Kara Review: ధనుష్ , మమిత బైజు నటించిన 'కర' మూవీ ఎలా ఉందంటే

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:58 PM

ధనుష్‌, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్‌ రాజా దర్శకుడు. కె.ఎస్‌.రవికుమార్‌, జయరామ్‌, కరుణాస్‌, సూరజ్‌ వెంజ్రమూడు కీలక పాత్రధారులు. ఇషారి కె గణేశన్‌ తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని సీహెచ్‌ సతీశ్‌కుమార్‌ తెలుగులో విడుదల చేశారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించిందో చూద్దాం.

సినిమా రివ్యూ: కర
ధనుష్, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె.ఎస్.రవికుమార్, జయరామ్, కరుణాస్, సూరజ్ వెంజ్రమూడు కీలక పాత్రధారులు. ఇషారి కె గణేశన్ తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని సీహెచ్ సతీష్  కుమార్  తెలుగులో విడుదల చేశారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ:

కరస్వామి(ధనుష్) ఇంట్లో తండ్రి కందస్వామి (కె.ఎస్.రవికుమార్) దాచిన డబ్బు దొంగిలించి ఊరి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత దొంగగా మారతాడు. అయితే భయంతో పరుగులు తీస్తూ బతకడం ఇష్టం లేక ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని చివరి దొంగతనం చేసి మానేయాలనుకుంటాడు. స్నేహితుడు మురుగేశన్(పృథ్వీ రాజన్)తో కలిసి చివరి దొంగతనానికి వెళ్లి పట్టుబడతాడు. రిటైర్మెంట్ టైమ్ లో మంచి కేసు డీల్ చేసి పేరు తెచ్చుకోవాలి… వార్తల్లో పాపులర్ కావాలనుకునే డి.ఎస్పీ సూరజ్ ( సూరజ్‌ వెంజరమూడు  )ఈ కేసును టేకప్ చేస్తాడు. అక్రమ కేసులు పెట్టి పాపులర్ కావాలనుకే సూరజ్ ను కొట్టి కరస్వామి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోతాడు. ప్రియురాలు మల్లి (మమిత బైజు)ని పెళ్లి చేసుకొని ఎవరికీ తెలియకుండా దూరంగా హోటల్లో పని చేస్తూ ఉంటాడు. ఇద్దరితో కష్టంతో సంపాదించే డబ్బు సరిపోక భార్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఓ హోటల్ పెట్టుకుని బతకాలనుకుంటారు. అయితే బ్యాంక్ లోన్ రాకపోవడంతో పదహారేళ్ల తర్వాత సొంతూరికి వెళ్లి  తండ్రి పొలం అమ్మాలనుకుంటాడు. అప్పటికే పొలం తాకట్టుపెట్టి వడ్డీ కట్టలేక కష్టాల్లో ఉన్న తండ్రి నిరాకరిస్తాడు. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన కొడుకు డబ్బు కోసమే వచ్చాడని తెలిసి బాధతో మరణిస్తాడు కందస్వామి. లోన్ లో ఉన్న పొలంతో తండ్రి అంత్యక్రియలు చేయకూడదని బ్యాంకు వాళ్లు అడ్డుపడతారు. దాంతో తండ్రి భౌతిక కాయాన్ని అనాధ శవంగా మార్చురీలో ఉంచి పొలం విడిపించటానికి మళ్లీ దొంగతనం మొదలుపెడతాడు. మాయ మాటలు చెప్పి రైతులకు లోన్లు ఇచ్చి వారిని దోచుకుంటున్న  బ్యాంక్ ను దోచి అందరి లోన్లు కట్టాలనుకుంటాడు. అతని ప్లాన్ వర్కవుట్ అయిందా? అసలు బ్యాంక్ దొంగతనాల వెనుక ఎవరున్నారు? తన తండ్రి మాటలను బలంగా నమ్మే ఆ ఊరి కోసం కరస్వామి ఏం చేశాడు అన్నదే కథ.  (Kara Review)
 


విశ్లేషణ..

గల్ఫ్ యుద్ధం జరుగుతున్న 90 బ్యాక్ డ్రాప్ లో బ్యాంక్ లు నేషనలైజ్ కాని టైమ్ లో మాయ మాటలు చెప్పి రుణాల పేరుతో బ్యాంకులు చేస్తున్న మోసాలు, దాని వల్ల రూరల్ ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్న అంశంతో తీసిన సినిమా ఇది. ప్రథమార్ధంలో ధనుష్ పాత్ర పరిచయం, కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకోవడం, సొంతూరు వెళ్లడం, తండ్రిని కలవడం, ఇద్దరి మధ్య భావోద్వేగ సన్నివేశాలతో బాగా స్లో నేరేషన్ తో  సాగుతుంది. తండ్రి మరణంతో కరస్వామిలో మార్పు రావడం, విరామ సమయానికి ముందు జరిగే బ్యాంక్ రాబరీ సన్నివేశాలతో ఇంటర్వెల్ ఆసక్తికరంగా మలిచారు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. సెకెండాఫ్ ప్రారంభం నుంచి వాట్ నెక్ట్స్ అనే యాంగ్జైటీ కలుగుతుంది. అయితే కరెక్ట్ గా ఎంగేజ్ కావలసిన సన్నివేశాల్లో అప్పుడప్పుడు ట్రాక్ తప్పిన భావన కలుగుతుంది. తన తండ్రిని నమ్మి బ్యాంకులో లోన్లు తీసుకున్న జనాన్ని కష్టాల నుంచి గట్టెక్కించే పతాక సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. తండ్రి సెంటిమెంటుతో చక్కని ముగింపు కూడా ఇచ్చాడు దర్శకుడు.

 
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విలేజ్ కుర్రాడిగా కర స్వామి పాత్రలో ఒదిగిపోయాడు. ప్రజెంట్ యూత్ కి క్రష్ అయిన మమిత బైజు తొలిసారి డీ గ్లామర్ పాత్రలో కనిపించారు. తన పాత్ర నిడివి తక్కువ అయినా నటనతో ఆకట్టుకుంది. కందస్వామిగా కెఎస్ రవికుమార్ జీవించాడు. బ్యాంక్ రీజనల్ మేనేజర్  పాత్రలో జయరామ్... యస్.పిగా సూరజ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు. కరుణాస్, పృథ్వీ రాజన్ తదితరులంతా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ సినిమాటోగ్రఫీ. తేని ఈశ్వర్ కథకు తగ్గట్టు కెమెరా వర్క్ బాగా చేశారు. కానీ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మార్క్ సినిమాలో కనిపించలేదు సందర్భానుసారం వచ్చే రెండు పాటలు సోసో… తెలుగు డబ్బింగ్ విషయంలో కొంత వరకూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ధనుష్ గత చిత్రం 'ఇడ్లీ కడై' కూడా ఇదే తరహాలో తండ్రి సెంటిమెంటుతో వచ్చినదే. ఈసారి కూడా అదే జానర్ సినిమా కావటం కొంత నిరాశకు గురిచేస్తుంది. తమిళనాడులో ధనుష్ ఇమేజ్ వల్ల కొంత మేరకు ఆకట్టుకున్నా తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందన్నది ప్రశ్నార్ధకమే.  


ట్యాగ్ లైన్:
అర '(కొ)కర'
రేటింగ్:
2.25 / 5

Updated Date - Apr 30 , 2026 | 04:41 PM