సినిమా రివ్యూ: కార్మేని సెల్వం..
ABN , Publish Date - Apr 03 , 2026 | 08:29 PM
తెలుగు, తమిళ భాషల్లోని విలక్షణ నటుల్లో సముతిరకని ఒకరు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కార్మేని సెల్వం’. లక్ష్మీప్రియ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు రామ్ చక్రి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూద్దాం…
సినిమా రివ్యూ: కార్మేని సెల్వం.. (Carmeni Selvam)
తెలుగు, తమిళ భాషల్లోని విలక్షణ నటుల్లో సముతిరకని ఒకరు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కార్మేని సెల్వం’. లక్ష్మీప్రియ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు రామ్ చక్రి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూద్దాం…
కథ:
సెల్వం (సముతిరకని) మధ్య తరగతి కుటుంబానికి చెందిన కారు డ్రైవర్. సంపత్ (గౌతమ్ మీనన్) దగ్గర ఎంతో నమ్మకంగా పని చేస్తుంటాడు. సెల్వం భార్య శాంతి (లక్ష్మి ప్రియ) ఇంటి సమీపంలో ఇడ్డీ కొట్టు నడుపుతూ భర్తకు ఆసరాగా ఉంటుంది. బాగా డబ్బు సంపాదించి సొంత ఇల్లు కట్టుకోవాలని కూడబెట్టిన డబ్బులో కొంత పొదుపు చేస్తుంటారు ఈ దంపతులు. మేనకోడలికి సారె పెట్టే విషయంలో వీరికి అవమానం ఎదురవుతుంది. భర్తను తక్కువ చేసి మాట్లాడారని వెంటనే దాచుకున్న డబ్బు, మెడలో నగలను తాకట్టు పెట్టి సారె పెడుతుంది శాంతి. ఆ తర్వాత కొద్ది రోజులకే సెల్వం కొడుకు ప్రమాదానికి గురవటంతో బాగా ఖర్చు అవుతుంది. దాంతో అప్పు చేయాల్సి వస్తుంది. దానిని తీర్చడం కోసం యజమాని సంపత్ లేని సమయంలో ఆయన కారుని క్యాబ్ గా తిప్పి డబ్బు సంపాదిస్తాడు సెల్వం. ఎవరో చెప్పిన మాటలు విని డబ్బు ఖర్చు చేస్తూ మరింతగా అప్పులపాలవుతాడు. ఆ అప్పులు తీర్చడానికి సెల్వం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? కష్టాల నుంచి ఎలా గట్టెక్కాడు? అన్నది మిగతా కథ.

విశ్లేషణ:
మధ్యతరగతి కుటుంబాల్లో కొందరు ఉన్నంతలో సర్దుకు పోతుంటే మరి కొందరు అందని దానికి ఆశపడి గొప్పలకు పోయి అధిక ఖర్చుతో అప్పుల పాలవుతున్నారు. ఈ సినిమాను అలాంటి అంశాలతోనే తెరకెక్కించారు దర్శకుడు రామ్ చక్రి. మధ్య తరగతి మనుషుల్లో డబ్బు ఎలాంటి ఆశ పెంచుతుంది. నిక్కచ్చిగా ఉండేవారిని మాయా లోకంలోకి తీసుకెళ్లి ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తుందనే విషయాన్ని ఈ చిత్రంలో సెల్వం పాత్ర ద్వారా చూపించారు. దర్శకుడు పాత్రలను పరిచయం చేసిన తీరు బాగుంది. ఓనర్ సంపత్ తో అనుబంధం, కొడుకు తండ్రీ మధ్య బంధం, భావోద్వేగాలు వీటన్నింటితో ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. చెల్లి ఇంట్లో సెల్వంకు అవమానం జరగడం నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. చేసిన అప్పులు తీర్చడం కోసం సెల్వం పడే కష్టం, ఎదురైన అవమానాలు, కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం ఇవన్నీ సెకండాఫ్ కు కీలకం. ఇంట్లో భార్య భర్తకు మధ్య ఘర్షణ సీన్, ఇంటి స్థలం కొనే సన్నివేశం… వీటిని దర్శకుడు చాలా బ్యాలెన్స్డ్ గా తెరకెక్కించారు. పతాక సన్నివేశాల్లో సెల్వం, కొడుకు, భార్య మధ్య సాగే భావోద్వేగభరితమైన సీన్స్, డబ్బు సంపాదన కోసం కుటుంబాన్ని వదిలి షార్జా వెళ్లి అక్కడ ఉండలేక సెల్వం పడే వేదన చూస్తే ఎలాంటి వ్యక్తి గుండె అయినా బరువెక్కాల్సిందే! ఎంతో కాలంగా తననే నమ్ముకున్న సెల్వంకు చివర్లో సంపత్ ఇచ్చిన సర్ప్రైజ్ హైలైట్. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయేలా తీశారు. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు ఎంతో హృద్యంగా మలిచారు. అయితే ప్రాసెస్ అంతా స్లోగా ఉండటంతో థియేటర్ లో ఉండే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. 'అందని దాని కోసం ఆశపడకూడదు. అవసరం లేనివి కొంటే.. అవసరమైనవి కోల్పోతాం’ అనే సందేశంతో సినిమా ముగుస్తుంది. సినిమా అంతా స్లోగా ఉందనే విషయం పక్కన పెడితే మధ్యతరగతి వాళ్లు సినిమాలోని భావోద్వేగాలకు బాగానే కనెక్ట్ అవుతారు.
నటీనటుల పనితీరు...
మధ్య తరగతి భర్తగా సెల్వం పాత్రకు సముతిరకని న్యాయం చేశాడు. మధ్యతరగతి భార్యగా లక్ష్మీ ప్రియ కూడా అద్భుతమైన నటన కనబర్చారు. ఇద్దరి జోడీ బాగుంది. వీళ్ల కొడుకుగా కనిపించిన పిల్లాడు కూడా చక్కటి నటన ప్రదర్శించాడు. కాసేపే కనిపించినా గౌతమ్ మీనన్ తనదైన మార్క్ వేశాడు. దర్శకుడు రాసుకున్న కథను ప్రేక్షకుల హృదయాలకు చేరేలా తీర్చిదిద్దాడు. ఈ ప్రాసెస్ లో కథనం నెమ్మదిగా ఉండటం, ఊహకు అందే సీన్స్ పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. రామానుజన్ సంగీతం, యువరాజ్ కెమెరా వర్క్ బాగున్నాయి. మొత్తం మీద మధ్యతరగతి కుటుంబాలకు కనెక్ట్ అయ్యే కథ.
ట్యాగ్‌లైన్: మిడిల్ క్లాస్ సెల్వం..
రేటింగ్: 2.5/5