Thudakkam Review: అమ్మాయిల ఆత్మరక్షణకు 'ఆరంభం'

ABN , Publish Date - Oct 04 , 2026 | 06:37 AM

మోహన్ లాల్ కుమార్తె విస్మయ కథానాయికగా పరిచయమైన మలయాళ సినిమా తుడక్కం.

Vismaya Mohanlal Thudakkam

తుడక్కం (మలయాళం)

నటీనటులు: విస్మయ, మోహన్ లాల్, సాయికుమార్, రమేష్ కొట్టాయం

దర్శకత్వం: జూడ్ ఆంథనీ జోసెఫ్

నిడివి: 139 నిముషాలు

విడుదల: జియో హాట్ స్టార్

'నీ తండ్రి గౌరవాన్ని నిలబెట్టు' అనే అర్థం వచ్చే వాక్యమేదో అంటుంది తుడక్కం (Thudakkam) సినిమాలో మార్షల్ ఆర్ట్ గురువు మోహన్ లాల్ (Mohanlal) పాత్ర శిష్యురాలు హీరోయిన్‌తో. సినిమాలో తండ్రి మరెవరో కానీ నిజజీవితంలో ఆ హీరోయిన్ స్వయానా మోహన్‌లాల్ కూతురే కావడంతో... చాలా మామూలు డైలాగ్‌కు అదనపు విలువ వచ్చి చేరింది. మోహన్‌లాల్ చెప్పినందుకు కాకపోవచ్చు కానీ అతని కూతురు విస్మయ తండ్రి పేరు నిలబెట్టేందుకు మంచి ప్రయత్నమే చేసింది. 'తుడక్కం' జూడ్ ఆంథనీ జోసెఫ్ (Jude Anthany Joseph) దర్శకత్వంలో, మోహన్ లాల్ కుమార్తె విస్మయ (Vismaya Mohanlal) కథానాయికగా పరిచయమైన మలయాళ సినిమా. తుడక్కం (Thudakkam) అంటే ఆరంభం. ఈ సినిమాలో ఆరంభమయ్యేది కేవలం విస్మయ మోహన్ లాల్ నటజీవితం కాదు. భయపడటం మాత్రమే స్త్రీకి తెలిసిన సహజ స్పందన కాదనీ, అవసరమైనప్పుడు తిరగబడటం కూడా ఆమె శరీరానికి తెలిసిన భాషేననీ చెప్పే ప్రయత్నం కూడా.

మీను చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన యువతి. తండ్రి రవితో కలిసి జీవిస్తుంది. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందిన ఆమె జీవితం అనుకోకుండా ఒక నేర ప్రపంచంతో ఢీకొంటుంది. అక్కడి నుంచి సినిమా సర్వైవల్ థ్రిల్లర్ రూపం తీసుకుంటుంది. ఒక ప్రమాదకరమైన కాంట్రాక్ట్ కిల్లర్‌తో ఆమె ఎదుర్కొనే సంఘర్షణ కథకు కేంద్రం. కథగా ఇందులో అసాధారణమైన కొత్తదనం లేదు. ప్రమాదంలో చిక్కుకున్న యువతి, ఆమెను వేటాడే హంతకుడు, తప్పించుకునే ప్రయత్నం, చివరకు ప్రతిఘటన.. మనకు తెలిసిన థ్రిల్లర్ వ్యాకరణమే. కానీ దర్శకుడు ఆ తెలిసిన కథలో స్త్రీ శరీరాన్ని బాధిత శరీరంగా కాకుండా.. ప్రతిఘటించే శరీరంగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడే విస్మయ ప్రధాన ఆకర్షణ. ఆమెను మొదటి సినిమాలోనే భారీ డైలాగులు, గ్లామర్, రొమాంటిక్ ట్రాక్లతో 'స్టార్' తయారు చేయడానికి ప్రయత్నించకుండా, శారీరక శ్రమను కోరే పాత్రలోకి పంపడం ఆసక్తికరం. విస్మయ తన తండ్రి మోహన్ లాల్‌ను అనుకరించడానికి ప్రయత్నించకపోవడం ఆమె నటనలో గొప్ప విషయం. ముఖంలో అతి కదలికలు లేవు.

కొన్నిచోట్ల అదే భావోద్వేగ తీవ్రతను తగ్గించవచ్చుకాక. అయినా తొలి చిత్రానికి ఆమె ప్రదర్శించిన తెర విశ్వాసం మెచ్చుకోదగ్గదే. కచ్చితంగా మంచి పాత్రలు చేయగల సత్తా ఉన్న నటి విస్మయ. సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం. భయం నుంచి హింసకు జరిగే కదలిక. సాధారణంగా సినిమాల్లో హీరోకి హింస ఒక హిరోయిక్ అలంకారం. అతను కొడితే బీజీఎం పెరుగుతుంది. అతడు పొడిస్తే దృశ్యం కరుణాత్మకమవుతుంది. ఇక్కడ మీను కొట్టడం 'హీరోయిజం' కన్నా ముందు బతకడానికి అవసరమైన చర్య. అందుకే సినిమాలోని యాక్షన్‌లో ఒక ఆర్గానిక్ నాణ్యత కనపడుతుంది. ఒక అమ్మాయి మిస్సింగ్ వ్యవహారంగా కనపడి ఆ అమ్మాయి ఇంటికి చేరుకున్నాక ప్రేక్షకుడు హమ్మయ్య అనుకునే లోపే.. అదే అమ్మాయి కాంట్రాక్ కిల్లర్‌తో యుద్ధానికి దిగడం అనే కథ జంప్ కొంచెం అసౌకర్యంగా అనిపించినా బిగువు వల్ల ప్రేక్షకుడు పట్టించుకోడు.


కాంట్రాక్ కిల్లర్‌ను హీరోయిన్ పరిథిలోకి తేవడానికే పొరుగింట్లో ఒక క్రైమ్ డ్రామాని సృష్టించడం కూడా కొంచెం కృత్రిమం అనిపించినా బహుశా నాటకీయతలో భాగమే కావచ్చు. 'తుడక్కం' ఒక నటికి ప్రారంభం. ఒక స్త్రీ పాత్ర తన భయాన్ని దాటడానికి ప్రారంభం. మలయాళ సినిమాలో స్త్రీకి 'రక్షించబడే పాత్ర’ నుంచి 'తనను తాను రక్షించుకునే పాత్ర' వైపు మరో చిన్న అడుగు. విస్మయ మోహన్లాల్‌కు ఈ సినిమా ఒక ప్రకటనలా కాకుండా ఒక ప్రశ్నలా ముగుస్తుంది. ఇక్కడి నుంచి ఆమె ఎటు వెళుతుంది? అని. బహుశా తొలి సినిమాకు అంతకంటే మంచి ముగింపు అవసరం లేదు. ఎందుకంటే ప్రతీ మంచి 'తుడక్కం' లోనూ పూర్తి సమాధానం ఉండదు. ముందుకు. వెళ్లడానికి ఒక దారి మాత్రమే ఉంటుంది.

అయితే సినిమా రెండో భాగానికి వచ్చేసరికి ఈ సున్నితత్వాన్ని కొంత కోల్పోతుంది. మొదటి సగంలోని సర్వైవల్ టెన్షన్ క్రమంగా సంప్రదాయ మాస్ మసాలా వైపు మళ్లుతుంది. మోహన్‌లాల్ ప్రత్యేక పాత్ర ప్రవేశం కూడా ఈ షిఫ్టుకు కారణం. ఒక యువతి తనంతట తాను ఎదుర్కొంటున్న ప్రమాదమే కథకు సరిపడా బలం ఇచ్చినప్పుడు, స్టార్ నటుడి ఉనికి కథ మీద మరో పొరలా పడడం అనవసరం. అయితే హీరోయిన్ మోహన్ లాల్ కూతురు కావడం ఆయన పాత్ర ప్రవేశానికి కారణం కావచ్చు. అందులో కమర్షియల్ ఎలిమెంట్‌ను కాదనలేం.

సినిమా స్త్రీ స్వతంత్రత గురించి మాట్లాడాలనుకుంటుంది. కానీ అప్పుడప్పుడు కమర్షియల్ సినిమా పాత అలవాట్ల నుంచి బయటపడ లేకపోతుంది. సినిమాలో తండ్రీకూతుళ్ల అనుబంధం ఒక భావోద్వేగ లంగరు. ఆమెకు తండ్రితో ఉన్న అనుబంధం కథలో కీలకం. ఆమెకు ఒక ఇల్లు ఉంది, ఒక గతం ఉంది, ఒక పెళుసు వర్తమానం ఉంది. యాక్షన్ సినిమాల్లో పాత్రలకు ఇలాంటి భావోద్వేగ గణాంకాలు లేకపోతే వాళ్లు కేవలం కొట్టే శరీరాలుగా మిగిలిపోతారు. 'తుడక్కం' కనీసం ఆ ప్రమాదాన్ని చాలా తప్పించుకుంటుంది.

సాంకేతికంగా సినిమా ఉత్కంఠను నిర్మించడంలో సౌండ్ డిజైనింగ్, ఎడిటింగ్‌లో, యాక్షన్ కొరియోగ్రఫీలో జాగ్రత్తగా ఉంది. ముఖ్యంగా మొదటి భాగంలో ప్రేక్షకుడికి ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో పూర్తిగా తెలియనివ్వకుండా దర్శకుడు సస్పెన్స్‌ను నిలబెడతాడు. అమ్మాయి ఇంటికి చేరేంతవరకు సినిమా గ్రిప్పింగ్‌గా ఉంది. హీరోయిన్ ఓ

ఇద్దరు అమ్మాయిలను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో చూపిన తెగువ, తెలివి రెండూ కూడా సినిమాకు నిండుదనాన్నిచ్చాయి.‘తుడక్కం'ను ఒక థ్రిల్లర్‌గార్గా కన్నా అమ్మాయిల ఆత్మరక్షణకు, మోహన్ లాల్ కూతురుకూ ఒక ఆసక్తికరమైన ప్రారంభంగా చూడటం బాగుంటుంది. - ప్ర‌సేన్‌, 70133 58154

Updated Date - Oct 04 , 2026 | 07:06 AM