Babita Singh Reporting: ఒకటి చెపుతున్నట్టనిపించి.. మరింకేదో చెప్పేదే గొప్ప కథ
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:32 PM
ఒకటి చెపుతున్నట్టనిపించి మరింకేదో చెప్పేదే గొప్ప కథ. పైపైన చూస్తే థ్రిల్లర్. కానీ లోపల తనను తాను వెతుక్కుంటున్న ఓ స్త్రీ కథ ‘బబితా సింగ్ రిపోర్టింగ్.
బబితా సింగ్ రిపోర్టింగ్ (హిందీ)
నటీనటులు: నిమిషా సజయన్, బరున్ సో బ్తీ, అన్షుమన్ ఫుష్కర్
దర్శకత్వం: అంబికా పండిట్
నిడివి: 131 నిమిషాలు
విడుదల: అమెజాన్ ప్రైమ్
ఒకటి చెపుతున్నట్టనిపించి మరింకేదో చెప్పేదే గొప్ప కథ. ‘బబితా సింగ్ రిపోర్టింగ్ ’ (Babita Singh Reporting) అలాంటిదే. పైపైన చూస్తే థ్రిల్లర్. కానీ లోపల తనను తాను వెతుక్కుంటున్న ఓ స్త్రీ కథ. ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ లో వంటగదిలో ఉనికిని కోల్పోయిన స్త్రీ.. ఇక్కడ పోలీసు యూనిఫామ్‌లో అదే పితృస్వామ్యపు మరో గదిలో చిక్కుకున్న స్త్రీగా కనిపించడం కొనసాగింపు. దర్శకురాలు అంబికా పండిట్ (Ambiecka Pandit), కథా రచయిత అమితా వ్యాస్ (Amita Vyas) అలా అనుకున్నారో లేదో కానీ రెండు పాత్రలనూ మోసింది నిమిషా సజయన్ (Nimisha Sajayan) కనుక ఈ పోలిక. ‘రిపోర్టింగ్ సర్’ అనేది పోలీసు వ్యవస్థలో పై అధికారికి చెప్పే సాధారణ గుమాస్తాతనం. కానీ సినిమా ముగిసే సమయానికి దాని మరో అర్థం బయటపడుతుంది. బబిత ఎవరో ఒకరికి నిత్యం రిపోర్ట్ చేస్తూనే ఉంది. ఆఫీసులో బాస్‌కు. ఇంట్లో భర్తకు. అత్తింట్లో కుటుంబానికి. సమాజ నియమాలకు. నిజానికి చివరికి ఆమె చేయాల్సిన అత్యంత ముఖ్యమైన రిపోర్టింగ్ తన మనస్సాక్షికి. అందుకే ఈ సినిమా క్లయిమాక్స్ నేరస్థుడిని గుర్తించడంలో లేదు. బబిత తనను తాను గుర్తించడంలో ఉంది.
నేరం జరుగుతుంది. పోలీసులు నేరస్థుడిని వెతుకుతారు. నిజం బయటపడుతుంది. కానీ ఈ సినిమాలో ఒక మరణం వెనుక నిజాన్ని వెతుకుతూ బయలుదేరిన పోలీసు అధికారిణి, చివరికి తన జీవితంలో దాగిన అబద్ధాలను కనుగొంటుంది. ఇది మర్డర్ మిస్టరీ వేషంలో వచ్చిన స్త్రీ అంతరంగపు దర్యాప్తు. ఈ కథలో బబిత ‘లేడీ సింగమ్’ కాదు. నడకలో హీరోయిజం ఉండదు. డైలాగుల్లో పంచ్‌లు ఉండవు. విచారణలోనూ తడబాటే. సహోద్యోగుల సాయం అడుగుతుంది. తప్పులు చేస్తుంది. కనుకనే ఆమె నిజమే అనిపిస్తుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయపడుతూనే మరో అడుగు వేయడం అని చెపుతుంది. సినిమా ముందుకు వెళ్లేకొద్దీ ఒక లోతైన అంతర్గత నిర్మాణం కనిపిస్తుంది. స్నేహితుడు బన్సీ మరణానికి కారణాలను పొరలుగా తొలగిస్తుంది బబిత. అదే క్రమంలో తన జీవితంలోని పొరలూ తొలగిపోతున్నా యని తెలుసుకుంటుంది. బన్సీ గురించి తనకు అన్నీ తెలుసనుకుంది. తెలియదు. భర్త గురించి తెలుసనుకుంది. తెలియదు. తన గురించి తనకు తెలుసనుకుంది. అదీ నిజం కాదు.
సినిమా మొదలైన కొద్దిసేపటికే మనకు ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తుంది. బబిత పోలీసు యూనిఫామ్‌లో ఉంటుంది. కానీ ఆమెకు తన మీద తనకే అధికారం లేదు. ఆమె ఏఎస్‌ఐ. కానీ పై అధికారి ముందు తన గొంతు బలహీనం. ఇంటికి వచ్చాక భర్త ముందు మరింత బలహీనం. అత్తింట్లోకి అడుగుపెట్టాక పూర్తిగా మూగ. అందరినీ సంతోష పెట్టాలి. ఎవరికీ ఇబ్బంది కలిగించ కూడదు. తన వల్ల కుటుంబంలో అలజడి రాకూడదు. అలా జీవితమంతా తన ఉనికిని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వచ్చిన స్త్రీ బబిత. వయసొచ్చింది. ఉద్యోగముంది. యూనిఫామ్ ఉంది. చట్టం ఇచ్చిన అధికారముంది. తన నిర్ణయాలకు తానే యజమాని అయ్యేంతగా మాత్రం ఆమెను ఎదగనివ్వలేదు ఈ ప్రపంచం. ఈ సినిమాలో అత్యంత సున్నితమైన భావోద్వేగ కేంద్రం బబిత, బన్సీ సంబంధం. బన్సీ ఆమె ప్రేమికుడు కాదు. కొన్ని అనుబంధాలకు ప్రేమ అనే పేరు పెట్టాల్సిన అవసరం ఉండదు. అతను ప్రేమించేది మరో అమ్మాయిని. చదువుకునేప్పుడు ఆ అమ్మాయికి బన్సీ రాసిన ఉత్తరాలను బబితాయే అందించేది. చిన్నప్పుడు బబిత శరీరాకృతి కారణంగా అవమానాలు ఎదుర్కొన్నప్పుడు ఆమె పక్కన నిలబడిన వ్యక్తి బన్సీ. మిగతా ప్రపంచం ఆమె శరీరాన్ని చూసినప్పుడు, అతను ఆమెను చూశాడు. ఒకానొక రోజు ఏదో చెప్పాలనుకుంటాడు. కానీ జీవితం ఎప్పటిలాగే ‘తర్వాత మాట్లాడుకుందాం’ అంటుంది. ఆ ‘తర్వాత’ ఎప్పటికీ రాదు. అదే రోజు బన్సీ చనిపోతాడు.
ఇక్కడి నుంచే సినిమా అసలు విషాదం మొదలవుతుంది. ఎందుకంటే బబిత వెతుకుతున్నది బన్సీని చంపిన వ్యక్తిని మాత్రమే కాదు. ‘నిన్న అతను చెప్పాలను కున్నది ఒక్కసారి విని ఉంటే?’ అనే తన అపరాధ భావనకు సమాధానాన్ని కూడా. బన్సీ మరణం తర్వాత బబితలో మేల్కొనేది పోలీసు మాత్రమే కాదు. ఒకప్పుడు తనను తాను విలువైన మనిషిగా భావించేలా చేసిన స్నేహితుడికి తీర్చాల్సిన రుణం కూడా. సినిమాలో నిమిషా సజయన్ నటన అసాధారణం. ఎవరైనా అవమానించినప్పుడు వెంటనే తిరగబడ లేక, క్షణం పాటు నవ్వి ఊరుకుని, ఆ తర్వాత ఆ మాట లోపలికి ఇంకి వేధిస్తున్నప్పుడు ఆమె కళ్లలో కనిపించే చిన్న గాయం ఈ సినిమా. బబిత భర్త శరద్ ప్రేమించేవాడిలా కనిపించే పితృస్వామ్యం. అతను విలన్‌లా కనిపించడు. ఆమెను వెక్కిరించడం, ఆమె ఆత్మవిశ్వాసాన్ని చిన్నచిన్న వ్యాఖ్యలతో దెబ్బ తీయడం, కుటుంబం ముందు ఆమె పక్షాన నిలబడకపోవడం అతని నిజస్వభావాలు. అదే ఈ పాత్రలోని ప్రమాదకరమైన అందం.
పితృ స్వామ్యం ఎప్పుడూ గలభా చేయదు. అది నవ్వుతుంది. జోక్ చేస్తుంది. చివరకు ఒక స్త్రీకి తన మీద తనకే అనుమానం వచ్చేలాచేస్తుంది. బబిత జీవితంలోనూ అదే. సినిమాలో అత్తింటి సన్నివేశాలు అందుకే కీలకం. ఏఎస్సై అత్తింట్లో అంట్లుతోముతుంది. తెల్లవారుజామున లేచి ఇంటి అవసరాలు చూస్తుంది. గర్భిణి ఆడపడు చుకు పసుపుపాలు సిద్ధం చేస్తుంది. సినిమా ఇక్కడ చాలా చక్కటి చిక్కటి ప్రశ్న వేస్తుంది. ఒక స్త్రీ సంపాదిస్తే ఆమె స్వతంత్రురాలైపో తుందా? ఆమె చేతిలో అధికారం ఉంటే ఇంట్లోనూ ఆమెకు అదే అధికారం ఉంటుందా? లేదు. ఆమె వ్యక్తిత్వం మీద కుటుంబం అంటిం చిన లేబుళ్లు పోలీసు బ్యాడ్జి కంటే బలమైనవి. ఏ మనిషి జీవితంలోనైనా అత్యంత కష్టమైన కేసు బయట జరిగిన నేరం కాదు. తనకు తానే ఎన్నో ఏళ్లుగా చేసుకుంటున్న అన్యాయాన్ని గుర్తించడం. ఆ కేసులో నిందితుడూ మనమే. సాక్షీ మనమే. దర్యాప్తు అధికారీ మనమే. తీర్పు చెప్పాల్సింది కూడా మనమే. - ప్రసేన్, 70133 58154