‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ విడుదల
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:32 PM
విద్యార్థులపై పెరుగుతున్న విద్యా ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణ వంటి కీలక అంశాలతో రూపొందిన ‘జై గౌరీపుత్ర గణేశా’ చిత్రం ఆడియో, ట్రైలర్ హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది.
హైదరాబాద్‌లో ‘జై గౌరీపుత్ర గణేశా’ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ వాత్సల్య ఆడియో అండ్ వీడియో ఇల్లస్ట్రేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర రచన, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. తెలుగు ఫిలిం చాంబర్ ప్రీవ్యూ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర మాట్లాడుతూ, యువతలో నైతిక విలువలు, మానవతా భావన పెంపొందించాలనే ఉద్దేశంతో చిత్ర నిర్మాణ రంగంలోకి వచ్చానని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం ఆలోచించాల్సిన కీలక అంశాలను ‘జై గౌరీపుత్ర గణేశా’లో ప్రస్తావించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా సామాజిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే చిత్రాలను నిర్మించే దిశగా ముందుకు సాగుతామని వెల్లడించారు.
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే కథాంశాలతో వచ్చే చిత్రాలకు ప్రేక్షకుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాయింట్ సెక్రటరీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, వినోదంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుచేసే చిత్రాలు అవసరమని అభిప్రాయపడ్డారు.
నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి యువత సమస్యలను సామాజిక, ఆధ్యాత్మిక కోణాల్లో చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తోందని చెప్పారు. సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, జీవన విలువలను కొత్త తరానికి చేరవేసే ప్రయత్నంగా ఈ చిత్రాన్ని అభివర్ణించారు.
విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడే కథలో ప్రధానాంశం
ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ఆత్మహత్యల వంటి సమస్యలను కేంద్రబిందువుగా చేసుకుని ‘జై గౌరీపుత్ర గణేశా’ చిత్రాన్ని రూపొందించారు. మార్కుల పోటీ, అధిక అంచనాలు, నిరంతర ఒత్తిడి కారణంగా పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం దెబ్బతింటున్న పరిస్థితులను సినిమాలో ప్రస్తావించినట్లు చిత్ర బృందం తెలిపింది. అదే సమయంలో భారతీయ జీవన విధానం, కుటుంబ బంధాలు, విలువల ఆధారంగా సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించింది.