జయంత్ అండ్ ది జింగోపెన్ ఫస్ట్ లుక్

ABN , Publish Date - Sep 05 , 2026 | 08:00 PM

నవీన్ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ ఫస్ట్ లుక్ టీచర్స్ డే సందర్భంగా విడుదలైంది.

Jayanth And The Jingopen

టీచర్స్ డే సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ సినిమా ఫస్ట్ లుక్‌ను ఘనంగా విడుదల చేశారు. నమో జయం ప్రొడక్షన్స్ పతాకంపై నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జయంత్ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తాతగా, సత్యం రాజేష్ స్కూల్ టీచర్‌గా నటిస్తున్నారు.దివ్య ప్రవీణ్ బొలిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీచర్స్ డే సందర్భంగా జాతీయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు మారం పవిత్ర చేతుల మీదుగా ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో జయంత్ మాట్లాడుతూ.. ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ ఒక కొత్త తరహా చిత్రమని, ప్రతిరోజూ స్కూల్లో ఎదుర్కొనే సమస్యలతో పాటు విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలను కూడా సినిమాలో చూపించినట్లు తెలిపారు. దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ తన గత చిత్రం ‘లతా భగవాన్ ఖరే’కు దేశవ్యాప్తంగా 32 అవార్డులు లభించాయని, ఫిలింఫేర్‌తో పాటు నేషనల్ అవార్డును కూడా అందుకున్నట్లు తెలిపారు. జయంత్‌ను హీరోగా పెట్టి రూపొందించిన ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ మలయాళ చిత్రం ‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’కు రీమేక్ అని వెల్లడించారు.

మలయాళంలో ‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’ 111 రోజులు ప్రదర్శితమై ఘన విజయం సాధించిందని, సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని దర్శకుడు తెలిపారు. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా తమ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.సత్యం రాజేష్ మాట్లాడుతూ.. టీచర్స్ డే రోజున తాను టీచర్‌గా నటించిన సినిమా ఫస్ట్ లుక్‌ను జాతీయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు మారం పవిత్ర చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. తమ దృష్టిలో స్కూల్ దేవాలయం, టీచర్లు దేవుళ్లతో సమానమని అన్నారు. అందుకే సినిమా ఓపెనింగ్‌ను కూడా స్కూల్‌లోనే నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పుడు సినిమా ఫస్ట్ లుక్ ప్రమోషన్‌ను కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని, ఇది తనకు, తన భర్త ప్రవీణ్‌కు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.ఈ చిత్రానికి మోహిత్ కులకర్ణి సంగీతం అందిస్తుండగా, నందమూరి హరి తారక రామారావు ఎడిటర్‌గా, ఆండ్రూబాబు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ట్యూన్స్, లిరిక్స్, మాటలను ప్రవీణ్ బొలిశెట్టి అందిస్తున్నారు. నాని ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ, కాశీ విశ్వనాథ్, తనికెళ్ల భరణి, మానస రాధాకృష్ణన్ తదితరులు నటిస్తున్నారు. ఫస్ట్ లుక్‌తో ఆసక్తి పెంచిన చిత్రబృందం త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ను వెల్లడించనుంది.

Updated Date - Sep 05 , 2026 | 08:06 PM