Devagudi Review: దేవగుడి సినిమా రివ్యూ

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:41 PM

అభినవ్ శౌర్య, అనుశ్రీ, రఘు కుంచే కీలక పాత్రలు పోషించిన సినిమా 'దేవగుడి'. స్వీయ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

Devagudi movie review

ఇటీవల కాలంలో ప్రాంతాల నేపథ్యంలో, రియలిస్టిక్ కథలతో మేకర్స్ ప్రయోగాలు చేస్తున్నారు. అలా చాలా కాలం తర్వాత రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం ‘దేవగుడి’. రఘు కుంచె కీలక పాత్ర పోషించగా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకనిర్మాతగా తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

రాయలసీమలోని దేవగుడి ప్రాంతానికి చెందిన దేవగుడి వీరారెడ్డి (రఘు కుంచె Raghu Kunche) ఓ ఫ్యాక్షన్ లీడర్. ఆ ప్రాంతవాసులకు దైవంలాంటివాడు. అయితే అతనికి కులం పట్టింపు ఎక్కువ. తన ప్రాణాలను కాపాడే అనుచరుడిని సైతం కులం పేరుతో చిన్నచూపు చూస్తుంటాడు. అతనికి ఒకమ్మాయి శ్వేత, ఒకబ్బాయి రాఘవ (నరసింహ). వీరారెడ్డి అనుచరుడి కుమారుడు ధర్మ (అభినవ్ శౌర్య Abhinav Sourya). పిల్లలు ముగ్గురు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. తన కుమారుడితో అనుచరుడి కుమారుడు స్నేహంగా ఉండడాన్ని కూడా సహించడు వీరారెడ్డి. ఈ క్రమంలో వీరారెడ్డి కుమార్తె శ్వేత, అనుచరుడి కుమారుడు ధర్మతో ప్రేమలో ఉందనే విషయం బయటపుడతుంది. దాంతో అతన్ని చంపబోయి చివరి క్షణంలో వదిలేస్తాడు. ఆ తర్వాత ధర్మ, శ్వేత ప్రేమ వ్యవహారం ఏమైంది? స్నేహితుడిపై రాఘవ కక్ష పెంచుకోవడానికి కారణమేంటి? చివరికి ఏం జరిగిందన్నది మిగతా కథ.


విశ్లేషణ:

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఫ్యాక్షన్ సినిమాలు మనకు కొత్త కాదు. చాలా సినిమాల్లో చూసిందే! రాయలసీమలోని పెద్ద సామాజిక వర్గం, చిన్న కులం నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని దానికి చిన్న ప్రేమకథను జోడించి తెరకెక్కించారు. 20 కార్లతో కాన్వాయ్, ఛేజ్లు, బాంబ్ బ్లాస్ట్ లతో సినిమా ఆరంభమవుతుంది. ఇవేమీ కొత్తగా అనిపించవు. వీరారెడ్డి పాత్రకు అంత బిల్డప్ ఇవ్వడం వెనక సరైన రీజన్ చెప్పి ఉంటే బాగుండేది. అతని ప్రత్యర్థి గా ఓ వ్యక్తి పేరు సినిమా ప్రారంభం నుంచి వినిపిస్తుంది. అయితే అతనెవరో. అతను వీరారెడ్డిని ఎటాక్ చేయడం వెనకున్న కారణం ఏమిటో చూపించలేదు. కనీసం వాయిస్ ఓవర్ లో కూడా చెప్పలేదు. తర్వాత కథ అంతా తక్కువ కులానికి చెందిన ధర్మ, వీరారెడ్డి కూతురు శ్వేత ప్రేమకథ మీద నడిపించాడు. సినిమా చూసినంత సేపు గోపీచంద్ (Gopichand) నటించిన యజ్ఞం గుర్తుకు వస్తుంది. కాకుంటే ఈ సినిమా అంతా దేవగుడి అనే గ్రామం నేపథ్యంలో జరుగుతుంది. మనిషి రాతియుగంలో పుట్టినా అంతరిక్షంలో అడుగుపెడుతున్నా కుల జాడ్యం, చిన్న పెద్దా అనే తేడాల మధ్యే బతుకుతున్నామనే సందేశాన్ని ఇచ్చారు. అందులో భాగంగా కథకు సంబంధం లేని, లాజిక్ లేని సీన్స్ ఎన్నో. ప్రథమార్ధం కాస్త బోరింగ్గా ఉన్నా ద్వితీయార్థం మాత్రం చకచకా సాగిపోయింది. ఎన్నో ఫ్యాక్షన్ సినిమాల్లో చూసిన కథే కావడంతో ఫ్రెష్ గా అనిపించదు. వాట్ నెక్ట్స్ అనేది ఊహించేలా ఉంది. కథను కాస్త గ్రిపింగ్ గా చెప్పుంటే బావుండేది.


నటీనటుల విషయానికి వస్తే… ఈ సినిమాలో హీరోగా నటించిన అభినవ్ శౌర్య, హీరోయిన్ గా నటించిన అనుశ్రీ, రాఘవ పాత్రలో నటించిన నరసింహ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అభినవ్ యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశాడు. ఈ మధ్యకాలంలో సంగీత దర్శకుడు రఘు కుంచెకి మంచి పాత్రలు దక్కుతున్నాయి. ఇందులో ఫ్యాక్షనిస్ట్ దేవగుడి వీరారెడ్డి పాత్రలో చక్కగా ఇమిడిపోయాడు. మీసాల లక్ష్మణ్, రఘుబాబు (Raghu Babu), రాకెట్ రాఘవ వంటి నటులు నవ్వించే ప్రయత్నం చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. రాయలసీమ అందాలను చక్కగా తెరకెక్కించారు. మదిన్ సంగీతం సినిమాకు అతి పెద్ద ఎసెట్. చిన్న పిల్లలపై చిత్రీకిరించిన పాటతో పాటు డ్యూయెట్ సాంగ్ కూడా వినసొంపుగా ఉండి చిత్రీకరణ పరంగానూ ఆకట్టుకున్నాయి. నిర్మాత క్వాలిటీ విషయంలో కూడా రాజీ పడలేదన్నది స్పష్టం అవుతుంది. ఏది ఏమైనా కొత్త దనం లేక పోవడం సినిమాకు పెద్ద మైనస్.

రేటింగ్: 2.5/5

ట్యాగ్ లైన్: లాజిక్ లేని రొటీన్ దేవగుడి

Updated Date - Jan 30 , 2026 | 05:57 PM