రఘు కుంచె 'గేదెల రాజు' సినిమా రివ్యూ
ABN , Publish Date - Apr 24 , 2026 | 03:23 PM
రఘు కుంచె టైటిల్ రోల్ పోషించి, ప్రెజెంటర్ గా వ్యవహరించిన సినిమా 'గేదెల రాజు'. చైతన్య మోటూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
రఘు కుంచె (Raghu Kunche) బేసికల్‌గా టీవీ హోస్ట్. ఆపైన డబ్బింగ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్! అయితే ఆరేళ్ళ క్రితం వచ్చిన 'పలాస' (Palasa) సినిమా అతనిలోని నటుడిని జనాలకు పరిచయం చేసింది. దాంతో అతని కోసమంటూ కొందరు రచయితలు పాత్రలను రాయడం మొదలు పెట్టారు. అలాంటి పాత్రే 'గేదెల రాజు' (Gedela Raju) కూడా! అందుకే తాను టైటిల్ రోల్ ప్లే చేసిన 'గేదెల రాజు' సినిమాకు నిర్మాణ భాగస్వామిగాను వ్యవహరించాడు. ఈ సినిమాను చైతన్య మోటూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన 'గేదెల రాజు' మూవీ శుక్రవారం జనం ముందుకొచ్చింది.
కాకినాడలో నివసించే గేదెల రాజు (రఘు కుంచె) అనే రౌడీ షీటర్ కథ ఇది. అంచెలంచెలుగా ఒక్కో ఏరియాపైనా పట్టు బిగించిన గేదెల రాజు, బేవర్స్‌గా తిరిగే కుర్రాళ్ళను తన వైపు తిప్పుకుని అన్ని రకాల దందాలు చేస్తుంటాడు. ఎమ్మెల్యే కనుసన్నలలో మెలుగుతూ, నిదానంగా కార్పొరేటర్ అయిపోవాలని కలలు కంటాడు. సీటు కూడా సంపాదించుకుని పోటీకి దిగడమే తరువాయి అనుకుంటున్న టైమ్‌లో హత్యకు గురవుతాడు. వావి వరసలు లేకుండా అచ్చోసిన ఆంబోతులా జీవితాన్ని గడిపిన గేదెల రాజును ఎవరు చంపారనేదే ఇందులోని మెయిన్ పాయింట్. గేదెల రాజును చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఎందుకుంది? అతని మాజీ శత్రువులు ఎవరు? ప్రస్తుతం ఉన్న విరోధులు ఎవరు? వారిలో ఎవరు గేదెల రాజును హత్య చేశారనే ఇన్వెస్టిగేషన్ చుట్టూ కధ సాగుతుంది. నిజానికి ఇలాంటి కథలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ హీరోగా ఉంటాడు. కానీ ఇందులో అలా కాదు... చుట్టూ జరిగే పరిస్థితులకు సీఐ (దివ్య) కేవలం ఓ సాక్షిగానే మనకు కనిపిస్తుంది. గేదెల రాజు జీవితం ఎలా మొదలై, ఎలా అంతమైందనే అంశాన్ని, అతని హత్యకు ఎవరు కారణం కావచ్చుననే దాన్ని మిక్స్ చేసి, మూవీని ప్రెజెంట్, ఫ్లాష్ బ్యాక్ లలో చూపించాడు దర్శకుడు. దాంతో సగటు ప్రేక్షకుడు గందరగోళానికి లోనయ్యే ఆస్కారం ఏర్పడింది.
రౌడీ షీటర్ జీవితంలో జరిగిన సంఘటనలు తెరకెక్కించే క్రమంలో దర్శకుడు చైతన్య మోటూరి చాలానే తడబడ్డాడు. గేదెల రాజు పాత్రను ఎస్టాబ్లిష్ చేయడంపై చూపిన శ్రద్థ మిగిలిన విషయాలపై పెట్టలేదు. ప్రధాన పాత్రను సైతం దర్శకుడు... తన చేతిలో కీలుబొమ్మలా ఇష్టానుసారంగా నడిపేశాడు. పొలిటీషియన్స్ ను కూడా తన గ్రిప్‌లో పెట్టుకునే గేదెల రాజు పాత్ర కార్పొరేటర్ ఎన్నికలలో గెలవడం కోసం ఆస్తులు అమ్ముకున్నట్టు చూపడం అసలు అతకలేదు. ఇక గేదెల రాజుతో గతంలో గొడవపడిన శత్రువులపై అనుమానం వచ్చేలా దర్శకుడు ఈ కథను, సన్నివేశాలను రాసుకున్నాడు. అతన్ని హత్య చేసే ఆస్కారం ఎవరికి ఉందనే విషయంలో ప్రేక్షకులకు హింట్ ఇస్తూనే... అది తప్పు అని భ్రమించేలా చేశాడు. దాంతో క్లయిమాక్స్‌లో డైరెక్టర్ మైండ్ గేమ్‌ను అప్లయ్ చేశాడు తప్ప మరోటి కాదనే నిర్ణయానికి ఆడియెన్స్ వచ్చేస్తారు. పైగా క్లయిమాక్స్‌లో కూడా క్లారిటీ లేకుండా హడావుడిగా ముగించేశాడు. అవకాశం లభిస్తే... దీనికి సీక్వెల్ తీయాలనే కోరిక మేకర్స్‌కు ఉందేమో అనిపించింది. అసలు సినిమా ఆడినప్పుడే సీక్వెల్ కి క్రేజ్ వస్తుందనే బేసిక్ థింగ్ కూడా దర్శకనిర్మాతలు మర్చిపోయారేమో అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే... గేదెల రాజు పాత్రలో రఘు కుంచె బాగా ఒదిగిపోయాడు. అయితే అతనిలోని క్రూరత్వాన్ని పూర్తి స్థాయిలో తెర మీద చూపించలేదు. మనిషిలోని కుచ్చితాన్ని సన్నివేశాల పరంగా ఎలివేట్ చేసినా... ఎందుకో పూర్తి స్థాయిలో అది ఎస్టాబ్లిష్ కాలేదు. గేదెల రాజు ఒకప్పటి స్నేహితుడు, ప్రస్తుత విరోధి శివయ్యగా రవి చిన్నిబెల్లి బాగా చేశాడు. తనదైన హావభావాలతో ఆ పాత్రను రక్తి కట్టించాడు. యువ జంట విజయ్, సత్యగా రామచంద్ర పుణ్యమూర్తుల, టీనా శ్రావ్య చక్కగా సెట్ అయ్యారు. అలానే మరో జంట రిచ్, మీరాగా వికాస్, కలపాల మౌనిక బాగున్నారు. వీరిపై చిత్రీకరించిన మెలోడీ సాంగ్ హృద్యంగా... బాగుంది. ఈ నలుగురు పాత్రోచితంగా నటించారు. గేదెల రాజు ప్రత్యర్థి పాత్ర పోషించిన శ్రీకాంత్ అయ్యంగార్‌ను పెద్దగా ఉపయోగించుకోలేదు. ఇక సిఐ పాత్ర పోషించిన దివ్య పూర్తిగా తేలిపోయింది. ఏదో డైలాగ్స్ అప్పచెప్పినట్లు ఉంది తప్ప పాత్రను ఓన్ చేసుకుని నటించినట్లు అనిపించదు. ఇది సినిమాకు పెద్ద మైనస్. ఇతర పాత్రల్లో లోహిత్ అఖిల్, కిట్టయ్య, అను తదితరులు కనిపిస్తారు.
రఘు కుంచె స్వరరచన, నేపథ్య సంగీతం కూడా బాగుంది. కాకపోతే కథను గందరగోళ పర్చకుండా... మరింత సులువుగా స్ట్రెయిట్ నేరేషన్ లో చెప్పి ఉంటే ఈ సినిమా రీచ్ బాగుండేది. కానీ దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో చేసిన మ్యాజిక్ రివర్స్ అయ్యింది. దాంతో ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పుడు చూడొచ్చనే భావన ప్రేక్షకుడికి కలగకమానదు.
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: అయోమయపు గేదెల రాజు!