ధనుష్‌ ‘ఓం’.. నిరాశపరిచిన సినిమా!

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:48 PM

ధనుష్‌, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఓం సినిమా ఎలా ఉంది? ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? పూర్తి రివ్యూ చదవండి.

O.m movie

తమిళ స్టార్ హీరో ధనుష్‌కు గత కొంత కాలంగా చెప్పుకోదగ్గ విజయం లేదు. గత యేడాది అతను నటించిన 'కుబేర, ఇడ్లీకొట్టు' చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అయితే హిందీలో చేసిన 'తేరే ఇష్క్ మే' చిత్రమే కాస్తంత ఫర్వాలేదనిపించింది. ఇక ఈ యేడాది ఏప్రిల్‌ లో వచ్చిన 'కర' సైతం నిరాశ పర్చింది. ఈ నేపధ్యంలో అతనితో పాటు అభిమానులంతా 'ఓం' సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో మలయాళ సీనియర్‌ నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషించగా, ఆయన భార్యగా రేణు దేశాయ్‌ నటించారు. తెలుగువారికి సుపరిచితులైన సాయి పల్లవి, శ్రీలీల ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. దాంతో తెలుగులోనూ ఈ సినిమా ఏదో ఒక స్థాయిలో ప్రేక్షకాదరణకు నోచుకుంటుందని అంతా భావించారు. మరి వారి అంచనాలను 'ఓం' నిజం చేసిందా లేదా అనేది తెలుసుకుందాం.


పళని (ధనుష్‌) ఓ అండర్ కవర్ పోలీస్‌ ఆఫీసర్. తిరుపతి సమీపంలో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడం కోసం టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ నిత్యారెడ్డి (సాయి పల్లవి)తో కలిసి పనిచేస్తుంటాడు. ఈ స్మగ్లింగ్‌ ముఠాలో అత్యంత కీలకమైన వ్యక్తి దుబాయ్‌లో ఉండే అబ్దుల్ హమీద్ (నసీరుద్దీన్ షా). అతనికి లోకల్‌గా ఉండే కార్తికేయన్‌ (మమ్ముట్టీ) సహకరిస్తుంటాడు. దాదాపు వెయ్యి టన్నుల ఎర్రచందనంను ఎలా బోర్డర్ దాటించాలో తెలియక వీరు సతమతమౌతుంటారు. ఆ సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ లా కార్తికేయన్‌ ముఠాలో చేరతాడు పళని. తన పేరు తిరు అని చెబుతాడు. కార్తీకేయన్ కు అత్యంత విశ్వాసపాత్రుడిగా మారిపోతాడు. ఇదే అదనుగా భావించి దుబాయ్ లో ఉన్న అబ్దుల్ హమీద్‌ ను ఇండియా రప్పించి అరెస్ట్ చేయాలని నిత్యా రెడ్డి పథక రచన చేస్తుంది. అయితే ఊహించని విధంగా పళని తండ్రి ఓ పోలీస్‌ ఎన్ కౌంటర్ లో చనిపోతాడు. దాంతో అతని పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుంది. పళని ని నమ్ముకుని రంగంలో దిగిన నిత్యారెడ్డి పరిస్థితి ఏమైంది? కార్తికేయన్ తో పాటు అబ్దుల్ హమీద్‌ను అరెస్ట్ చేయాలనుకున్న ఆమె లక్ష్యం నెరవేరిందా? ఇటు డ్యూటీ, అటు పర్సనల్ లైఫ్ లో జరిగిన కోలుకోలేని దెబ్బను పళని ఎలా బాలెన్స్ చేశాడు? అనేదే మిగతా కథ.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపధ్యంలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో 'పుష్ప' అగ్రస్థానంలో నిలిచింది. దానిని మించిన సినిమా ఏదైనా వస్తే తప్పితే... మిగిలినవేవీ లెక్కలోకి రావు. అయితే ఈ సినిమాలో దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి కేవలం ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద దృష్టి పెట్టకుండా, చెట్లు నరకడానికి వచ్చే కూలీలు, వాళ్ళపై జరిగే పోలీసులు దాడులు, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన అమాయకులైన వ్యక్తుల కుటుంబాల దీనగాథను జనాలకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు. అందువల్ల సినిమా ప్రథమార్ధం వరకూ ఒకలా సాగి, ద్వితీయార్థంలో పూర్తిగా యూ టర్న్ తీసుకున్నట్టు అయ్యింది. చివరిలో నిత్యారెడ్డి పాత్రను ముగించిన తీరు కూడా సమంజసంగా అనిపించదు. బలవంతంగా ఆమె పాత్రపై సానుభూతిని తీసుకురావాలని చేసినట్టయ్యింది. ప్రతినాయకుడి శిబిరంలోకి ఓ పోలీస్‌ ఆఫీసర్ అండర్ కవర్ ఏజెంట్‌గా వెళ్ళే సినిమాలకు లెక్కేలేదు. ఇలాంటి సినిమాలు చూసి ప్రేక్షకులు విసిగిపోయారు. ఇందులో ఆ డ్రామా చాలాసేపే దర్శకుడు నడిపాడు. ఇదిలా ఉంటే పళని, అతని భార్య రోజా (శ్రీలీల) విడాకుల ఎపిసోడ్ మరో తలనొప్పి భాగోతం. ఇష్టపడి పెళ్ళి చేసుకున్న భర్తను అర్థం చేసుకోకుండా, విడాకుల కోసం లాయర్ చుట్టూ తిరగడం, కనీసం అతను చెప్పేది ఆలకించకపోవడం ఆ పాత్ర ఔచిత్యాన్ని తగ్గించేసింది.


ధనుష్‌ ఈ సినిమాలో కొత్తగా చేయడానికి ఏమీ లేకపోయింది. సినిమాలో ప్రధాన పాత్రధారి సాయిపల్లవి. ఆమె పాత్ర సైతం అప్ అండ్ డౌన్‌లోనే సాగింది. తండ్రీని, భర్తను కోల్పోయిన ఆమె పాత్రను అర్థాంతరంగా ముగించడం సరికాదనిపిస్తుంది. ఇక శ్రీలీల ధనుష్‌ సినిమా కాబట్టి కాదలేక అంగీకరించన్నట్టు ఉంది. సీనియర్‌ నటుడు మమ్ముట్టి ఇలాంటి స్మగ్లర్ పాత్రలను ఇప్పటికే ఎన్నో సార్లు చేశారు. ఆయన భార్యగా నటించిన రేణూ దేశాయ్‌ నటనకూ పెద్దంత స్కోప్‌ లేదు. నసీరుద్దీన్ షాను పూర్తి స్థాయిలో దర్శకుడు ఉపయోగించుకోలేదు. ఇతర ప్రధాన పాత్రలను సంజయ్‌ స్వరూప్‌, చైతన్య జొన్నలగడ్డ, శివాజీ రాజా, ప్రదీప్‌, ఇంద్రన్స్ తదితరులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు పాత్రలో దయాకర్ రెడ్డి మెరుపులా మెరిశారు. సాయి అభ్యంకర్ స్వరాలు సాదాసీదాగా ఉన్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలను డామినేట్ చేసేలా ఉంది.

శేషాచలం అడవుల్లో వాస్తవానికి 2014లో జరిగిన ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన దాదాపు 20 మంది కూలీలు చనిపోయారు. ఆ సమయంలో ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల మధ్య కొంత ఉద్రిక్తత నెలకొంది. 'ఓం' సినిమాను అదే అంశం మీద తెరకెక్కిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ అది పాక్షిక సత్యమే. దర్శకుడు పూర్తి స్థాయిలో అదే అంశాన్ని తీసుకుని ఉంటే కథ వేరేలా ఉండేది. కానీ ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను ఛేదించే కథలో ఈ మానవీయ కోణాన్ని ఇరికించాలనుకోవడంతో ఇది రెంటికీ చెడ్డ రేవడి అయిపోయింది. సినిమాలో ఏదో ఉంటుందని థియేటర్ కు వెళ్ళిన వారిని నిరాశకు గురిచేసింది. పైగా 'అమరన్' లాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన రాజ్‌ కుమార్ పెరియస్వామి నుంచి ఇలాంటి సినిమాను ప్రేక్షకులు అసలు ఊహించరు.

రేటింగ్‌: 2/5

ట్యాగ్‌ లైన్: అంచనాలు తారుమారు!

ఇవి కూడా చదవండి:

‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి సినిమా ఎలా ఉందంటే?

‘ఈఎన్ఈ రిపీట్’ రివ్యూ.. ఫన్ ఉంది.. సోల్ మిస్సింగ్!

Updated Date - Nov 21 , 2026 | 04:55 PM