ఐశ్వర్య రాజేష్ సుకుమారి షాక్ ఎలా ఉందంటే.. 

ABN , Publish Date - Jul 17 , 2026 | 01:21 PM

ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ జంటగా నటించిన చిత్రం 'ఓ సుకుమారి'. భరత్ దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం 

సినిమా రివ్యూ: ఓ సుకుమారి.. (Oh sukumari Review)

విడుదల తేదీ: 17-7-2026

టాలీవుడ్‌ నుంచి ఈ వారం భారీ చిత్రాలు ఏమీ లేకపోవడంతో చిన్న చిత్రాలు విడుదలకు క్యూ కట్టాయి. దాదాపు ఎనిమిదికి పైగా చిన్న సినిమాలు థియేటర్స్‌లో విడుదలయ్యాయి. అందులో ఒకటి ‘ఓ సుకుమారి’. ఇందులో ఐశ్వర్య రాజేష్‌(Aishwarya Rajesh) , తిరువీర్‌ (Thiruveer) జంటగా నటించారు. ఓటీటీల నుంచి వెండితెర వరకూ విభిన్న కథలతో ప్రయాణం చేసే తిరువీర్‌ ఈసారి ఇంకాస్త భిన్నమైన కథను ఎంచుకున్నారు. భరత్‌ దర్శన్‌ దర్శకత్వంలో మహేశ్వరరెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో కూడా విడుదలైంది. ముట్టు కుంటే షాక్‌ కొట్టే ఈ అమ్మాయి కథ ఎలా ఉందో చూద్దాం.

కథ: (Oh sukumari Review)

యాదగిరి (తిరువీర్‌) ది ఎడ మొహం, పెడ మొహంగా ఉండే ఉమ్మడి కుటుంబం. తాతయ్య రాసిన వీలునామా ప్రకారం... మనవళ్ళలో ఎవరికి మొదట మగబిడ్డ పుడితే, వాళ్ళకు 80 ఎకరాల ఆస్తి సొంతం అవుతుంది. అందుకోసం పెళ్లి సంబంధం కోసం పక్క ఊరుకి వెళ్తాడు యాదగిరి. అక్కడ దామిని (ఐశ్వర్య రాజేష్‌)ని చూసి, ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని డిసైడ్‌ అవుతాడు. దామినికి పుట్టుక నుంచి ఓ సమస్య ఉంటుంది. ఆమెను ఎవరు టచ్‌ చేస్తే వారికి షాక్‌ కొడుతుంది. ఆ సమస్యతో ఆ ఊళ్లో వారంతా ఇబ్బంది పడుతుంటారు. ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా గుట్టుగా నిశ్చితార్థం, పెళ్ళి జరిపిస్తారు గ్రామస్తులు. పెళ్లి తర్వాత యాదగిరికి కొన్ని సమస్యలు ఎదురై భార్యకు దూరంగా ఉంటాడు. అలాగే దామిని రాకతో ఎడమొహం, పెడ మొహంగా ఉన్న కుటుంబంలో ఎలాంటి మార్పులొస్తాయి? ఆమె కరెంట్‌ షాక్‌ సమస్యకు పరిష్కారం దొరికిందా? యాదగిరి, దామిని మళ్లీ కలిశారా? లేదా అన్నది కథ.


విశ్లేషణ:

ఓ అమ్మాయిని ఎవరు ముట్టుకున్నా లేదా ఆ అమ్మాయి ఎవరిని ముట్టుకున్నా... ఎదుటి వ్యక్తికి షాక్‌ తగలడం.. దాని నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది ఈ సినిమాలో కీలకాంశం. కథగా వింటే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంది. కానీ తెరపై అంత ఆసక్తిగా సాగలేదనిపిస్తుంది. హీరోయిన్‌ చిన్నతనం.. ఆమెను ముట్టుకుంటే కరెంట్‌ షాక్‌ ఎందుకు కొడుతుంది? హీరోతో పరిచయం.. ఆమెలో ఉన్న సమస్యను బయటపెట్టకుండా హీరోతో పెళ్లి చేసేయడంతో ఫస్టాఫ్‌ సాగుతుంది. ఇదంతా ఆసక్తికరంగా కాస్త నవ్వులు పూయించేలా సాగుతుంది. ఇక సెకెండాఫ్‌లో ఆమెకు టచ్‌ చేస్తే కరెంట్‌ షాక్‌ కొడుతుందని హీరోకి తెలియడం.. అక్కడి నుంచి కథ అంతా ఉమ్మడి కుటుంబపు భావోద్వేగాలు, భార్యభర్తల మధ్య సమస్యల నేపథ్యంలో సాగుతుంది. ఈ సన్నివేశాల్లో డెప్త్‌ ఉన్నా ఎందుకో తెరపై రక్తి కట్టలేదు. తెరపై నవ్వంచగలిగే ఆర్టిస్ట్‌లు ఉన్నా నవ్వులు పండలేదు. సెకెండాఫ్‌లో భావోద్వేగాలకు ఎంతో స్కోప్‌ ఉన్న ప్రతి సీన్‌ ఇరికించిన భావన కలుగుతుంది. దర్శకుడు భరత్‌ రాసుకున్న కథలో మెయిన్‌ పాయింట్‌ బాగున్నా.. ఆకట్టుకునే తరహాలో సన్నివేశాలను రాసుకోలేదు. ముందు ఏం జరగబోతుందనే ఆసక్తి లేకుండా సాగింది. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లు చెప్పలేకపోయాడని అర్థమవుతుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు విషయానికొస్తే.. యాదగిరి పాత్రకు తిరువీర్‌ నూరు శాతం న్యాయం చేశాడు. ప్రతి సీన్‌లోనూ నేచురల్‌గా కనిపించాడు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో మెప్పించే ఐశ్వర్య రాజేష్‌... దామిని పాత్రనూ సమర్థవంతంగా పోషించింది. కానీ ఆమె స్థాయి నటన చూపించడానికి ఈ పాత్రలో స్కోప్‌ లేదు. టెంపుల్‌ ఫైట్‌లో మాత్రం అలరించింది. కథలో కోర్‌ పాయింట్‌ నచ్చి ఆమె ఈ సినిమా అంగీకరించిందనిపిస్తుంది. తండ్రిగా ఆనంద్‌ చక్కటి నటన కనబరిచారు. మురళీధర్‌ గౌడ్‌, ఝాన్సీ పాత్రలు సోసోగా ఉన్నాయి. హీరో తల్లిగా ఆమనికి రెండు మూడు సెంటిమెంట్‌ సీన్లతో మెప్పించారు. శ్రీనివాస్‌ గవిరెడ్డి, జీవన్‌, ‘మై విలేజ్‌ షో’ అంజిమామ ఫర్వాలేదనిపించారు. సిహెచ్‌ కుషేందర్‌ కెమెరా వర్క్‌ బావుంది. సెకెండాఫ్‌లో ఎడిటర్‌ కాస్త చురుకుగా వ్యవహరించి ఉంటే ల్యాగ్‌ అనిపించేది కాదు. భరత్‌ మాచిరాజు సంగీతంలో పాటలు ఒకే అనిపించినా నేపథ్య సంగీతం మాత్రం ఎక్కడో విన్న ఫీలింగ్‌ కలిగించింది. ఈ సినిమా కాన్సెప్ట్‌ వరకూ వినడానికి బావుంటుంది కానీ తెరపై చూడటానికి అంత ఆసక్తిగా లేదు. కథలో లింక్‌, సింక్‌ కరెక్ట్‌గా లేదు. ఫైనల్‌గా హీరోయిన్‌ నుంచి షాక్‌ తగలడం ఎందుకు ఆగిపోయిందో రీజన్‌ చెప్పలేదు. ఐశ్వర్యా రాజేష్‌, తిరువీర్‌కి ఉన్న క్రేజ్‌ను బట్టి ఎక్కువగా ఊహించుకుని సినిమాకు వెళ్తే నిరాశ తప్పదు.

ట్యాగ్‌లైన్‌: ఆడియెన్స్ కు షాకే!

రేటింగ్‌: 2.25/5

Updated Date - Jul 17 , 2026 | 03:01 PM