థియేటర్లు దొరకడం లేదు.. షిరాజ్ మెహదీ

ABN , Publish Date - Sep 28 , 2026 | 07:03 PM

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న చిత్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై మరోసారి చర్చ మొదలైంది.

shiraz mehdi

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న చిత్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై మరోసారి చర్చ మొదలైంది. ‘ఓ అందాల రాక్షసీ’ చిత్ర నిర్మాత, హీరో షిరాజ్ మెహదీ తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిన్న సినిమాలకు థియేటర్లు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాల మధ్య చిన్న చిత్రాలు నలిగిపోతున్నాయని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడిన షిరాజ్ మెహదీ, తమ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని తెలిపారు. మంచి కథ, సాంకేతిక నిపుణుల సహకారంతో రూపొందించిన చిత్రానికి సరైన విడుదల అవకాశాలు లభిస్తే మంచి ఫలితాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. థియేటర్ల కేటాయింపు విషయంలో ఎదురవుతున్న సమస్యలపై ఇప్పటికే పలుమార్లు మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు చెప్పారు.

డిజిటల్ డెలివరీ వ్యవస్థ, విడుదల ప్రక్రియలో చిన్న నిర్మాతలపై అధిక ఆర్థిక భారం పడుతోందని షిరాజ్ ఆరోపించారు. ముఖ్యంగా విడుదలకు సంబంధించిన కొన్ని సేవల కోసం అధిక రుసుములు వసూలు చేస్తున్నారని, దీనివల్ల చిన్న బడ్జెట్ చిత్రాలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

ఫిల్మ్ ఛాంబర్, మల్టీప్లెక్స్ వ్యవస్థల తీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. థియేటర్ల కేటాయింపులో చిన్న సినిమాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఈ అంశంపై ఇప్పటికే న్యాయపరమైన చర్యలు కూడా చేపట్టినట్లు వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై దృష్టి సారించాలని షిరాజ్ కోరారు. చిన్న సినిమాలు, వాటిపై ఆధారపడి జీవించే టెక్నీషియన్లు, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. తమ సినిమా విడుదల కోసం పోరాటం కొనసాగిస్తానని, త్వరలోనే ‘ఓ అందాల రాక్షసీ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు సినీ, న్యాయ రంగాల ప్రముఖులు కూడా చిన్న సినిమాలకు అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్మాత అహ్మద్ మాట్లాడుతూ, చిన్న నిర్మాతలు భారీ పెట్టుబడులతో సినిమాలు నిర్మించినప్పటికీ సరైన విడుదల వేదికలు దొరకక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

జబర్దస్త్ పార్థు మాట్లాడుతూ, కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. రిటైర్డ్ ఏసీపీ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఒక సినిమా వెనుక ఎన్నో కుటుంబాల జీవనోపాధి ముడిపడి ఉంటుందని, చిన్న చిత్రాలకు పరిశ్రమ పెద్దలు మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

హైకోర్టు అడ్వకేట్, నిర్మాత ఆర్.వి. రెడ్డి మాట్లాడుతూ, కొత్తగా పరిశ్రమలోకి వచ్చే నిర్మాతలు మార్కెట్ పరిస్థితులు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై పూర్తి అవగాహనతో ముందుకు రావాలని సూచించారు. సినిమా నిర్మాణం మాత్రమే కాకుండా విడుదల, పంపిణీ వ్యవస్థ కూడా కీలకమని పేర్కొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 08:09 PM