఘటనలను ఆధారంగా చేసుకుని గుణశేఖర్ ఈ కథ రాసుకున్నారు. ఈ సినిమా చూస్తుంటే... కొన్నేళ్ళ క్రితం జరిగిన పలు సంఘటనలు మన కళ్ళ ముందు మెదులుతాయి. ఉన్నత వర్గాలకు చెందిన వారి పిల్లల విచ్చలవిడి తనం, వారి పట్ల తల్లిదండ్రులకు ఉండే అపరిమితమైన వాత్సల్యం, వారు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నా నిరోధించలేని నిస్సహాయత ఇందులోని పాత్రల ద్వారా గుణశేఖర్ తెలియచేసే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో సమాజంలో చాపకింద నీరులా పాకిపోతున్న డ్రగ్స్ కల్చర్ నివారించడానికి సిటీ కమీషనర్ జయదేవ్ (గౌతమ్ వాసుదేవ మీనన్ Goutham Vasudeva Menon) వంటి వారు ఎలాంటి ఘన చర్యలు తీసుకుంటున్నారో తెలిపారు. తెర మీద వాస్తవ సంఘటనలు కథ రూపంలో కనిపిస్తుంటే ఆ చేదు నిజాలను చూసి తట్టుకోవడం సగటు ప్రేక్షకుడికి కష్టంగానే ఉంటుంది. అందువల్ల ఈ సినిమా వారికి మింగుడుపడని ఓ చేదు గుళిక అనిపిస్తుంది.

దర్శకుడు గుణశేఖర్ ఇప్పటి వరకూ తీసిన సినిమాలు వేరే. ఇప్పుడు 'యుఫోరియా' ద్వారా చెప్పిన కథ, చెప్పాలనుకున్న సందేశం వేరు. దాన్ని అవగాహన చేసుకున్నవారికి ఇది 'నీడ్ ఆఫ్ అవర్' మూవీ అనిపిస్తుంది. అయితే తాను చెప్పాలనుకున్న విషయాన్ని హార్డ్ హిట్టింగ్ గా చెప్పే ప్రయత్నం చేయడంతో ప్రేక్షకులు కాస్తంత అసహనానికి గురయ్యే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ప్రతి సన్నివేశం వెనుక ఆయన ఎంత హోమ్ వర్క్ చేసినా... వాటిని ప్రజెంట్ చేసిన విధానంలో ఎక్కడో ఏదో డిస్కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కొడుకును సరైన దారిలో పెట్టలేని నిస్సహాయ స్థితిలో భూమిక పాత్ర సైతం తప్పటడుగులు వేయడాన్ని ప్రేక్షకులు ఎంతవరకూ యాక్సెప్ట్ చేస్తారనే సందేహం కలుగుతుంది.

ఈ సినిమాకు వెన్నెముక భూమిక పాత్రే! ఆమె దానిని సమర్థవంతంగా పోషించింది. ముఖ్యంగా దర్శకుడు గుణశేఖర్ కు ఆమె సరెండర్ అయ్యిందనే చెప్పాలి. అలానే ఈ సినిమాకు ఆయువు పట్టు క్లయిమాక్స్. సినిమా ద్వితీయార్థం కాస్తంత అటూ ఇటూ వెళ్ళినా... పతాక సన్నివేశంలో సారా అర్జున్ ప్రదర్శించిన ఉత్తమ నటన ప్రేక్షకులను కంట తడిపెట్టిస్తుంది. ఆ సన్నివేశంలో విఘ్నేష్‌ గవిరెడ్డి సైతం చక్కగా నటించి మంచి మార్కులు పొందాడు. ఇందులో పోలీస్ కమీషనర్ గా గౌతమ్ వాసుదేవ మీనన్, భూమిక భర్తగా రోహిత్, జడ్జిగా నాజర్, సైకో పాత్రను అడ్డాల పృథ్వీరాజ్ పోషించారు. ఇతర పాత్రలలో కల్పలత, సింగర్ సందీప్, రాజా రవీంద్ర, సాయి శ్రీనివాస రెడ్డి, ఆశ్రిత వేముగంటి, లిఖిత యలమంచిలి తదితరులు కనిపించారు. నాగేంద్ర కాశి, కృష్ణ హరి అందించిన సంభాషణలు, కాలభైరవ (Kalabhairava) సమకూర్చిన స్వరాలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ మూవీ మూడ్ ను క్యారీ చేసింది.

దర్శకుడు గుణశేఖర్ ఎంచుకున్న కథ, దాన్ని తెరకెక్కించిన విధానం ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉంది. జన్ జడ్ ను దృష్టిలో పెట్టుకుని గుణశేఖర్ మూవీ టైటిల్ నుండి ప్రతి విషయంలోనూ భిన్నంగా ప్రయత్నించారు. అయితే నేటి యువత నుండి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందనేది వేచిచూడాలి.

రేటింగ్ : 2.5/5

ట్యాగ్ లైన్: తట్టుకోలేని తీవ్రత!

Updated Date - Feb 05 , 2026 | 11:02 PM